సమగ్ర సర్వేతో ‘బల్దియా’ ఖాళీ
ABN , Publish Date - Nov 24 , 2024 | 01:05 AM
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేతో బల్దియా సేవలు పూర్తిగా స్తంభించాయి. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు మొదలుకొని నగరపాలక సంస్థ అందించే పౌర సేవలు పూర్తిగా నిలిచిపోయాయి.
కరీంనగర్ టౌన్, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేతో బల్దియా సేవలు పూర్తిగా స్తంభించాయి. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు మొదలుకొని నగరపాలక సంస్థ అందించే పౌర సేవలు పూర్తిగా నిలిచిపోయాయి.
ఫ ఉద్యోగులందరికీ సర్వే బాధ్యతలు
నగరపాలక సంస్థలోని రెవెన్యూ, ఇంజనీరింగ్, సానిటేషన్, సాధారణ విభాగాలకు చెందిన ఉద్యోగులందరికి, కంప్యూటర్ ఆపరేటర్లకు, ఆర్‌పీలకు సమగ్ర కుటుంబ సర్వే బాధ్యతలను అప్పగించారు. దీంతో ఈనెల 4 నుంచి కార్యాలయంలోని అన్ని విభాగాలకు చెందిన ఉద్యోగులు కార్యాలయ పనివేళల్లో సర్వేకు వెళ్తుండడంతో ఖాళీగా దర్శనమిస్తోంది. సర్వే పూర్తయ్యే వరకు ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పడంతో వివిధ పౌర సేవల కోసం దరఖాస్తు చేసుకున్న నగరవాసులు కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. నగరంలో 89,617 కుటుంబాలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు ఆయా కుటుంబాలకు సంబంధించిన సర్వే సమాచారాన్ని సేకరించేందుకు 540 మంది ఎన్యూమరేటర్లను నియమించారు. తీగలగుట్టపల్లి, బొమ్మకల్ గ్రామాల సర్వే బాధ్యతలను కూడా బల్దియాకే అప్పగించడంతో అదనంగా మరో 160 మందిని నియమించారు.
ఫ స్టిక్కరింగ్‌లో జాప్యం
2011 జనాభా లెక్కల ప్రకారంగా ఆనాటి ఇంటి నంబర్లతో సర్వేను ప్రారంభించగా ఇంటి నంబర్లు క్రమపద్దతిలో లేకపోవడంతో సర్వేలో కుటుంబాల లెక్కల కోసం చేపట్టిన స్టిక్కరింగ్ చేయడమే ఆలస్యమైంది. ఈనెల 6 నుంచి 8వ తేదీ వరకు కుటుంబాల సంఖ్యను తేల్చేందుకు స్టిక్కరింగ్ ప్రక్రియను పూర్తి చేసి 9వ తేదీ నుంచి రెండవ విడత సమాచార సేకరణ చేయాలని ప్రభుత్వం నిర్దేశించగా 10వ తేదీ వరకూ స్టిక్కరింగ్ చేసే ప్రక్రియ పూర్తికాలేదు. ఆ తర్వాత ఓవైపు స్టిక్కరింగ్, మరోవైపు సమాచార సేకరణ ప్రారంభించినా ఈనెల 23వ తేదీ (శనివారం) వరకు 89,617 కుటుంబాల్లో 73,169 కుటుంబాలకు సంబంధించిన సమచారాన్ని సేకరించారు. ఇప్పటికే చాలా చోట్ల వంద శాతం సర్వే పూర్తికాగా కరీంనగర్ నగరపాలక సంస్థలో 82.12 శాతం మాత్రమే పూర్తయింది. ఇంకా దాదాపు 18 శాతం సర్వే పూర్తి చేయాల్సి ఉంది. నగరపాలక సంస్థలోని బిల్ కలెక్టర్లు మొదలుకొని కంప్యూటర్ ఆపరేటర్ల వరకు సర్వే విధులు నిర్వహిస్తుండడంతో ఆయా విభాగాల్లో చేయాల్సిన పనులు నిలిచిపోయాయి. ఆస్తి పన్నులు, నల్లా బిల్లులు, ట్రేడ్ లైసెన్సు ఫీజుల వసూళ్లు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రతి నెలా వాటి ద్వారా వచ్చే ఆదాయంతోనే కార్మికులకు జీతభత్యాల చెల్లింపులతోపాటు మిగులు నిధులతో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం, డీజీల్ బిల్లులు ఇవ్వడం, వాహనాల అద్దె చెల్లింపులు, ఇతరత్రా నిర్వహణ ఖర్చులకు వెచ్చించేవారు. సర్వే ప్రారంభమైన ఈనెల 4 నుంచి ఇప్పటి వరకు పన్నుల వసూళ్లు పూర్తిగా నిలిచిపోగా, మరో నాలుగైదు రోజులైనా సర్వే పూర్తయ్యేలా కనిపించడం లేదని చెబుతున్నారు. దీంతో ఈ నెల పన్నుల ద్వారా వచ్చే ఆదాయంపై తీవ్ర ప్రభావం పడుతోంది.నగరపాలక సంస్థకు ప్రధాన ఆదాయ వనరులైన ఆస్తిపన్నులు, నల్లాబిల్లులు, ట్రేడ్ లైసెన్సులు, అడ్వర్టయిజ్‌మెంట్ టాక్సుల కలెక్షన్లు నిలిచి పోవడంతో జనరల్ ఫండ్ ఖాళీగా దర్శనమిస్తోంది. 2025 జనవరి 29న ప్రస్తుత పాలకవర్గ పదవీ కాలం ముగియనున్న సమయంలో టాక్సు కలెక్షన్లు నిలిచిపోవడంతో జనరల్ ఫండ్‌తో కొత్తగా పనులు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే సీఎం హామీ, పట్టణ ప్రగతి నిధులు నిలిచి పోవడంతో దాదాపు 50కిపైగా రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల వంటి పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. ఓవైపు ఆ నిధులు రాక పోవడం, మరోవైపు జనరల్ ఫండ్ లేక పోవడంతో పనులు పూర్తికాక ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక కార్పొరేటర్లు ఆందోళనకు గురవుతున్నారు. సర్వే సమాచారాన్ని కంప్యూటరీకరణ వంటి విధుల నుంచి మున్సిపల్ ఉద్యోగులకు మినహాయింపు ఇచ్చి ఇతర శాఖల ఉద్యోగులకు అప్పగిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.