పౌష్టికాహారంతో ఆరోగ్యకరమైన సమాజం
ABN , Publish Date - Nov 08 , 2024 | 12:33 AM
బలవర్ధకమైన ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చనిరాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు ఓరుగంటి ఆనంద్, భారతి అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతీయ ఆహార భద్రత చట్టం అమలుపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
కరీంనగర్ టౌన్, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): బలవర్ధకమైన ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చనిరాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు ఓరుగంటి ఆనంద్, భారతి అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతీయ ఆహార భద్రత చట్టం అమలుపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలు, రేషన్ షాపులు, పాఠశాలలు, గురుకులాలు సందర్శించామని తెలిపారు. ప్రతి రేషన్ దుకాణానికి బోర్డు, ఫిర్యాదుల పెట్టె, డీలరు, అధికారుల పేరు, ఫోన్ నంబరు తదితర వివరాలు కచ్చితంగా ఉండాలన్నారు. రేషన్ దుకాణాల్లో శుభ్రత పాటించాలని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాలకు పాలు, గుడ్లకు సరఫరాకు సంబంధించి ఇండెంట్ సరిపడా ఇవ్వాలన్నారు. పోషకాహార పంపిణీలో అంతరాయం రాకుండా చర్యలు తీసుకోవాలని శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. ఆహార హక్కుకు భంగం కలిగిస్తే కమిషన్ చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. గర్భంలో ఉన్న శిశువు నుంచి ఆహార హక్కు లభిస్తుందని తెలిపారు. అందులో భాగంగానే అంగన్‌వాడీలు, రేషన్ దుకాణాలు, మధ్యాహ్న భోజన పథకం వంటివి పని చేస్తున్నాయన్నారు. ప్రతి పేదవాడికి అందుబాటు ధరలో ఆరోగ్యకరమైన భోజనం అందించడమే ఆహార భద్రత చట్టం లక్ష్యమన్నారు. జిల్లాలో ఆహార కమిషన్‌కి ఇన్‌చార్జిగా డీఆర్డీవో వ్యవహరిస్తారని తెలిపారు. ప్రజలు వారి ఫిర్యాదులను డీఆర్డీవోకు అందించవచ్చని చెప్పారు. జిల్లాలో కలెక్టర్ చేపట్టిన శుక్రవారం సభ మంచి ఫలితాలు ఇస్తోందన్నారు. కొత్తపెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వందశాతం పిల్లలు సాధారణ బరువుతో జన్మించారని అన్నారు. ఆహార సమస్యలపై ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులకు సత్వరమే పరిష్కారం చూపాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థలో అందుతున్న ఫలితాలను పరిశీలించి విలువైన సలహాలు, సూచనలు ఇచ్చిన ఆహార కమిషన్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో మహేశ్వర్, డీఆర్డీవో శ్రీధర్, డీడబ్ల్యూవో సరస్వతి, డీఈవో జనార్దన్, డీఎంహెచ్‌వో వెంకటరమణ పాల్గొన్నారు.