Share News

ప్రశాంతంగా గ్రూప్‌-1 పరీక్ష

ABN , Publish Date - Jun 10 , 2024 | 01:01 AM

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జిల్లా కలెక్టర్‌ పమేలాసత్పతి నేతృత్వంలో అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఆదివారం నిర్వహించిన ఈ పరీక్షకు 18,663 మంది అభ్యర్థులు హాజరు కావలసి ఉండగా 14,577 మంది పరీక్షలు రాశారు.

ప్రశాంతంగా గ్రూప్‌-1 పరీక్ష

కరీంనగర్‌ టౌన్‌, జూన్‌ 8: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జిల్లా కలెక్టర్‌ పమేలాసత్పతి నేతృత్వంలో అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఆదివారం నిర్వహించిన ఈ పరీక్షకు 18,663 మంది అభ్యర్థులు హాజరు కావలసి ఉండగా 14,577 మంది పరీక్షలు రాశారు. 4,086 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. ప్రవేశ సమయం తర్వాత నిమిషం ఆలస్యంగా వచ్చిన వారిని పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించక పోవడంతో కొందరు అభ్యర్థులు నిరాశతో వెనుదిరిగారు. జిల్లా కేంద్రంలోని వాణినికేతన్‌, ఉమెన్స్‌ డిగ్రీ కళాశాల, భగత్‌నగర్‌ కేంద్రాల్లోనే 11 మంది అభ్యర్థులను లోనికి అనుమతించలేదు. జిల్లాలో గ్రూప్‌-1 ప్రిలిమినరీ కోసం 36 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒక్కో పరీక్షా కేంద్రానికి ఒక డిపార్టుమెంటల్‌ అధికారితో పాటు ఒక అబ్జర్వర్‌ను చొప్పున మొత్తం 36 మంది డిపార్టుమెంటల్‌ అధికారులు, 36 మంది అబ్జర్వర్లను నియమించారు. పరీక్షలను పర్యవేక్షించేందుకు ఏడుగురు రూట్‌ ఆఫీసర్లను, ఏడుగురు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులను, 208 మందిని ఐడెంటిఫికేషన్‌ అధికారులను నియమించారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే ఈ పరీక్షకు అభ్యర్థులను ఉదయం 9 గంటల నుంచే పరీక్షా కేంద్రాలోకి అనుమతించారు. పరీక్షా కేంద్రం ప్రధాన ద్వారం వద్దనే పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల హాల్‌టికెట్‌, ఒక కలర్‌ ఫొటోతోపాటు , ఒరిజినల్‌ ఆధార్‌కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డులను పరిశీలించిన తర్వాతనే లోనికి అనుమతించారు. అనేక పరీక్షా కేంద్రాలకు మహిళలు చంటిపిల్లలు, చిన్నపిల్లలను వెంటతీసుకొని రాగా, కొన్ని చోట్ల తల్లిదండ్రులు, ఇతర కుటుంబసభ్యులతో కలిసి అభ్యర్థులు రాగా వారిని పరీక్షా కేంద్రానికి కొద్ది దూరంలోనే పోలీసులు నిలిపివేసి కేవలం అభ్యర్థులను మాత్రమే పంపించడంతో పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులు బారులు తీరారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను అమలు చేయడంతో పాటు పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. జమ్మికుంట తహసీల్దార్‌ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న అన్వర్‌ మీర్జా పర్వేజ్‌ బేగ్‌ మద్యం సేవించి జ్యోతిష్మతి కళాశాలలో విధులకు హాజరయ్యాడు. సమాచారం అందుకున్న ఎల్‌ఎండి ఎస్సై చేరాలు మద్యం సేవించిన ఉద్యోగిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం తిమ్మాపూర్‌ తహసీల్దార్‌ కార్యాలయానికిఅప్పగించారు.

ఫ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్‌ ప్రపుల్‌ దేశాయ్‌

పరీక్షా కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని వాణినికేతన్‌, పారమిత స్కూల్‌, ఎల్‌ఎండి కాలనీలోని వాగేశ్వరీ, జ్యోతిష్మతి, శ్రీచైతన్య ఇంజనీరింగ్‌ కళాశాలను ఆయన సందర్శించి, పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రఫుల్‌దేశాయ్‌ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌ పమేలాసత్పతి ఆధ్వర్యంలో పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు పకడ్బందీ ఏర్పాటు చేశామని, పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని అన్నారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన ఉద్యోగులు, సిబ్బంది, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Jun 10 , 2024 | 01:01 AM