Share News

సాగు.. బాగు..

ABN , Publish Date - Dec 28 , 2024 | 01:47 AM

గత వర్షాకాలం సీజన్‌లో సాధారణానికి మించి వర్షాలు కురియడంతో నీటి వనరులన్నీ జలకళను సంతరించుకున్నాయి. దీంతో రెండు పంటలకు ఢోకా లేకుండాపోయింది. ఈ ఏడాది ప్రారంభంలో యాసంగి సీజన్‌, ఆ తర్వాత వానాకాలం సీజన్‌లో రైతులు సమృద్ధిగా పంటలు వేశారు.

సాగు.. బాగు..

- రెండు పంటలకు సరిపడా నీరు

- ఆశించిన స్థాయిలో కురిసిన వర్షాలు

- ప్రాజెక్టులు, చిన్ననీటి వనరులకు జలకళ

- 60,619 మందికి రూ.455.5 కోట్ల రుణమాఫీ

- సన్నాలకు క్వింటాలుకు రూ.500 బోనస్‌

- పత్తి రైతులకు దక్కని మద్దతు ధర

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

గత వర్షాకాలం సీజన్‌లో సాధారణానికి మించి వర్షాలు కురియడంతో నీటి వనరులన్నీ జలకళను సంతరించుకున్నాయి. దీంతో రెండు పంటలకు ఢోకా లేకుండాపోయింది. ఈ ఏడాది ప్రారంభంలో యాసంగి సీజన్‌, ఆ తర్వాత వానాకాలం సీజన్‌లో రైతులు సమృద్ధిగా పంటలు వేశారు. యాసంగి సీజన్‌కు సమయాత్తం అవుతున్నారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఒక్కటొక్కటిగా అమలు చేస్తున్నది. అర్హులైన రైతులకు ఏక కాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడంతో పాటు వానాకాలం సీజన్‌లో సన్న ధాన్యాన్ని పండించిన రైతులకు క్వింటాలుకు 500 రూపాయల చొప్పున బోనస్‌ ఇవ్వగా, రైతు భరోసా పథకాన్ని గానీ, గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన రైతు బంధు పథకాన్ని గానీ అమలు చేయకపోవడం గమనార్హం. గత సీజన్‌ నుంచే పంటల బీమా పథకాన్ని అమలుచేస్తామని చెప్పిన ప్రభుత్వం ఈ యాసంగి సీజన్‌లో కూడా అమలు చేయడం లేదు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా కింద ఎకరానికి 7,500 రూపాయల చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తామని, వచ్చే వానాకాలం సీజన్‌ నుంచి పంటల బీమా పథకాన్ని చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ప్రకటించారు. వరి ధాన్యానికి ప్రభుత్వ మద్దతు ధరలు లభిస్తున్నప్పటికీ, పత్తి రైతులకు మాత్రం మద్దతు ధరలు లభించలేదు. ఈ ఏడాది గడిచిన యాసంగి సీజన్‌లో జిల్లాలో 2,22,382 ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న తదితర పంటలను సాగు చేశారు. వానాకాలం సీజన్‌లో 2,77,743 ఎకరాల్లో వరి, మొక్కజొన్న తదితర పంటలను సాగు చేశారు.

ఫ ప్రాజెక్టులకు జలకళ..

గడిచిన వర్షాకాలంలో జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. మొదట పెద్దగా వర్షాలు పడకపోయినా జూలై చివరి వారం నుంచి ఆగస్టు వరకు జోరుగా వర్షాలు పడ్డాయి. ఈ వర్షాలకు జిల్లాలోగల శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో పాటు, ఇక్కడినుంచి నంది, గాయత్రి పంపుహౌస్‌ల ద్వారా శ్రీరాజరాజేశ్వర రిజర్వాయర్‌ మిడ్‌ మానేరుకు దాదాపు 40 టీఎంసీలకు పైగా నీటిని ఎత్తిపోశారు. అదనపు జలాలను గోదావరిలోకి వదిలిపెట్టారు. అలాగే జిల్లాకు వర ప్రదాయిని అయిన శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు కూడా పూర్తిస్థాయిలో నిండింది. యాసంగి సీజన్‌కు ఈనెల 25వ తేదీన నీటిని విడుదల చేశారు. ఎప్పటిలాగానే ఆన్‌అండ్‌ఆఫ్‌ పద్ధతిన సాగునీటిని విడుదల చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నుంచి నీటిని ఎత్తిపోయకుండానే రెండు పంటలకు సరిపడా నీళ్లు ఎస్సారెస్పీ, మిడ్‌ మానేరు, ఎల్‌ఎండీ, శ్రీపాద ఎల్లంపల్లిలో చేరడం గమనార్హం.

ఫ ఏక కాలంలో రూ.455.5 కోట్ల రుణమాఫీ..

తాము అధికారంలోకి వస్తే రైతులు పొందిన పంట రుణాలను 2 లక్షల వరకు ఏకకాలంలో అమలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మేరకు ఆగస్టు రెండో వారం నుంచి ప్రభుత్వం రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించింది. ఇప్పటి వరకు నాలుగు విడతల్లో కలిపి 60,619 మంది రైతులకు 455 కోట్ల 50 లక్షల రూపాయలు మాఫీ చేశారు. రైతు భరోసా పథకం కింద వానాకాలంలో సన్నాలు పండించే వారికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్‌ ఇస్తామని ప్రకటించిన మేరకు రైతుల ఖాతాల్లో బోనస్‌ సొమ్మును పౌరసరఫరాల శాఖ జమ చేస్తున్నది. ఇప్పటివరకు సుమారు 2 లక్షల 5 వేల మెట్రిక్‌ టన్నుల సన్న రకం ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ పంటకు బోనస్‌ రూపేణా 100 కోట్ల రూపాయల వరకు అందనున్నాయి. బోనస్‌తో కౌలు రైతులకు ప్రయోజనం చేకూరింది. అలాగే పాత రైతుబంధు పథకం ద్వారా యాసంగి పంటకు 1,21,555 మంది రైతులకు 72 కోట్ల రూపాయల వరకు జమ చేశారు. ఇంకా రైతు భరోసాను పూర్తిగా అమల్లోకి తీసుక రాలేదు. ఈ యాసంగి సీజన్‌ నుంచి రైతు భరోసా సంక్రాంతి పండుగ నుంచి అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

Updated Date - Dec 28 , 2024 | 01:47 AM