ముందస్తుగానే ‘ఉపాధి’ పనులు
ABN , Publish Date - Nov 18 , 2024 | 01:00 AM
ఉపాధిహామీ పథకం ద్వారా మెటీరియల్ కంపోనెంట్ కింద జనరేట్ అయ్యే నిధులను అయిన కాడికి ముందస్తుగానే శాశ్వత నిర్మాణ పనులకు సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ప్రతి ఏటా ఆర్థిక సంవత్సరం ముగిసే ఫిబ్రవరి, మార్చి నెలలోనే చేపట్టే ఆఘమేఘాల పనులకు స్వస్తి పలకాలని నిర్ణయించారు.
- జిల్లాలో రూ.25.82 కోట్ల మెటీరియల్ పనులకు ప్రతిపాదనలు
- వచ్చేనెల మంజూరు, మార్చిలోగా పూర్తిచేయాలని ఆదేశాలు
- ప్రభుత్వ నిర్ణయంతో వేగంగా జరగనున్న పనులు
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
ఉపాధిహామీ పథకం ద్వారా మెటీరియల్ కంపోనెంట్ కింద జనరేట్ అయ్యే నిధులను అయిన కాడికి ముందస్తుగానే శాశ్వత నిర్మాణ పనులకు సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ప్రతి ఏటా ఆర్థిక సంవత్సరం ముగిసే ఫిబ్రవరి, మార్చి నెలలోనే చేపట్టే ఆఘమేఘాల పనులకు స్వస్తి పలకాలని నిర్ణయించారు. ఆ పనులకు ఒక నెల రోజులే గడువు విధిస్తుండడంతో సకాలంలో పనులు పూర్తికాక, బిల్లులు రాక ఇబ్బందులు పడే పరిస్థితులు నెలకొంటున్నాయి. దీని నుంచి గట్టెక్కేందుకు ఈనెలాఖరు వరకు జరిగే ఉపాధిహామీ పనుల లేబర్ కంపోనెంట్‌లో జనరేట్ అయ్యే మెటీరియల్ కంపోనెంట్ కింద గ్రామాల్లో సీసీ రోడ్లు గానీ, గ్రామ పంచాయతీ, అంగన్‌వాడీ భవనాలు, తదితర పనులకు డిసెంబర్‌లో ప్రతిపాదనలు తీసుకుని మంజూరుచేసి మార్చి నెలాఖరులోగా పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయిం తీసుకున్నది. ఇలా చేయడం వల్ల పనులు వేగంగా జరగడంతో పాటు బిల్లులు కూడా సకాలంలో చేతికి వస్తాయని ప్రభుత్వం భావిస్తున్నది. జిల్లాలో ఇప్పటివరకు 1.19 లక్షల జాబ్ కార్డులను జారీచేయగా, వీటిపై 2.44 లక్షల మంది కూలీలు నమోదై ఉన్నారు. గ్రామీణ ప్రాంత కూలీలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా, వ్యవసాయ పనులు లేని సమయంలో ఉపాఽధి కోసం పనులు కల్పించేందుకు 2005-06 అప్పటి యూపీఏ ప్రభుత్వం గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని తీసుకవచ్చి చట్టబద్ధత కల్పించింది. జాబ్‌కార్డు కలిగిన వారందరికీ ఏడాదిలో తప్పనిసరిగా 100 రోజుల పని దినాలను కల్పించాలనే నిబంధన విధించారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయించింది. ఈ నిధుల నుంచి తప్పనిసరిగా 60 శాతం నిధులను కూలీలకు వేతనాలు చెల్లించేందుకు వెచ్చించాల్సి ఉంటుంది.
ఫ మరో 10 కోట్ల రూపాయలు..
చెరువుల్లో పూడికతీత, చెరువు కట్టల బలోపేతం, కాలువలు తీయడం, కాంటూరు కందకాలు తవ్వడం, వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లేందుకు ఫార్మేషన్ రోడ్లు, తదితర మట్టి పనులను కూలీలకు కల్పించాల్సి ఉంటుంది. కూలీలు ఎంత మొత్తంలో ఉపాధిహామీ పనులను సద్వినియోగం చేసుకుంటారో, ఆ మొత్తంలో 40 శాతం నిధులను మెటీరియల్ కంపొనెంట్ కింద శాశ్వత నిర్మాణ పనులు చేసుకునేందుకు సద్వినియోగం చేసుకుంటారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో సిమెంట్ రోడ్లు, మురికి కాలువల నిర్మాణాలు, గ్రామ పంచాయతీ, అంగన్‌వాడీ భవనాల, నిర్మాణాలు, స్త్రీశక్తి భవనాల నిర్మాణాలు, రైతు వేదికలు, డంపింగ్ యార్డులు తదితర పనులు చేపట్టారు. 2024-25లో ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 62.97 కోట్ల రూపాయలు ఉపాధిహామీ పథకం ద్వారా వెచ్చించారు. ఇందులో కూలీలకు వేతనాల కింద 50.70 కోట్లు, మెటీరియల్ కంపోనెంట్ కింద 7.90 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. కూలీలు చేసిన పనులపై లేబర్ కంపోనెంట్ 33.73 కోట్ల రూపాయలు జనరేట్ అవుతున్నాయి. ఇప్పటి వరకు ఈ కంపోనుంట్ కింద ఖర్చు చేసిన నిధులు పోనూ, ఇంకా 25.82 కోట్ల రూపాయలతో శాశ్వత నిర్మాణ పనులు చేపట్టవచ్చు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి మెటీరియల్ కంపోనెంట్ మరో 10 కోట్ల రూపాయలు జనరేట్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. ముందుగా ఇప్పటివరకు జనరేట్ అయిన నిధులతో పనులను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిధులను ఇప్పుడు వెచ్చించి, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో జనరేట్ అయ్యే మెటీరియల్ కంపోనెంట్ నిధులతో చేపట్టే పనులకు కూడా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ఆ మేరకు ఎమ్మెల్యేలు తమ పరిధిలో చేపట్టాల్సిన సీసీ రోడ్లు, మురికి కాలువలు, తదితర పనుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. డిసెంబర్ పనులు మంజూరు చేసి చకాచకా చేపట్టనున్నారు.