Share News

కాంగ్రెస్‌దే పైచేయి..

ABN , Publish Date - Dec 27 , 2024 | 01:00 AM

గత ఏడాది చివరలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ క్లీన్‌ స్వీప్‌ చేసింది..

కాంగ్రెస్‌దే పైచేయి..

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

గత ఏడాది చివరలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ క్లీన్‌ స్వీప్‌ చేసింది.. ఈ ఏడాది జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ గెలుపొంది బీఆర్‌ఎస్‌, భారతీయ జనతా పార్టీలపై పైచేయి సాధించింది. అధికార కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడాన్ని ప్రజల్లోకి తీసుకవెళ్లి బీఆర్‌ఎస్‌ పార్టీ పుంజుకునేందుకు యత్నిస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువ శాతం ఓట్లు పార్లమెంట్‌ ఎన్నికల్లో సాధించిన భారతీయ జనతా పార్టీ దానిని నిలుపుకునే పరిస్థితి కనబడడం లేదు. ఒక ప్రణాళికాబద్ధంగా బీజేపీ నాయకులు అడుగులు ముందుకు వేయడం లేదు. మరో నెల, రెండు నెలల్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు సాధించేందుకు అధికార కాంగ్రెస్‌ పార్టీతో పాటు బీఆర్‌ఎస్‌, బీజేపీలు తహతహలాడుతున్నాయి. ఈ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకునేందుకు ఇప్పటినుంచే వ్యూహాలు పన్నుతున్నారు. ఆపరేషన్‌ ఆకర్ష్‌తో విపక్ష పార్టీల్లో ఉన్న నాయకులను లాక్కుని ఆ పార్టీలను కకావికలం చేయాలని అధికార పార్టీ నాయకులు భావిస్తున్నప్పటికీ, వారి రాకను కాంగ్రెస్‌ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు అడ్డుకట్ట వేస్తున్నారు.

పెద్ద దిక్కుగా మంత్రి శ్రీధర్‌బాబు..

గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో మంథని నుంచి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పెద్దపల్లి నుంచి చింతకుంట విజయరమణారావు, రామగుండం నుంచి రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌ గెలుపొందారు. శ్రీధర్‌బాబుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి పదవి వరించింది. ఆయన జిల్లాకు పెద్దదిక్కు కాగా, ప్రభుత్వంలో ఆయన క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అన్ని తానై చక్కదిద్దుతున్నారు. జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం నిధులు తీసుకరావడంలో ఆయన ముఖ్య భూమిక పోషిస్తున్నారు. ఎమ్మెల్యేలు విజయరమణారావు, మక్కాన్‌ సింగ్‌లను కలుపుకుని వెళుతూ అభివృద్ధికి కోట్ల నిధులు తీసుకవస్తున్నారు.

పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణ విజయం..

పెద్దపల్లి పార్లమెంట్‌ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఎంపీ వివేక్‌ తనయుడు గడ్డం వంశీకృష్ణ 1,31,771 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆయనకు 4,80,994 రాగా, రెండో స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి గొమాసే శ్రీనివాస్‌కు 3,49,339 ఓట్లు సాధించారు. మూడో స్థానంలో నిలిచిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ 1,94,821 ఓట్లు సాధించారు. పార్లమెంట్‌ పరిధిలో అంతగా క్యాడర్‌, బలం లేని బీజేపీ రెండో స్థానంలో నిలవడం గమనార్హం. ఒక దశలో బీజేపీ అభ్యర్థి గెలుపొందనున్నారనే టాక్‌ వచ్చింది. ఈ పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలే ఉండడం వంశీకృష్ణ విజయానికి దోహదపడింది.

ఇద్దరికి రాష్ట్ర స్థాయి నామినేటెడ్‌ పోస్టులు..

జిల్లాకు చెందిన ఇద్దరు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులకు రాష్ట్రస్థాయి నామినేటెడ్‌ పోస్టులు దక్కాయి. గోదావరిఖనికి చెందిన హర్కార వేణుగోపాల్‌రావుకు కేబినెట్‌ హోదాగల ప్రభుత్వ సలహాదారు (ప్రొటోకాల్‌, పబ్లిక్‌ రిలేషన్‌), ఐఎన్‌టీయూసీ నాయకులు జనక్‌ప్రసాద్‌కు కనీస వేతనాల కమిటీ సలహా మండలి చైర్మన్‌ పదవి వరించింది. జిల్లా స్థాయిలో సుల్తానాబాద్‌కు చెందిన అంతటి అన్నయ్యగౌడ్‌కు జిల్లా గ్రంథాలయ పదవి దక్కింది. పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలో గల పెద్దపల్లి, సుల్తానాబాద్‌, కాల్వశ్రీరాంపూర్‌, జూలపల్లి, ధర్మపురి పరిధిలోని ధర్మారం మార్కెట్‌లకు పాలకవర్గాలను నియమించగా, మంథని, కమాన్‌పూర్‌, రామగుండం మార్కెట్లకు కమిటీలను నియమించాల్సి ఉంది.

సుల్తానాబాద్‌, మంథని మున్సిపాలిటీలు హస్తగతం..

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ నాయకులు చక్రం తిప్పి సుల్తానాబాద్‌, మంథని మున్సిపాలిటీలను హస్తగతం చేసుకున్నారు. సుల్తానాబాద్‌ చైర్మన్‌గా ఉన్న ముత్యం సునీత, మంథని చైర్మన్‌గా ఉన్న పుట్ట శైలజలపై బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన కౌన్సిలర్లను తమ పార్టీలో చేర్చుకుని ఆవిశ్యాస తీర్మానాలను ప్రవేశపెట్టి తమ వాళ్లకు చైర్మన్‌ పదవులు దక్కేలా చేశారు. సుల్తానాబాద్‌ చైర్‌పర్సన్‌గా గాజుల లక్ష్మి, మంథని చైర్‌పర్సన్‌గా పెండ్రు రమాదేవి ఎన్నికయ్యారు.

బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిరసనలు..

రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై బీఆర్‌ఎస్‌ పార్టీ పోరాటం చేస్తున్నది. పార్టీ నాయకులు, కార్యకర్తల ఆత్మస్థయిర్యం చెదరకుండా ఉండేందుకు బీఆర్‌ఎస్‌ నాయకులు పార్టీ ఆదేశాల మేరకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ సెంటిమెంట్‌ను రగిలించేందుకు నవంబరు 29న దీక్షా దివస్‌ నిర్వహించగా, పూర్తి స్థాయిలకు రైతులకు రుణమాఫీ చేయలేదని, రైతు బంధు పథకాన్ని తుంగలో తొక్కిందని విమర్శిస్తూ కార్యక్రమాలు చేపట్టారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ 420 హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసిందని, వాటన్నింటినీ ప్రజల్లోకి తీసుక వెళుతున్నారు. ఏడాది పాలన సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ విజయోత్సవాలు నిర్వహిస్తూ, బీఆర్‌ఎస్‌ అందుకు విరుద్ధంగా నిరసనలు చేపట్టారు. జిల్లా పార్టీని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, నియోజకవర్గ ఇన్‌చార్జీలు దాసరి మనోహర్‌రెడ్డి, పుట్ట మధూకర్‌, కోరుకంటి చందర్‌లను సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకవెళుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ బలం నిరూపించుకోవాలని చూస్తున్నారు.

బీజేపీకి పెరిగిన ఓట్లు..

కేంద్రంలో వరుసగా మూడోసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ, జిల్లాలో ఆ పార్టీ జోరు పెరగడం లేదు. అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంట్‌ ఎన్నికల్లో అత్యధిక ఓట్ల శాతాన్ని సాధించిన బీజేపీ దానిని నిలబెట్టుకునేందుకు చర్యలు చేపట్టడం లేదు. నిర్మాణాత్మకమైన కార్యక్రమాలను చేపట్టడం లేదు. ఎప్పటిలాగానే అందరి నాయకుల మధ్య సమన్వయం కొరవడింది. క్షేత్రస్థాయిలో కొంత బీజేపీ గాలి వీస్తున్నప్పటికీ, దానిని అందిపుచ్చుకునేందుకు చర్యలు చేపట్టడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని ఆరాట పడుతున్నది. పార్టీకి చెందిన అందరు నాయకులను సమన్వయ పరిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటే అవకాశాలు లేకపోలేదు.

Updated Date - Dec 27 , 2024 | 01:00 AM