Share News

తెగిన ఆ‘ధారం’

ABN , Publish Date - Mar 29 , 2024 | 01:22 AM

వస్త్ర పరిశ్రమలో సంక్షోభంతో మునుపటి పరిస్థితులు ఆవిష్కృతమవుతున్నాయి. నేతన్నలు అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఉపాధి కోసం రోడ్డెక్కి ఆందోళ నలు చేస్తున్నారు. పోగుపోగు అతుకుతూ చిక్కు పడిన ఎదురుపోగులను వేరు చేస్తూ మరమగ్గాల చప్పుళ్ల మధ్య నేతన్నలు జీవనం సాగించారు. గత ప్రభుత్వ ఆర్డర్లతో ఉపాధి పొందారు. కొత్త ప్రభుత్వంలో ప్రభుత్వ ఆర్డర్లు దూరమవడం, ప్రైవేటు మార్కెట్‌ కోల్పోయి ఆర్డర్లు లేని దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి.

 తెగిన ఆ‘ధారం’

తెగిన ఆ‘ధారం’

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

వస్త్ర పరిశ్రమలో సంక్షోభంతో మునుపటి పరిస్థితులు ఆవిష్కృతమవుతున్నాయి. నేతన్నలు అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఉపాధి కోసం రోడ్డెక్కి ఆందోళ నలు చేస్తున్నారు. పోగుపోగు అతుకుతూ చిక్కు పడిన ఎదురుపోగులను వేరు చేస్తూ మరమగ్గాల చప్పుళ్ల మధ్య నేతన్నలు జీవనం సాగించారు. గత ప్రభుత్వ ఆర్డర్లతో ఉపాధి పొందారు. కొత్త ప్రభుత్వంలో ప్రభుత్వ ఆర్డర్లు దూరమవడం, ప్రైవేటు మార్కెట్‌ కోల్పోయి ఆర్డర్లు లేని దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో మళ్లీ సిరిసిల్ల నేతన్నల బతుకు చిత్రం తిరగబడినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే పవర్‌లూం నేత కార్మికుడు శ్రీనివాస్‌ బలవనర్మణం చెందడంతో మళ్లీ చితికిపోయే పాత పరిస్థితులు ముందుకు వచ్చాయా? అనే ఆందోళనలో కార్మికులు ఉన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలంటూ మళ్లీ సిరిసిల్ల మరమగ్గాల కార్మికులు రోడ్డునెక్కి ఆందోళనలు చేస్తున్నారు. రాస్తారోకోలు, నిరాహార దీక్షలు, భిక్షాటనలు చేసిన కార్మికులు గురువారం చేనేత జౌళి శాఖ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో వంటావార్పుతో నిరసన తెలిపారు.

నేతన్న చుట్టూ రాజకీయాలు

సిరిసిల్ల వస్త్ర సంక్షోభంతో కార్మికులు ఆగిన మరమగ్గాల మధ్య పస్తులతో విలవిల్లాడుతుంటే పార్టీలు మాత్రం నేతన్న చుట్టూ రాజకీయాలు వొలకబోస్తున్నాయి. నేత కార్మికులకు కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఆర్డర్లను పూర్తిస్థాయిలో ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. టెక్స్‌టైల్‌ పార్కుకు సమగ్ర శిక్ష డిపార్ట్‌మెంట్‌ నుంచి స్కూల్‌ యూనిఫాం కోసం షర్టింగ్‌ క్లాత్‌ ఆర్డర్లు ఇచ్చినా సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమపై ఆధారపడ్డ కార్మికులను ఆదుకునే పరిస్థితుల్లో లేదు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, ఒకరికి ఒకరు విమర్శలకే పరిమితం అవుతున్నా సంక్షోభం వైపు దృష్టి పెట్టడం లేదు. మళ్లీ వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు ఎర్రజెండాలు చేతబూని కార్మికులపక్షాన నిలుస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఆర్డర్లపై స్పష్టత మాత్రం రావడం లేదు. ఎన్నికల కోడ్‌ కూడా రావడంతో అధికారికంగా మాట్లాడని పరిస్థితి. కాంగ్రెస్‌ ప్రభుత్వం నుంచి మెరుగైన ఆర్డర్లు వస్తాయని భావించినా బతుకమ్మ చీరలు ఇతర ఆర్డర్లు వచ్చే పరిస్థితులు లేవని తేలిపోయింది. సిరిసిల్లలో నేత కార్మికులు ఆసాములు, ప్రైవేటు వస్త్రోత్పత్తి ఆర్డర్లపై దృష్టి పెట్టాలని చేనేత జౌళి శాఖ రాష్ట్ర డైరెక్టర్‌ అలుగు వర్షిణి స్పష్టం చేశారు. చివరకు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు రావాల్సిన ప్రభుత్వ బకాయిలు రూ .270 కోట్లు కూడా సెప్టెంబరు వరకు చెల్లిస్తామని ప్రకటించడంతో వస్త్ర పరిశ్రమ సంక్షోభం నుంచి ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కనపించడం లేదు. ఇక ప్రభుత్వ ఆర్డర్లు కూడా రావడం కష్టమని భావిస్తున్నారు. గతంలో సిరిసిల్లలో 30 వేల మరమగ్గాలపై ప్రభుత్వ ఆర్డర్లు, ఇతర కాటన్‌ ఉత్పత్తులు జరిగేవి. 2017 నుంచి సిరిసిల్ల పరిశ్రమను సంక్షోభం నుంచి ఆత్మహత్యలు ఆకలి చావుల నివారణ దిశగా ప్రభుత్వ ఆర్డర్లను ఇస్తూ ప్రభుత్వం ఉపాధి కల్పనకు దోహదపడింది. దాదాపు ప్రతీ సంవత్సరం రూ.400 కోట్లకు పైగా ఆర్డర్లు వచ్చేవి. ప్రభుత్వం నుంచి చెల్లింపులు కొంత ఆలస్యమైనా కార్మికులకు ఉపాధి దొరకుతూ ముందుకు సాగేది. కొత్త ప్రభుత్వం ప్రభుత్వ ఆర్డర్లలో ప్రధానంగా ఉండే బతుకమ్మ చీరలను నిలిపివేసింది. దీంతోపాటు బహిరంగ మార్కెట్‌లో ఆర్డర్లు లభించని పరిస్థితుల్లో సిరిసిల్లలో 20 వేల మరమగ్గాలు మూత పడ్డాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందే 15 వేల మందికార్మికులు ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారు. బతుకమ్మ చీరల ఉత్పత్తికి ప్రభుత్వం 2017 నుంచి విభిన్న రంగులు, డిజైన్లలో ఆర్డర్లు ఇస్తూ వచ్చింది. రూ.225 కోట్లతో మొదలైన ఆర్డర్లు 2023లో రూ.350 కోట్ల వరకు పెరిగింది. ప్రతీ సంవత్సరం కోటి చీరలు, 6.30 కోట్ల మీటర్ల బతుకమ్మ బట్ట ఉత్పత్తి ఆర్డర్లు అందిస్తూ వచ్చింది. గత సంవత్సరం ఉత్పత్తి చేసిన బతుకమ్మ చీరలతో పాటు సర్వశిక్ష అభియాన్‌, సంక్షేమ శాఖలకు సంబంధించిన బట్ట ఉత్పత్తి బకాయిలు రూ.270 కోట్లకు పైగా రావాల్సి ఉంది. దీంతోపాటు బతుకమ్మ చీరలపైనా కార్మికులకు యారన్‌ సబ్సిడీ రూపంలో ఒక మీటరుకు రూ .1.25 చొప్పున వారికి అందజేస్తున్నారు. యారన్‌ సబ్సిడీ 5128 మంది కార్మికులకు ఇప్పటి వరకు రూ.8.77 కోట్లు అందించారు. 2022, 2023కు సంబంఽధించిన కార్మికులకు యారన్‌ సబ్సిడీ రావాల్సి ఉంది. వస్త్రోత్పత్తి దారులు, కార్మికులు, బకాయిలు ఇవ్వమని ప్రభుత్వాన్ని వేడుకుంటున్న సెప్టెంబరు వరకు అందే పరిస్థితులు లేవు. మరోవైపు ఎన్నికల కోడ్‌ కూడా రావడంతో బకాయిల విడుదల లేనట్టేనని భావిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, ఆర్డర్లు ఇవ్వాలంటూ మంత్రుల చుట్టూ తిరుగుతూనే ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వాన్ని మాత్రం కదిలించడం లేదు.

Updated Date - Mar 29 , 2024 | 01:22 AM