Share News

కాలువలు ఇలా.. సాగునీరందేదెలా..?

ABN , Publish Date - Dec 31 , 2024 | 12:38 AM

మండల పరిధి లో ఎస్సారెస్పీ కాలువలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి.

కాలువలు ఇలా.. సాగునీరందేదెలా..?

జూలపల్లి, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : మండల పరిధి లో ఎస్సారెస్పీ కాలువలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ప్రధాన ఎస్సారెస్పీ డి83 కాలువ ఉపకాలువ 9ఆర్‌, దాని అనుబంధ ఉపకాలువలు ముళ్లపొదలతో నిండిపోయి ఉన్నాయి. ఈ కాలువల ద్వారా నీరు విడుదలైనప్పటికీ తమ భూముల్లోకి చేరే పరిస్థితి లేకుండాపోయిందని మండల ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో సాగునీటి కాలువలు అధ్వానంగా మారాయని రైతులు ఆరోపిస్తున్నారు. తమకు సకాలంలో సాగునీరు అందించకపోతే వేసిన పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో వారబందీ ఆన్‌ఆఫ్‌ పద్ధతిలో సాగునీటిని విడుదల చేస్తున్నారు. ఆయకట్టు రైతుల చివరి భూము లకు సాగునీరందే విధంగా సంబంధిత అధికారులు ముందస్తు చర్యలు చేపట్టడం లేదు. దీంతో కాలువల్లో నిండి ఉన్న ముళ్లపొదలతో సాగునీరు వృథా అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. ఫలితంగా ఆయకట్టు చివరి భూములకు నీరు అందక పంటలు ఎండిపోయే ప్రమాదం లేకపోలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలో రైతులు సాగుచేసిన పత్తి పంటలు చివరిదశకు చేరుకున్నాయి. వాటి స్థానంలో మొక్కజొన్న పంటలను సాగుచేసేందుకు రైతులు సమాయత్తమవుతున్నారు. దీంతో మండలంలో మొక్కజొన్న సాగువిస్తీర్ణం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని రైతులు పేర్కొంటున్నారు. అలాగే వరి పంట సాగును కూడా రైతులు ముమ్మరంగా చేస్తున్నారు. వ్యవసాయ బావులు ఉన్న రైతులు ఇప్పటికే నార్లు పోసుకుని నాట్లు వేందుకు సిద్ధమవుతున్నారు. ఎస్సారెస్పీ సాగునీటిపై ఆధారపడిన రైతులు నారు పోసుకు నేందుకు సాగునీరు అందక తంటాలు పడుతున్నారు. ఇప్పటి కైనా ఎస్సార్‌ఎస్పీ అధికారులు స్పందించి ఆయకట్టు చివరి భూములకు సాగునీరు అందించే విధంగా తగిన చర్యలు చేపట్టాలని మండల రైతులు కోరుతున్నారు.

చెత్త, ముళ్లపొదలను తొలగించాలి

- మెండే రాజన్న, రైతు, జూలపల్లి

ఎస్సారెస్పీ ఉప కాలువల్లో చెత్త, ముళ్లపొదలు నిండిపోయాయి. దీంతో సాగునీరు ఆయకట్టు చివరి భూములకు చేరకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము. ఎస్సా రెస్పీ సాగునీటి కాలువలను ఎప్పటి కప్పుడు సంబంధిత అధికా రులు పర్యవేక్షించాలి. కాలువల్లోని పూడి కను, ముళ్లపొదలను తొలగిస్తే రైతులకు సకాలంలో సాగు నీరు అంది పంటలు పండుతాయి. లేకుంటే వారిబందీలో పద్ధతిలో వచ్చే నీరు అందక పంటు ఎండిపోతాయి. ఈ విష యమై అధికారులు దృష్టి సారించాలి.

Updated Date - Dec 31 , 2024 | 12:38 AM