Share News

High Court: తుది మెరిట్‌ జాబితా ఇప్పుడే ఖరారు చేయం

ABN , Publish Date - Nov 19 , 2024 | 03:10 AM

మెడికల్‌ పీజీ అడ్మిషన్లకు సంబంధించిన తుది మెరిట్‌ జాబితాను ఇప్పుడే ఖరారు చేయబోమని కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సోమవారం హైకోర్టుకు హామీ ఇచ్చాయి. కౌంటర్‌ దాఖలు చేసే వరకు ఎలాంటి చర్యలు తీసుకోబోమని తెలిపాయి.

High Court: తుది మెరిట్‌ జాబితా ఇప్పుడే ఖరారు చేయం

  • పీజీ మెడికల్‌ కౌన్సెలింగ్‌పై హైకోర్టుకు హెల్త్‌ వర్సిటీ హామీ

మెడికల్‌ పీజీ అడ్మిషన్లకు సంబంధించిన తుది మెరిట్‌ జాబితాను ఇప్పుడే ఖరారు చేయబోమని కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సోమవారం హైకోర్టుకు హామీ ఇచ్చాయి. కౌంటర్‌ దాఖలు చేసే వరకు ఎలాంటి చర్యలు తీసుకోబోమని తెలిపాయి. కొత్తగా తీసుకొచ్చిన స్థానికత నిబంధలనపై కౌంటర్‌ దాఖలు చేసేందుకు తగిన సమయం ఇవ్వాలని కోరాయి. దాంతో గడువు ఇచ్చిన హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 25కు వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్‌ 28న జీవో 148 జారీ చేసి.. వైద్య కళాశాలల్లో పీజీ ప్రవేశాల నిబంధనల్లో కొత్త అంశాలను జోడించింది.


దీని ప్రకారం పీజీలో ప్రవేశం పొందాలంటే వరుసగా 4 సంవత్సరాలు ఎంబీబీఎస్‌ ఇక్కడే చదివి ఉండాలి. తెలంగాణ కోటా కింద ఇతర రాష్ట్రాల్లో చదివిన వారు కూడా తెలంగాణ స్థానికతకు అర్హులే. నాన్‌లోకల్‌ కోటాలో తెలంగాణలో చదివిన వారు మాత్రం స్థానిక కోటాకు అర్హులు కాదు. దీనిని సవాలు చేస్తూ దాదాపు వంద వరకు పిటిషన్‌లు దాఖలయ్యాయి. వీటిపై చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ జే శ్రీనివాసరావుల ధర్మాసనం విచారణ చేపట్టింది.

Updated Date - Nov 19 , 2024 | 03:10 AM