ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ దృష్టి
ABN , Publish Date - Nov 14 , 2024 | 01:02 AM
కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై అధికార కాంగ్రెస్‌పార్టీ దృష్టి సారించింది. ఈ స్థానం నుంచి పోటీ చేయడానికి పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. ఆశావహులు కొద్ది నెలలుగా ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. పనిలో పనిగా తమకు మద్దతు ప్రకటించాలని పలువురిని కోరుతున్నారు.
22కెఎన్‌ఆర్-13
---------------
ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ దృష్టి
- వ్యూహకర్త సునీల్ బృందంతో సర్వే
- నరేందర్‌రెడ్డి, హరికృష్ణ పేర్లు సిఫారసు
- అధిష్ఠానం నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై అధికార కాంగ్రెస్‌పార్టీ దృష్టి సారించింది. ఈ స్థానం నుంచి పోటీ చేయడానికి పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. ఆశావహులు కొద్ది నెలలుగా ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. పనిలో పనిగా తమకు మద్దతు ప్రకటించాలని పలువురిని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో పోటాపోటీ పరిస్థితిని నివారించి త్వరగా అభ్యర్థిని ప్రకటిస్తే సానుకూల ఫలితాలు వస్తాయని భావించిన కాంగ్రెస్ అధిష్ఠానం పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలును రంగంలోకి దింపిందని సమాచారం.
ఫ నాలుగు జిల్లాల్లో అభిప్రాయ సేకరణ
సునీల్ కనుగోలు బృందం కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో పర్యటించి ఆశావహులుగా ఉన్న వారిపై పట్టభద్రుల్లో అభిప్రాయ సేకరణ చేసినట్లు చెబుతున్నారు. ఈ బృందం నలుగురు ఆశావహులను పరిగణలోకి తీసుకొని సర్వే నిర్వహించి అందులో ఇద్దరి పేర్లను అధిష్ఠానానికి సిఫారసు చేసినట్లు తెలిసింది. అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్‌రెడ్డి, ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణగౌడ్, నిజామాబాద్ జిల్లాకు చెందిన నర్సారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన కేకే మహేందర్‌రెడ్డి అభ్యర్థిత్వంపై సర్వే నిర్వహించి అభిప్రాయాలను తెలుసుకున్నారని సమాచారం. వీరిలో మెజార్టీ పట్టభద్రులు నరేందర్‌రెడ్డి, ప్రసన్న హరికృష్ణగౌడ్ వైపు మొగ్గు చూపినట్లు తెలిసింది. క్షేత్రస్థాయిలో వీరిద్దరే ఓటర్ల నమోదులోనూ కీలకంగా వ్యవహరించి పెద్ద ఎత్తున ఓటర్ల నమోదు చేయించారు.
ఫ ఓటర్లలో అధికులు ఉమ్మడి జిల్లాకు చెందిన వారే..
గడువు ముగిసే సరికి 3,58,419 మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోగా కరీంనగర్ జిల్లాకు చెందిన దరఖాస్తులు 76,764 ఉండడం, మొత్తం దరఖాస్తుల్లో 1,63,024 ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారే ఉన్నారు. ఈ జిల్లాకు చెందిన వారినే అభ్యర్థిగా నిలిపితే గెలిచే అవకాశముంటుందని సునీల్ కనుగోలు బృందం సూచించినట్లు తెలిసింది. ప్రస్తుతం పట్టభద్రుల స్థానానికి టి జీవన్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన కరీంనగర్ జిల్లాకు చెందిన వారే కావడం గమనార్హం. సిట్టింగ్ స్థానాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ తిరిగి కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తూ అభ్యర్థి ఎంపిక విషయంలో పొరపాట్లు జరుగకుండా చూసేందుకే సర్వేను నిర్వహించిందని సమాచారం. బీఆర్‌ఎస్ నుంచి కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, బీజేపీ నుంచి రఘునాథ్‌రావు పోటీలో ఉండడం ఖాయమని, దాదాపు వారి పేర్లు ఖరారైనట్లేనని ప్రచారం జరుగుతోంది. అధికారికంగా ఆయా పార్టీలు ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ఆశావహులు కూడా ఆ పార్టీల్లో ఎక్కువగానే ఉన్నారు.
ఫ పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని..
బీజేపీ, బీఆర్‌ఎస్‌నుంచి ఈసారి ఈ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలున్నాయని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్ఠానం అభ్యర్థి ఎంపికలోనూ ఆచీతూచి వ్యవహరిస్తున్నది. పట్టభద్రుల ఎమ్మెల్సీ కావడంతో విద్యావంతులను రంగంలోకి దింపాలని అనుకుంటోంది. ఈ ఎన్నికల్లో పట్టభద్రులే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు కీలకంకానున్న నేపథ్యంలో ఆయా వర్గాల్లో ఎవరిపై మొగ్గు ఉన్నది అన్న విషయంలోనూ సర్వే నిర్వహించినట్లు తెలిసింది. ఇటీవల ఉద్యోగ నియామకాల అంశం ప్రధానంగా తెరపైకి వస్తున్నది. దీంతో పట్టభద్రుల సమస్యలు, ఉద్యోగుల సమస్యలు తెలుసుకోవడంతోపాటు వాటి పరిష్కారమార్గాలు ఏమున్నాయి.. పట్టభద్రులు ఆ విషయంలో ఏ మనుకుంటున్నారు... కాంగ్రెస్ అభ్యర్థులుగా తెరపైకి వచ్చిన వారు ఈ అంశాలపై కొద్దినెలలుగా నియోజకవర్గ పరిధిలో ఏమేమి మాట్లాడారు.. వారి మాటలకు పట్టభద్రుల్లో ఎంత వరకు సానుకూలత ఉన్నది.. అన్న అంశాలను సునీల్‌కనుగోలు బృందం పరిశీలించిందని తెలిసింది. వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని మెజార్టీ పట్టభద్రుల అభిప్రాయాల మేరకు నరేందర్‌రెడ్డి, హరికృష్ణ పేర్లను సిఫారసు చేసిందని సమాచారం.