Share News

వలస కూలీలతో ఊరట

ABN , Publish Date - Nov 06 , 2024 | 12:55 AM

ఎన్నో ఆశలతో పతిసాగు చేసిన రైతులను దిగుబడి ఆందోళనకు గురి చేసింది. మరోవైపు చేతికొచ్చిన పంటను ఏరేందుకు కూలీల కొరత వేధించింది. ఈ పరిస్థితుల్లో ఆంధ్రా ప్రాంతం నుంచి వలస వచ్చిన కూలీలతో పత్తి రైతులకు కాస్తా ఊరట లభించింది.

 వలస కూలీలతో ఊరట

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

ఎన్నో ఆశలతో పతిసాగు చేసిన రైతులను దిగుబడి ఆందోళనకు గురి చేసింది. మరోవైపు చేతికొచ్చిన పంటను ఏరేందుకు కూలీల కొరత వేధించింది. ఈ పరిస్థితుల్లో ఆంధ్రా ప్రాంతం నుంచి వలస వచ్చిన కూలీలతో పత్తి రైతులకు కాస్తా ఊరట లభించింది. జిల్లాలో రైతులకు పత్తి ఎరడానికి రైతులు సాగు కంటే రెట్టింపు ఇబ్బందులు పడుతున్నారు. ఆంధ్రా ప్రాంతంలోని కర్నూలు, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, ప్రాంతాల నుంచి ముందుగా అడ్వాన్స్‌లు చెల్లించి కూలీలను రప్పిస్తున్నారు. పత్తి ఏరడానికి వచ్చిన వారికి సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. దీంతో పాటు వానాకాలం సీజన్‌లో వరినాట్ల కోసం వచ్చిన బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌, బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌ కూలీల్లో కొందరు పత్తి ఎరడానికి జిల్లాలోనే ఉండిపోయారు. వలస కూలీలతో రైతులకు వెసులుబాటు కలిగినా పత్తి ఎరడానికి గతంలో కంటే ఎక్కువగా డిమాండ్‌ చేస్తున్నారు. గతేడాది కిలో పత్తి ఏరితే రూ.6 నుంచి 8 చెల్లించే వారు. ప్రస్తుతం కిలోకు రూ.12కు పైగా ఇస్తున్నారు. పొరుగు గ్రామాల నుంచి కూలీలు వస్తే రవాణా చార్జీలు అదనంగానే చెల్లించాల్సి వస్తోంది. ఒక్కో కూలీ రోజుకు 60 నుంచి 70 కిలోల వరకు పత్తి ఏరుతున్నారు. దాదాపు రూ.700 నుంచి రూ.800 వరకు సంపాదిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాకు ఆంధ్రా నుంచి దాదాపు 300 మంది కూలీలు వచ్చారు.

పత్తి సాగు దిగుబడి దిగాలు

జిల్లాలో వానాకాలం సీజన్‌లో 49,392 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. సాగు ప్రారంభంలో వర్షాభావ పరిస్థితులు ఇబ్బందులు పెడితే ఆ తరువాత అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలకు పత్తి దిగుబడిపై ప్రభావం చూపాయి. పత్తి నల్లబారడంతోపాటు భారీ వర్షాలకు పత్తి కొట్టుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. దిగుబడిపై కూడా ప్రభావం చూపిందని రైతులు అందోళన చెందుతున్నారు. జిల్లాలో గంభీరావుపేటలో 220 ఎకరాలు, ఇల్లంతకుంటలో 12412 ఎకరాలు, ముస్తాబాద్‌లో 760 ఎకరాలు, సిరిసిల్లలో 720 ఎకరాలు, తంగళ్లపల్లిలో 1300 ఎకరాలు, వీర్నపల్లిలో 514 ఎకరాలు, ఎల్లారెడ్డిపేటలో 3900 ఎకరాలు, వేములవాడలో 5100 ఎకరాలు, వేములవాడ రూరల్‌లో 3950 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. దిగుబడిపై ఎంతో అశలు పెంచుకున్న రైతులకు మళ్లీ అకాల వర్షాలు తుఫానుభయం వెంటాడుతుంది.

జిల్లాలో మూడు సీసీఐ కేంద్రాలు

జిల్లాలో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. సీసీఐ ద్వారా ఐదు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడానికి లక్ష్యంగా పెట్టుకోని మూడు కేంద్రాలను సోమవారం ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా వేములవాడ అర్బన్‌ మండలం నాంపల్లి, సంకెపల్లి, కోనరావుపేట మండలం సుద్దాలలో ప్రారంభించారు. కానీ రైతులు సీసీఐ పెట్టిన నిబంధనలు దృష్టిలో పెట్టుకొని ప్రైవేటు వ్యాపారులకు నేరుగా అమ్ముకుంటున్నారు. పత్తి క్వింటాల్‌కు మద్దతు ధర రూ. 7521 ఉండగా రూ.6500 వరకు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. దీని ద్వారా రైతులు రూ.1500 వరకు నష్టపోతున్నారు. సీసీఐ కేంద్రాల ద్వారా పత్తిని అమ్ముకునే రైతులకు తేమ శాతం ఆధారంగా మద్దతు ధర లభిస్తుంది. సీసీఐ నిబంధనల ప్రకారం పత్తిని 8 నుంచి 12 శాతం తేమ ఉంటేనే కొనుగోలు చేస్తుంది. మద్దతు ధర క్వింటాల్‌కు రూ.7521 ఉన్నా 8శాతం లోపు తేమ ఉంటేనే పూర్తి స్థాయి ధర లభిస్తుంది. తేమ శాతం పెరిగిన కొద్దీ ధర తగ్గుతుంది. 9 శాతం తేమ ఉంటే రూ.7445.79, 10 శాతం ఉంటే 7370.58, 11 శాతం ఉంటే 7295.37, 12 శాతం ఉంటే 7220.16 చెల్లించనున్నారు. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరను ఇటీవలనే సవరించింది. గతేడాది పత్తిధర మధ్య రకం క్వింటాల్‌కు రూ.6620, పొడవు రకం రూ.7020 ఉంది. ఈ సారి మధ్యరకం రూ.7121, పొడవు రకం రూ.7521కి పెంచింది. గతేడాది కంటే క్వింటాల్‌కు మద్దతు ధర రూ. 501 పెరిగింది.

ఉపాధి లేక వలస వచ్చాం

- బోయ వీరేష్‌, ఎమ్మిగనూరు, ఆంధ్రా

సొంతూరిలో ఉపాధి లేక పత్తి ఎరడానికి వలస వచ్చాం. మూడు నెలలపాటు ఇల్లంతకుంట మండలంలోనే ఉండి పత్తి ఏరుతాం. ప్రతీ రోజు 80 కిలోల చొప్పున ఏరుతాం. నర్సక్కపేట గ్రామానికి 150 మంది కూలీలం వచ్చాం. పత్తి ఏరే ప్రదేశానికి తీసుకెళ్లే బాధ్యత రైతులదే.

వసతులు లేకున్నా సర్దుకుపోతాం

- పద్మ, కర్నూలు

గ్రామంలోని పశువుల పాకలోనే ఉంటాం. వసతులు లేకపోయిన సర్దుకుపోతాం. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకు పత్తి ఏరుతాం. తెలంగాణలో పత్తి ఏరడం అయిపోయిన తరువాత ఆంధ్రాలో మిర్చి ఏరడానికి వెళ్తాం.

Updated Date - Nov 06 , 2024 | 12:55 AM