Share News

9 నుంచి సమగ్ర సర్వే..

ABN , Publish Date - Nov 07 , 2024 | 01:05 AM

రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుంచి చేపట్టాల్సిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కోసం మరో రెండు రోజులు ఆగాల్సిందే. సర్వేకు సంబంధించిన 75 ప్రశ్నలతో కూడిన ఫార్మాట్‌ ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసినప్పటికీ, అందులో కొన్ని చేర్పులు, మార్పులు చేయాలని భావించిన ప్రభుత్వం తుది ఫార్మాట్‌ను ఇంకా విడుదల చేయలేదు. దీంతో సర్వే ఈనెల 9వ తేదీ నుంచి చేపట్టనున్నారు.

9 నుంచి సమగ్ర సర్వే..
తన క్యాంపు కార్యాలయానికి సిబ్బంది స్టిక్కర్‌ అంటించడాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

- ఇంకా పూర్తికాని కుటుంబాల గుర్తింపు సర్వే

- కొనసాగుతున్న ప్రక్రియ, పరిశీలించిన కలెక్టర్‌

- తుది సర్వే ఫారాన్ని విడుదల చేయని ప్రభుత్వం

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుంచి చేపట్టాల్సిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కోసం మరో రెండు రోజులు ఆగాల్సిందే. సర్వేకు సంబంధించిన 75 ప్రశ్నలతో కూడిన ఫార్మాట్‌ ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసినప్పటికీ, అందులో కొన్ని చేర్పులు, మార్పులు చేయాలని భావించిన ప్రభుత్వం తుది ఫార్మాట్‌ను ఇంకా విడుదల చేయలేదు. దీంతో సర్వే ఈనెల 9వ తేదీ నుంచి చేపట్టనున్నారు. అలాగే పట్టణాలు, గ్రామాల్లో కుటుంబాల గుర్తింపు సర్వే ఇంకా పూర్తికాలేదు. జిల్లాలో ఒక్క రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో మినహా మిగతా ప్రాంతాల్లో ఇళ్ల గుర్తింపు పూర్తయ్యింది. కుటుంబాల గుర్తింపు కోసం ప్రభుత్వం మరో మూడు రోజులు గడువు ఇచ్చింది. 6,7,8 తేదీల్లో గ్రామాలు, పట్టణాల్లో మరోసారి కుటుంబాలను గుర్తించాలని, ఎక్కడైనా తప్పిపోయినవి ఉంటే మరోసారి పరిశీలించి గుర్తించాలని ఆదేశించారు. సర్వేలో అన్ని కుటుంబాలు పాల్గొనే విధంగా పకడ్బందీగా సర్వే చేయాలని అధికారులు పేర్కొంటున్నారు. 2011 జనాబా లెక్కల ప్రకారం జిల్లాలో 7,95,332 మంది జనాభా ఉన్నారు. ఇందులో పురుషులు 3,99,325 మంది, మహిళలు 3,96,006 మంది ఉన్నారు. కుటుంబాలు 2,09,677 ఉన్నాయి. మంగళవారం నాటికి 2,47,518 కుటుంబాలను గుర్తించారు. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 1,57,701 కుటుంబాలను, పట్టణ ప్రాంతాల్లో 89,817 కుటుంబాలను గుర్తించి స్టిక్కర్లను అంటించారు. మిగిలిన కుటుంబాలను గుర్తించేందుకు ఈనెల 8వ తేదీ వరకు సర్వే నిర్వహించాలని ఆదేశించారు. ఆ మేరకు సర్వే బృందాలు పట్టణాలు, గ్రామాల్లో సర్వేకు సంబంధించి కుటుంబాల సంఖ్యను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ప్రక్రియను బుధవారం కలెక్టర్‌ కోయ శ్రీహర్ష కాల్వశ్రీరాంపూర్‌ మండలం పెగడపల్లి గ్రామాన్ని సందర్శించి కుటుంబాల గుర్తింపు కోసం సర్వే సిబ్బంది ఇళ్లకు అంటించిన స్టిక్కర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కుటుంబాల గుర్తింపుపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. అలాగే కలెక్టర్‌ నివాసం ఉండే కలెక్టరేట్‌లోని క్యాంపు కార్యాలయానికి సిబ్బంది స్టిక్కర్‌ అంటించగా దానిని పరిశీలించి సర్వే పకడ్బందీగా చేయాలని సిబ్బందిని ఆదేశించారు.

ఫ ఇంకా జారీ కానీ సర్వే ఫారాలు..

రాష్ట్రంలోగల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ఇతర వర్గాలకు చెందిన ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ పరిస్థితులతో పాటు కుల గణన చేసేందుకు తుది సర్వే ఫారాన్ని ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదు. మొదట 7 పేజీల్లో 75 ప్రశ్నలతో కూడిన పార్ట్‌ 1, పార్ట్‌ 2 ఫారాలను విడుదల చేసింది. వీటిని జిల్లాల్లోనే కుటుంబాల సంఖ్యను అనుసరించి ప్రింటింగ్‌ చేయించుకోవాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. ప్రొఫార్మాలో చేర్పులు, మార్పులు చేస్తారని, తుది ఫార్మాట్‌ పంపించే వరకు సర్వే చేయవద్దని ఉన్నతాధికారులు ఆదేశించారు. సర్వే ఫారం వస్తే వెంటనే దానిని ముద్రించి సర్వేను ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం గుర్తించినప్పటికీ, సర్వే ఫారం ఇంకా విడుదల కాలేదు. అందులో చేర్పులు, మార్పులు చేస్తారా, 75 ప్రశ్నలతో కూడిన ఫారాన్నే సర్వేకు ఉపయోగించమంటారా తెలియదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఒక్కో ఎన్యూమరేటర్‌ ప్రతి రోజు 10 కుటుంబాల చొప్పున 15రోజుల్లో 150 కుటుంబాల సర్వే చేయాల్సి ఉంటుంది. సర్వే నిర్వహించేందుకు సిబ్బంది వెళ్లినప్పుడు ఇంటి యజమానులు అందుబాటులో ఉండాలని పేర్కొంటున్నారు. కానీ ఎప్పుడు, ఏ సమయానికి ఎన్యూమరేటర్‌ వస్తారనే విషయం తెలియకుండా పోతున్నది. ఈ సర్వే పైన ప్రజల్లో పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు. తప్పరిసరిగా సర్వేలో పాల్గొనాలని, తమ కుటుంబ వివరాలన్నింటినీ ఖచ్చితంగా ఇవ్వాలని ప్రభుత్వం ఎక్కడా పేర్కొనకపోవడం, సర్వేలో వివరాలు ఇవ్వకుంటే సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందవు అనే హెచ్చరికలు లేకపోవడంతో సర్వే గురించి ప్రజల్లో పెద్దగా చర్చ జరగడం లేదు. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం సర్వే గురించి విస్తృత ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది.

Updated Date - Nov 07 , 2024 | 01:05 AM