రైతులకు మెరుగైన సేవలందించేందుకు కృషి
ABN , Publish Date - Nov 09 , 2024 | 12:33 AM
జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు.
పెద్దపల్లిటౌన్, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్లో నూతన వ్యవసాయ సహకార సంఘాల ఏర్పాటుపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులకు అన్నిరకాల సేవలు అందించడం కోసం ప్రాథమిక సహ కార సంఘాలు(ప్యాక్స్) జిల్లాలోని ప్రతి గ్రామం, మండలం కవర్ అయ్యే విధంగా చూడాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లాలో ఉన్న 20 ప్యాక్స్‌కు అదనంగా మరో 5 నుంచి 7ప్యాక్స్ ఏర్పాటు చేయాలని, వీటి ద్వారా రైతు లకు అన్ని రకాల సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్యాక్స్ ద్వారా రైతుల కు దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాలతో పాటు అవసరమైన ఎరువులు విత్తనాలు అమ్మకం, వారి ధాన్యం సేకరణ, బంగారు రుణాలు, ఇతర సేవలు అందించాలని తెలిపారు. జిల్లాలోని ఎలిగేడు, చిన్నకాల్వల ప్యాక్స్‌ల పరిధిలోని జనఔషధ కేంద్రాల ను నిర్వహించేందుకు రిజిస్ట్రేషన్ చేయించాలని, జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఎఫ్‌సీ ఎస్ అనుకూలంగా ఉన్నచోట డెయిరీ కార్పొరేట్ సొసైటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. డెయిరీ కార్పొరేటు సొసైటీల ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి ఆర్థిక సహకారమైన నాబార్డు ద్వారా అందించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు గోదాములు, కోల్డ్ స్టోరేజీ, రైస్ మిల్లుల ఏర్పాటుకు ముందుకు వస్తే అవసరమైన సంపూర్ణ సహకారం అందజేస్తామని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా సహకార అధికారి శ్రీమాల, డీడీఎం నాబార్డ్, జిల్లా మత్స్యశాఖ అధికారి లీడ్ బ్యాంకు మేనేజర్ జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.