Share News

తెగిన ఆ‘ధారం’

ABN , Publish Date - Dec 29 , 2024 | 01:07 AM

. ఉపాధి కరువై నేతన్నలు వీధిన పడ్డారు. గత ప్రభుత్వ హయాంలో అందిన ఆర్డర్లు ఒక్కసారిగా నిలి చిపోవడంతో వస్త్ర పరిశ్రమలో సంక్షోభం నెలకొంది. ఆర్థిక ఇబ్బందులతో పలువురు కార్మికులు బలవన్మరణం పొందారు. 23 మంది కార్మికులు మృతి చెందగా వీరిలో 12 మంది ఆత్మహత్య చేసుకున్నారు.

తెగిన ఆ‘ధారం’
సిరిసిల్లలో ఆగిపోయిన మరమగ్గాలు

- కదలని మగ్గం.. కరువైన ఉపాధి

- సంక్షోభంలో వస్త్ర పరిశ్రమ

- ఏడాది నిలిచిన బతుకమ్మ చీరల ఉత్పత్తి

- 11 మంది బలవన్మరణం

- ధర్నాలు, ఆందోళనలతో దద్దరిల్లిన వస్త్ర పరిశ్రమ

- బకాయిలు విడుదల, కొద్ది మేరకు ప్రభుత్వ ఆర్డర్లు

- రూ.50 కోట్లతో యారన్‌ డిపో ఏర్పాటు

- స్వశక్తి మహిళలకు చీరలు

- సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ రౌండప్‌ - 2024

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

సిరిసిల్ల మరమగ్గాలు మూగబోయాయి. ఉపాధి కరువై నేతన్నలు వీధిన పడ్డారు. గత ప్రభుత్వ హయాంలో అందిన ఆర్డర్లు ఒక్కసారిగా నిలి చిపోవడంతో వస్త్ర పరిశ్రమలో సంక్షోభం నెలకొంది. ఆర్థిక ఇబ్బందులతో పలువురు కార్మికులు బలవన్మరణం పొందారు. 23 మంది కార్మికులు మృతి చెందగా వీరిలో 12 మంది ఆత్మహత్య చేసుకున్నారు. మరోవైపు పనులు లేకపోవడంపై కార్మికులు ఎర్రజెండాలు చేత బూని రోడ్డెక్కారు. వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల యజమాన్యాలు సైతం జేఏసీగా ఏర్పడి ఉద్యమబాట పట్టాయి. చివరకు కొత్త ప్రభు త్వం కొంత ఊరటను ఇచ్చే విధంగా ముందుకు రావడంతో మళ్లీ కార్మికుల్లో ఉపాధి ఆశలు చిగురించాయి. 2024 సంవత్సరం కరిగిపోతూ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను కష్టాల్లోకి నెట్టింది.

బతుకమ్మ చీరలు బంద్‌

గత ప్రభుత్వం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో కార్మికులకు ఉపాధి కల్పించే దిశగా 2017లో బతుకమ్మ చీరల ఆర్డర్లను అందించడానికి శ్రీకారం చుట్టింది. దీంతో పాటు ఆర్వీఎం, ఇతర ప్రభుత్వ ఆర్డర్లను అందించింది. సిరిసిల్లలోని 30 వేల మరమగ్గాలపై 15 వేల మంది కార్మికులు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఉపాధి పొందారు. నెలకు రూ.16 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనాలు పొందారు. ఏటా రూ.350 కోట్లతో 6.30 కోట్ల మీటర్ల బతుకమ్మ చీరల బట్ట ఉత్పత్తి అయ్యేది. దీంతోపాటు యారన్‌ సబ్సిడీ, త్రిఫ్ట్‌ పథకం, బీమా, ఇతర పథకాలను అందిస్తూ వచ్చింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు అనంతరం బతుకమ్మ చీరల్లో నాణ్యత లేదని, అవకతవకలకు అస్కారం ఉందనే కారణంగా నిలిపివేసింది. ఇతర ప్రభుత్వ ఆర్డర్లు కూడా ఒక్కసారిగా అగిపోవడంతో మరమగ్గాలు నిలిచిపోయి. కార్మికులకు పనిలేకుండా పోయింది. యజమానులు, మరమగ్గాలను తూకానికి అమ్ముకున్నారు. టెక్స్‌టైల్‌ పార్కులో సైతం మాంధ్యం కారణంగా పరిశ్రమలను మూసివేశారు. ప్రభుత్వం బతుకమ్మ చీరల స్థానంలో స్వశక్తి సంఘాల్లోని మహిళలకు సంవత్సరానికి రెండు చీరల చొప్పున అందిస్తామని ఇందుకు సంబంధించిన చీరల డిజైన్లు కూడా ఖరారు చేశారు. కానీ ఆర్డర్లు మాత్రం ఇవ్వలేదు. దీంతోపాటు దక్షిణాది రాష్ట్రాలకు కాటన్‌ అద్దకం బట్టను అందిస్తూ వచ్చిన సిరిసిల్ల అద్దకం పరిశ్రమకు ఈ సంవత్సరం కూడా ఆదరణ లేకుండానే గడిచిపోయింది. దీనికి అనుబంధంగా ఉన్న సైజింగ్‌ పరిశ్రమ, కాటన్‌ వస్త్ర పరిశ్రమ విలవిల్లాడింది.

బకాయిల చుట్టూ రాజకీయం

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో గత ప్రభుత్వ ఆర్డర్లకు సంబంధించిన బకాయిల విడుదల కోసం ఏడాది పొడవునా ఆందోళనలు, రాజకీయాలు కొనసాగాయి. గత ప్రభుత్వ హయాంలోని బతుకమ్మ చీరలు, ఆర్వీఎం, ఇతర బకాయిలు రూ.270 కోట్ల వరకు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు రావాల్సిన దానిపై పవర్‌లూం కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు, వస్త్ర పరిశ్రమ యాజమాన్య సంఘాలు ఆందోళన చేపట్టాయి. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ జోక్యంతో బకాయిలు విడుదలయ్యాయి. బతుకమ్మ చీరలకు సంబంధించి పెండిగ్‌ బకాయిలు రూ.222.39 కోట్లు విడుదల చేశారు. దీంతోపాటు ఇతర ప్రభుత్వ ఆర్డర్లకు సంబంఽధించి రూ.157.46 కోట్లు అందించారు. యారన్‌ సబ్సిడీ రూ.6.32 కోట్లు విడుదల చేశారు.

ఆందోళన కలిగించిన బలవన్మరణాలు

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో మరోసారి నేతన్నల బలవన్మరణాలు ఆందోళన కలిగించాయి. గతంలో సంక్షోభ సమయంలో ఏర్పడ్డ పరిస్థితులే పునరావృతం అయ్యాయని ఆవేదనకు గురయ్యారు. 12 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. బైరి అమర్‌, స్రవంతి దంపతులు ఒకేసారి బలవన్మరణం పొందడం పరిశ్రమలో విషాదాన్ని నింపింది. వీరితోపాటు తడుక శ్రీనివాస్‌, సిరిపురం లక్ష్మీనారాయణ, అంకారపు మల్లేశం, అడిచెర్ల సాయి, అడెపు సంపత్‌, నక్క శ్రీనివాస్‌, దూస గణేష్‌ కూడా ఆత్మహత్య చేసుకున్నారు. కార్మికులు ఆత్మహత్యలతో మళ్లీ రాజకీయ పరామర్శలు పెరిగాయి. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌, తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి దీపదాస్‌ మున్షీ, ప్రభుత్వంలోని పెద్దలు వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, సిరిసిల్ల ఎమ్మెల్యే, మాజీ మంత్రి కే తారకరామారావుతోపాటు వామపక్షాలు, ఇతర పార్టీల పెద్దలు కార్మిక కుటుంబాలను పరామర్శించి భరోసా ఇచ్చారు.

దద్దరిల్లిన సిరిసిల్ల

పోగుపోగు పేని రంగు రంగుల చీరలు నేసిన నేతన్నలు పనికోసం రోడ్డునెక్కి ఆందోళన బాట పట్టారు. పవర్‌లూం కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆర్డర్లు కల్పించాలని ఆందోళనలు చేపట్టారు. ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో 24 గంటల నిరాహారదీక్ష, నేతన్నల ఆకలి కేక పేరిట మహాధర్నా, కలెక్టరేట్‌ ముట్టడి, హైదరాబాద్‌ ధర్నా చౌక్‌ వద్ద ఆందోళనలు చేపట్టారు. మూలనపడిన మరమగ్గాలతో భిక్షాటనలు, వంటావార్పు నిర్వహించారు. ఫలితంగా ప్రభుత్వం ఉపాధిని కల్పించే దిశగా చర్యలు చేపట్టింది.

ఈసారి అందని వర్కర్‌ టు ఓనర్‌ పథకం

సిరిసిల్ల మరమగ్గాల కార్మికులను యజమానులుగా మార్చే విధంగా గత ప్రభుత్వం వర్కర్‌ టు ఓనర్‌ పథకాన్ని ముందుకు తీసుకొచ్చింది. ఇందుకోసం సిరిసిల్లలోని రెండో బైపాస్‌ రోడ్డులో 88 ఎకరాల్లో రూ. 374 కోట్లతో వర్కర్‌ టు ఓనర్‌ పథకానికి షెడ్లను నిర్మించారు. మొదటి విడతలో 1104 మంది కార్మికులకు వర్క్‌షెడ్లను అందించాలని నిర్ణయించారు. గత ప్రభుత్వ హయాం నుంచి ఎదురు చూస్తున్న వర్కర్‌ టు ఓనర్‌ పథకం ఈ సంవత్సరం కూడా అందుబాటులోకి రాలేదు. నేత కార్మికులు షెడ్ల కోసం నిరీక్షిస్తుండగా షెడ్లను ఇతర అవసరాలకు లీజుకు ఇవ్వడంతో పథకంపై ఆశలు సన్నగిల్లాయి.

విద్యుత్‌ సబ్సిడీ రాయితీ పరిమితి పెంపు

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ జేఏసీ ఆధ్వర్యంలో పవర్‌లూమ్‌ల విద్యుత్‌ సబ్సిడీ రాయితీ పరిమితి పెంపు కోసం ఆందోళన చేపట్టారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, సిరిస్లిల నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి విద్యుత్‌ సమస్యపై ప్రభుత్వానికి లేఖలు రాశారు. ఫలితంగా ప్రభుత్వం కొంత ఊరటను ఇస్తూ విద్యుత్‌ సబ్సిడీ రాయితీ పరిమితిని పెంచింది. పది హెచ్‌పీల వరకు ఉన్న సబ్సిడీ రాయితీని 25 హెచ్‌పీల వరకు పెంచింది.

భరోసా ఇచ్చిన ప్రభుత్వం

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఈ ఏడాది అనేక ఒడిదుడులకు గురైన క్రమంలో ప్రభుత్వం కొంత భరోసాను ఇచ్చే దిశగా చర్యలు చేపట్టింది. గత ప్రభుత్వం నుంచి అందిస్తున్న నేతన్న బీమాను కొనసాగించింది. 4606 మంది కార్మికులు చేరారు. గత ప్రభుత్వంలో ఉన్న బకాయిలను వస్త్ర పరిశ్రమకు ఈ ప్రభుత్వం చెల్లించింది. స్వశక్తి సంఘాల మహిళలకు 1.30 కోట్ల చీరలను అందించడానికి సిద్ధమైంది. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకే ఆర్డర్లు రానుండడంతో మళ్లీ ఉపాధిపై భరోసా పెరిగింది. రూ.50 కోట్లతో యారన్‌ డిపోను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా ప్రారంభించారు. రూ.107.55 కోట్ల విలువైన ఆర్డర్లను ప్రభుత్వం సిరిసిల్ల పరిశ్రమకు అందించింది. నేతన్నకు చేయూతను అందించడంతో మళ్లీ వస్త్ర పరిశ్రమలో ఉపాధిపై ఆశలు కలుగుతున్నాయి.

Updated Date - Dec 29 , 2024 | 01:07 AM