Share News

Hanumakonda: కాళోజీ క్షేత్రం సిద్ధం..

ABN , Publish Date - Nov 15 , 2024 | 03:45 AM

ప్రజా కవి కాళోజీ నారాయణరావు పేరుతో హనుమకొండలో నిర్మించిన కళాక్షేత్రం ఆవిష్కరణకు సిద్ధమైంది. ఈ నెల 19న సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Hanumakonda: కాళోజీ క్షేత్రం సిద్ధం..

  • 19న ప్రారంభించనున్న సీఎం

  • పదేళ్లుగా నత్తనడకన పనులు

  • కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక పూర్తి

వరంగల్‌, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రజా కవి కాళోజీ నారాయణరావు పేరుతో హనుమకొండలో నిర్మించిన కళాక్షేత్రం ఆవిష్కరణకు సిద్ధమైంది. ఈ నెల 19న సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014 సెప్టెంబరు 9న కాళోజీ జయంతి రోజున అప్పటి సీఎం కేసీఆర్‌ హనమకొండ బస్‌స్టేషన్‌ సమీపంలో ప్రెస్‌క్లబ్‌ ఎదురుగా 4.25 ఎకరాల్లో కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మించేందుకు భూమి పూజ చేశారు. రూ.50 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన పనులు నత్తనడకన సాగుతుండటంతో 2022 అక్టోబరు 22న పర్యాటక శాఖ నుంచి నిర్మాణ బాధ్యతలను కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా)కు బదిలీ చేశారు.


కరోనాతో నిర్మాణ సామగ్రి ధరలు పెరిగిపోవటంతో అంచనా వ్యయం రూ.85 కోట్లకు పెంచారు. 2023 డిసెంబరు వరకు కూడా పనులు పూర్తి కాకపోవటంతో పాటు కాంట్రాక్టర్‌కు బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పాలన పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్‌ సర్కారు కాళోజీ కళాక్షేత్రం పనులపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అంచనా వ్యయం రూ.95కోట్లకు పెరిగింది. పెండింగ్‌లో ఉన్న రూ.45కోట్ల నిధులను సీఎం రేవంత్‌రెడ్డి విడుదల చేయటంతో పాటు ఆరు నెలల్లో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. దీంతో అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించి కళాక్షేత్రం పనులను అక్టోబరులో పూర్తి చేశారు. బీఆర్‌ఎస్‌ పదేళ్లలో పూర్తి చేయని కళాక్షేత్రం పనులను తాము పది నెలల్లోనే రూ.45కోట్లు వెచ్చించి పూర్తి చేశామని కాంగ్రెస్‌ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు.

Updated Date - Nov 15 , 2024 | 03:45 AM