ఫుడ్ పాయిజన్ జరగకుండా చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - Nov 24 , 2024 | 12:13 AM
జిల్లాలో రెసిడెన్షియల్ స్కూళ్లలో, వసతి గృహాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు.
- అధికారులకు కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశం
జగిత్యాల, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రెసిడెన్షియల్ స్కూళ్లలో, వసతి గృహాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. శనివారం పట్టణంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయం లోని కాన్ఫరెన్స్ హాలులో సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి రెసిడెన్షియల్ స్కూల్‌లో ఫుడ్ సేఫ్టీ కమిటీ, టెస్ట్ సేఫ్టీ కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, వసతి గృహాల్లో మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని విద్యార్థు లకు అందించాలన్నారు. పురుగుల పట్టిన బియ్యాన్ని కాకుండా నాణ్యమైన బియ్యాన్ని, ముడిసరుకులు అందించాలని ఆదేశించారు. జిల్లాలో ప్రతీపాఠశాలలో ఆహారం నాణ్యతగా ఉండేలా చూడాలని, ఎటువంటి పొరపాట్లు చేయకుండా ప్రభుత్వం ద్వారా నిర్దేశించిన పదార్థాలను వడ్డించాలని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బీఎస్ లత, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గౌతమ్‌రెడ్డి, ఆర్డీవోలు మధుసూదన్, జివాకర్ రెడ్డి, శ్రీనివాస్, డీఆర్‌డీఓ రఘువరన్, బీసీ, ఎస్‌సీ, వెల్ఫేర్ అధికారులు, జిల్లా సంబందిత అధికారులు పాల్గొన్నారు.