రామగుండం ఎన్టీపీసీలో డైరెక్టర్ రవీంద్ర పర్యటన
ABN , Publish Date - Dec 07 , 2024 | 12:27 AM
ఎన్టీపీసీ డైరెక్టర్(ఆపరేషన్స్) రవీంద్ర కుమార్ శుక్రవారం రామగుండం ప్రాజెక్టులో పర్యటించారు.
జ్యోతినగర్, డిసెంబరు 6 (ఆధ్రజ్యోతి) : ఎన్టీపీసీ డైరెక్టర్(ఆపరేషన్స్) రవీంద్ర కుమార్ శుక్రవారం రామగుండం ప్రాజెక్టులో పర్యటించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం ఇక్కడికి వచ్చిన డైరెక్టర్ రవీంద్రకు ఆర్‌ఈడీ కేదార్ రంజన్‌పాడు, ఇతర అధికారులు స్వాగతం పలికారు. తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు(టీఎస్‌టీపీపీ)లో నిర్మించిన కోల్‌శక్తి భన్‌ను డైరెక్టర్ ప్రారంభించారు. అనంతరం రామగుండం ఎన్టీపీసీలో ఏర్పాటు చేసిన హెరిటేజ్ భవన్‌ను ఆయన ప్రారంభించారు. తెలంగాణ ఎన్టీపీసీ ప్రాజెక్టు-1వ యూనిట్ కంట్రోల్‌ను డైరెక్టర్ పరిశీలించారు. కొత్తప్రాజెక్టు పనితీరును అడిగి తెలుసుకున్నారు. తరువాత 2600 మెగావాట్ల రామగుండం ప్రాజెక్టు స్టేజ్-1లోని 200 మెగావాట్ల 1వ యూనిట్ కంట్రోల్ రూంను పరిశీలించారు.
ఎన్టీపీసీ భవిష్యత్ సారధులు ఈటీలే..
దేశానికి వెలుగులనందిస్తున్న ఎన్టీపీసీకి భవిష్యత్ సారధులు కొత్తగా చేరిన ఎగ్జిక్యూటివ్ ట్రైనీ(ఈటీ)లేనని డైరెక్టర్ రవీంద్ర కుమార్ అన్నారు. తన పర్యటనలో భాగంగా ప్రాజెక్టులో శిక్షణ తీసుకుంటున్న యువ ఈటీలతో డైరెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ రంగంలో ప్రపంచస్థాయి సంస్థగా గుర్తింపు పొందిన ఎన్టీపీసీని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలన్నారు. సీనియర్ అధికారుల మార్గర్శనంలో తమ వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అవగాహన చేసుకొని ఎన్టీపీసీలో కొత్త ఆవిష్కరణలు చేయాలని ఈటీలను కోరారు. ప్రాజెక్టులను సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరమైన అన్ని అంశాలను నేర్చుకోవాలని డైరెక్టర్ రవీంద్ర కోరారు. అనంతరం డైరెక్టర్ గుర్తింపు యూనియన్, ఇతర యూనియన్ల నాయకులు, అధికారుల సంఘం, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘాలతో సమావేశమయ్యారు. కాగా, శనివారం డైరెక్టర్(ఆపరేషన్స్) 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టును సందర్శించనున్నారు. అనంతరం దక్షిణాది రాష్ట్రాల ఎన్టీపీసీ ప్రాజెక్టుల ఆపరేషన్స్ విభాగం అధికారులు, హెచ్‌వోపీలతో జరిగే సదస్సులో డైరెక్టర్ పాల్గొంటారు.డైరెక్టర్ వెంట ఈడీ(ఆపరేషన్ష్) ఎ.కె.మనోహర్, ఆర్‌ఈడీ కేదార్ రంజన్ పాడు, ఇతర ఉన్నతాధికారులున్నారు.