మిషన్ భగీరథపై ఇంటింటి సర్వే
ABN , Publish Date - Jun 14 , 2024 | 12:56 AM
మిషన్‌భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు ఇంటింటికి అందుతుందా... లోపాలు, ఇబ్బందులు ఉన్నాయా, నల్లాల కనెక్షన్లు లెక్క పక్కాగా ఉందా ఇలా 11 అంశాలపై అధికార యంత్రాంగం ఇంటింటి సర్వేకు శ్రీకారం చుట్టింది.
- 11 అంశాలపై క్షేత్ర స్థాయిలో వివరాల సేకరణ
- ప్రత్యేక యాప్‌లో నమోదు
- జిల్లా వ్యాప్తంగా 1.13 లక్షల ఇళ్లకు నీటి సరఫరా
- 622 ట్యాంకులు... 1263.77 కిలోమీటర్ల పైపు లైన్
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
మిషన్‌భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు ఇంటింటికి అందుతుందా... లోపాలు, ఇబ్బందులు ఉన్నాయా, నల్లాల కనెక్షన్లు లెక్క పక్కాగా ఉందా ఇలా 11 అంశాలపై అధికార యంత్రాంగం ఇంటింటి సర్వేకు శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వం మిషన్‌భగీరథ పేరుతో ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమయ్యే మేరకు తాగునీరు అందించడానికి కోట్ల రూపాయల వ్యయంతో మిషన్‌భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టారు. పథకం పూర్తయిన ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో అనేక సమస్యలను మిషన్‌భగీరథలో ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం చేపట్టిన మిషన్‌భగీరథ సమగ్ర సర్వే ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మిషన్‌భగీరథ పథకం పనితీరులోని లోపాలు బయటపడే అవకాశం ఉంది. జిల్లాలో ఇప్పటికే పలు గ్రామాల్లో మిషన్‌భగీరథ ద్వారా నీళ్లు సక్రమంగా రావడం లేదని, మురికి నీరు, ఇతర సమస్యలపై అందోళనలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ప్రతి జిల్లా పరిషత్ సమావేశంలోనూ మిషన్‌భగీరథ సమస్యలను సభ్యులు ప్రధానంగా లేవనెత్తుతున్నారు. ఈ పరిస్థితులపై క్షేత్రస్థాయిలో సర్వే చేసి సమస్యలు తెలుసుకోవడమే కాకుండా కేంద్ర జలశక్తి శాఖ నుంచి నిర్వహణ నిధులు మంజూరు కూడా చేసుకోవాలనే భావనతో ప్రభుత్వం సర్వే చేపట్టింది. ఈ మేరకు జిల్లాలో సర్వే చేస్తున్నారు. దాదాపు పది రోజుల పాటు జరిగే సర్వేలో పంచాయతీరాజ్ సిబ్బంది, కార్యదర్శులు, ప్రతి ఇంటికి వెళ్లి నల్లా కనెక్షన్ ఉందా, పనిచేస్తుందా, ఎంతవరకు నీళ్లు వస్తున్నాయి. ఎన్ని రోజులకు ఒకసారి వస్తున్నాయి. వివరాలతో పాటు లబ్ధిదారుని పేరు చిరునామా, కుటుంబసభ్యుల వివరాలు సెల్ నంబర్, ఆధార్ సంఖ్య, ఇంటి నంబర్, ఇతర వివరాలు నమోదు చేయడంతో పాటు ఇంటి ఫొటో, నల్లా ఫొటోలను సైతం యాప్ ద్వారా వివరాలు నమోదు చేస్తున్నారు. లబ్ధిదారుడి సెల్ నంబర్‌కు ఓటీపీ కూడా వస్తుంది. దీనివల్ల పారదర్శకంగా వివరాల సేకరణ జరుగుతుందని చెప్పుకోవచ్చు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న సర్వేను కలెక్టర్ అనురాగ్ జయంతి స్వయంగా పరిశీలించారు.
ఫ జిల్లాలో మిషన్‌భగీరథ పరిస్థితి ఇలా...
జిల్లా వ్యాప్తంగా 12 మండలాలు, 255 గ్రామపంచాయతీలు, అనుబంధ గ్రామాలు కలుపుకొని మిషన్‌భగీరథ ద్వారా నల్లా కనెక్షన్లు అందించి నీటి సరఫరా చేస్తున్నారు. జిల్లాలో మిషన్‌భగీరథ రూ. 143.83 కోట్ల వ్యయంతో పథకాన్ని చేపట్టారు. అగ్రహరం వద్ద 120 ఎంఎల్‌డీ నీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలో 625 ట్యాంక్‌లు ఏర్పాటు చేయగా వారిలో పాత ట్యాంక్‌లు 359, కొత్త ట్యాంక్‌లు 227 నిర్మించారు. విలీన అవాసాల్లో పాత ట్యాంక్‌లు 19, కొత్త ట్యాంక్‌లు 20 నిర్మించారు. మిషన్‌భగీరథ ఇంట్రా పైప్‌లైన్ 1,263.77 కిలోమీటర్లు నిర్మించారు. వీటితో పాటు ప్రభుత్వ సంస్థలు, ఇతరులకు సంబంధించి 443 పాఠశాలలు, 480 అంగన్‌వాడీ కేంద్రాలు, 38 ప్రాథమిక ఉపఅరోగ్య కేంద్రాలు, రైతు వేదికలు, వైకుంఠధామాలకు కనెక్షన్లు అందించారు. గ్రామాల వారీగా చూస్తే 255 గ్రామపంచాయతీల్లో 1.13 లక్షల ఇళ్లకు నీటి సరఫరా చేస్తున్నారు. బోయినపల్లి మండలంలో 23 గ్రామాలు, 9,811 ఇళ్లు, చందుర్తిలో 19 గ్రామాలు, 8,666 ఇళ్లు, ఇల్లంతకుంటలో 33 గ్రామాలు, 13,555 ఇళ్లు, గంభీరావుపేటలో 21 గ్రామాలు, 13,521 ఇళ్లు, కోనరావుపేటలో 28 గ్రామాలు, 11,521 ఇళ్లు, ముస్తాబాద్ 22 గ్రామాలు, 13,181 ఇళ్లు, రుద్రంగిలో 10 గ్రామాలు 4,040 ఇళ్లు, తంగళ్లపల్లిలో 30 గ్రామాలు 12,037 ఇళ్లు, వీర్నపల్లిలో 17 గ్రామాలు, 3445 ఇళ్లు, వేములవాడలో 11 గ్రామాలు, 4,984 ఇళ్లు, వేములవాడ రూరల్‌లో 17 గ్రామాలు 5,758 ఇళ్లు, ఎల్లారెడ్డిపేటలో 24 గ్రామాలు 13,247 ఇళ్లు, వీటితో పాటు సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లోని ఇళ్లకు నీటి సరఫరా చేస్తున్నారు.
ఫ నీటి సరఫరాపై కలెక్టర్ ఆరా
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మిషన్‌భగీరథ ఇంటింటి సర్వేపై క్షేత్ర స్థాయిలో కలెక్టర్ అనురాగ్ జయంతి అరా తీశారు. గురువారం కోనరావుపేట మండలం ధర్మారంలో సిబ్బంది చేస్తున్న సర్వేను కలెక్టర్ పరిశీలించారు. వివరాలు యాప్‌లో ఎలా నమోదు చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. నీటి సరఫరాపై మహిళలతో కలెక్టర్ మాట్లాడారు. ఎన్ని గంటలకు నీళ్లు వస్తున్నాయి. ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ పూజారి గౌతమి, జడ్పీ సీఈవో ఉమారాణి, డీఈవో రమేష్‌కుమార్, ఇరిగేషన్ ఈఈ అమరేందర్‌రెడ్డి, ఎంపీడీవో శశికళ ఉన్నారు.