K Keshava Rao: బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన బడా నేత
ABN , Publish Date - Jul 03 , 2024 | 05:18 PM
ఎమ్మెల్యేల వలసలకు అడ్డుకట్ట వేయలేక సమతమవుతున్న మాజీ సీఎం కేసీఆర్ సారధ్యంలోని బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి ఇదివరకే గుడ్‌బై చెప్పిన రాజ్యసభ ఎంపీ కే కేశవరావు ఈ రోజు (బుధవారం) హస్తం పార్టీలో చేరారు.
ఢిల్లీ: ఎమ్మెల్యేల వలసలకు అడ్డుకట్ట వేయలేక సమతమవుతున్న మాజీ సీఎం కేసీఆర్ సారధ్యంలోని బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి ఇదివరకే గుడ్‌బై చెప్పిన రాజ్యసభ ఎంపీ కే కేశవరావు ఈ రోజు (బుధవారం) హస్తం పార్టీలో చేరారు. ఢిల్లీలోని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పి కేశవరావుని ఆహ్వానించారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపదాస్ మున్షీ, , పార్టీ సీనియర్ కేసీ వేణుగోపాల్, మధు యాష్కీ గౌడ్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కేకే కీలక వ్యాఖ్యలు
ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఫోన్ చేశారని, పార్టీలోకి రావాలని కోరారని కే.కేశవ రావు తెలిపారు. ప్రియాంక గాంధీ కోరడంతో పార్టీలోకి వచ్చేందుకు సరేనని చెప్పినట్టు కేకే పేర్కొన్నారు. కాగా బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ చేరాలని ఈ ఏడాది మార్చి నెలలోనే నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కూడా అయ్యారు. ఆ తర్వాత మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసి పార్టీని వీడుతున్నట్టు కేకే చెప్పాకగ. ఈ సందర్భంగా కేసీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ‘మీ కుటుంబానికి పార్టీ ఏం తక్కువ చేసింది’ అని కేసీఆర్ అడిగినట్టు కథనాలు వెలువడ్డాయి. కేసీఆర్‌తో భేటీ అనంతరం బీఆర్ఎస్‌ను వీడుతున్నట్టు కే కేశవ రావు ప్రకటించిన విషయం తెలిసిందే.
‘‘ చనిపోయే వరకూ కాంగ్రెస్ (Congress)లోనే ఉంటాను. కాంగ్రెస్ తనకు సొంత ఇల్లులాంటిదని, తీర్థయాత్రలకు వెళ్లిన వారు ఎప్పటికైనా ఇంటికే చేరుతారు. నేను కూడా నా సొంత ఇల్లు కాంగ్రెస్‌లో చేరుతున్నాను. 53 ఏళ్లు కాంగ్రెస్‌లో పని చేశాను. బీఆర్ఎస్‌లో నేను పని చేసింది కేవలం పదేళ్లే’’ అని అప్పట్లో కేకే అన్నారు. కాగా కేకే కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందే ఆయన కుమార్తె విజయలక్ష్మి కూడా హస్తం పార్టీలో చేరారు. ఆయన కేకే కొడుకు మాత్రం బీఆర్ఎస్‌లోనే కొనసాగుతానని చెప్పారు.