రాజన్నను క్షమాపణ కోరుకో
ABN , Publish Date - Nov 13 , 2024 | 12:34 AM
సాక్షాత్తు వేములాడ రాజన్న ఆలయానికి ఏటా వంద కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తామని మాట తప్పినం దుకు మాజీమంత్రి హరీష్‌రావు రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ముందు చెంపలు వేసుకొని క్షమాపణ కోరుకోవాలని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం వేములవాడలోని ఆయన నివాసంలో మాట్లాడారు.
వేములవాడ, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి) : సాక్షాత్తు వేములాడ రాజన్న ఆలయానికి ఏటా వంద కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తామని మాట తప్పినం దుకు మాజీమంత్రి హరీష్‌రావు రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ముందు చెంపలు వేసుకొని క్షమాపణ కోరుకోవాలని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం వేములవాడలోని ఆయన నివాసంలో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యలను ఖండించారు. హరీష్ రావు మామ రాజన్న ఆలయ అభివృద్ధికి ఏటా వందకోట్లు ఇస్తానని మాట తప్పినందుకు గుడిమెట్ల మీద చెంపలు వేసుకొని క్షమాపణలు కోరుతారని తాను ఆశించానన్నారు. రాజ న్న ఆలయ అభివృద్ధికి ఏటా వంద కోట్లు ఇస్తానని హామీ ఇచ్చి ఒక్క రూపాయి కేటాయించకుండా ఒక్క ఇటుక పేర్చకుండా స్వామివారిని మోసం చేసిన ఘనత కేసీఆర్‌ది అన్నారు. తాము రాజన్న ఆలయ అభివృద్ధికి సంబంధించి హామీ ఇవ్వకుండానే బడ్జెట్‌లో 50 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. పదేళ్ల పాలనలో చేసిన పాపాలతో ప్రజలు మిమ్మల్ని గద్దె దించారని, ప్రజల పోరాటం కారణంగా సోనియా గాంధీ తెలం గాణ రాష్ట్రాన్ని ఇస్తే మీ మామ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడనే విషయాన్ని గుర్తుంచు కోవాలన్నారు. సబ్బండ వర్గాల వారు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే కేవలం కేసీఆర్ కుటుంబంలోని నలుగురు మాత్రమే పదవులను అనుభవించారని, మిగులు బడ్జెట్‌గా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్ పాలనలో ఎప్పుడైనా ఒకటో తారీఖు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చారా? అని ప్రశ్నించారు. ప్రజా ప్రభుత్వంలో ఒకటో తారీఖున ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామన్నారు. 2018 ఎన్నికల్లో తనను ఓడించడానికి కలికోట సూరమ్మ చెరువు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశాడని, ఒక తట్టెడు మట్టి కూడా తీయలేదని అన్నారు. నువ్వు, మీ మామ మా ప్రాంతానికి ఏం చేశారని నిలదీశారు. రాజన్న ఆలయానికి ఏటా వంద కోట్లు కేటాయించనందుకు రాజన్న భక్తులకు, ఈ ప్రాంతంలో ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసినందుకు రైతులకు కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇటీవల బడ్జెట్‌లో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 325 కోట్ల కేటాయించి పనులు ప్రారంభించామని, కలికోట సూరమ్మ చెరువు ప్రాజెక్టు, మర్రిపల్లి రిజర్వాయర్ పనులను హరీష్ రావు చూసి వెళ్లాలని సూచించారు. ప్రజా ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అందిస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేకే విమర్శలు చేస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో గొర్ల స్కాం, బర్ల స్కాం, లిక్కర్ స్కాం, ఫార్ములా వన్ స్కాం.. ఇలా అన్నీ స్కామ్ లేనని అన్నారు. ఇప్పటికి మూడుసార్లు జరిగిన అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలన్నారు. గురుకుల పాఠశాలల గురించి హరీష్ రావు మాట్లాడితే నవ్వొస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం డైట్ చార్జీలు, కాస్మోటిక్ చార్జీలు పెంచిందని, గురుకులాల విద్యార్థులపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. 20 ఏళ్ల క్రితం ధాన్యం కొనుగోలు కేంద్రాలను కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రారంభించిందని గుర్తు చేశారు. వడగళ్ల వానతో నష్టపోయిన ఏ ఒక్క రైతును గత ప్రభుత్వం ఆదుకోలేదని, ఇటీవల వడగళ్ల వానతో రైతులు నష్టపోతే ఎకరాకు పదివేల రూపాయల పరిహారం అందించామని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ చరిత్రలోనే సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని తెలంగాణలోని రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణ మాఫీ చేశారని, కొందరికి సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాలేదని తెలిపారు. వారికి కూడా త్వరలో రుణమాఫీ అవుతుందన్నారు. గల్ఫ్‌లో మరణించిన కార్మికులను ఆదుకుం టానని రేవంత్ రెడ్డి రాజన్న ఆలయం ముందు ఇచ్చిన మాట ప్రకారం మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పు న పరిహారం అందజేస్తున్నామని, వారి పిల్లలకు గురుకు లాల్లో సీట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. ప్రజాభవన్‌లో ప్రజా దివస్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పదేళ్లలో నేతన్నల బతుకులు ఆగం చేశారని, బతుకమ్మ చీరల పేరిట సిరి సిల్లలో కాటన్ పాలిస్టర్ వస్త్ర పరిశ్రమను ఆగం చేశారని అన్నారు. 241 కోట్ల బకాయిలను తామ ఇచ్చామన్నారు. నేతన్నల సహాయంతో గెలిచిన కేటీఆర్ యారన్ డిపో ఎందుకు తీసుకురాలేకపోయాడో అడగాలన్నారు. 50 కోట్లతో యారన్ డిపోను వేములవాడలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. 11 నెలల కాలంలో ప్రజల మధ్య నిత్యం ఎవరు ఉన్నారో వారికి తెలుసని, రెండు మూడు నెలలకు ఒకసారి వచ్చి పోయే వారి మాటలను ప్రజలు పట్టించుకోరని అన్నారు. ఆలయ విస్తరణ పనులు ప్రారంభించడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి త్వరలోనే వేములవాడకు రానున్నారని వెల్లడిం చారు. జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నాగుల సత్య నారాయణ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, నాయకులు సాగరం వెంకటస్వామి, పుల్కం రాజు, చొప్పదండి ప్రకాష్, ఎల్లె లక్ష్మీనారాయణ, నామాల లక్ష్మీరాజం, కూరగాయల కొమురయ్య, చిలుక రమేష్, పాత సత్యలక్ష్మి, మ్యాన ప్రసాద్, కొక్కుల రాజు, బైరి నాగరాజు, అన్నారం శ్రీనివాస్, కూరగాయల శ్రీశైలం, తోట రాజు పాల్గొన్నారు.