Share News

పల్లె ఎన్నికలకు కసరత్తు

ABN , Publish Date - Nov 24 , 2024 | 01:12 AM

పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. జిల్లాలో 260 గ్రామ పంచాయతీలు, 2268 వార్డుల్లో ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది.

పల్లె ఎన్నికలకు కసరత్తు

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. జిల్లాలో 260 గ్రామ పంచాయతీలు, 2268 వార్డుల్లో ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంక్రాంతి పండుగకు కొత్త సర్పంచులు వస్తారని ప్రకటించడం, అదే క్రమంలో వేములవాడలో విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్థానిక సంస్థల్లో తమ కార్యకర్తలు సత్తా చాటుతారని, ప్రకటించడం వంటి పరిణామాలతో జిల్లాలోని ఆశావహుల్లో ఉత్సాహం నింపింది. గ్రామాల్లో రిజర్వేషన్ల ప్రక్రియపై ఉత్కంఠ నెలకొన్నా పెద్దలను పలకరిస్తూ తమ ప్రాబల్యాన్ని పెంచుకుంటున్నారు. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో బీసీ కమిషన్‌ అభిప్రాయాలు సేకరించడం, సమగ్ర కుటుంబ సర్వేలో కులగణన చేస్తుండడంతో ఎన్నికల పక్రియ ముందుకువస్తుందని భావిస్తున్నారు. ఎప్పుడు నోటిఫికేషన్‌ వచ్చినా పోటీల్లో ఉండేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

సంక్రాంతి నాటికి సర్పంచులు

2019 జనవరిలో సంక్రాంతి పండుగ సమయంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లాలో మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించారు. ఫ్రిబవరి 1న సర్పంచుల పదవీకాలం ముగిసింది. దాదాపు ఏడాది తరువాత మళ్లీ పల్లెల్లో ఎన్నికల సందడి ప్రారంభంకానుంది. జనవరి సంక్రాంతి వరకు సర్పంచులు, వార్డు మెంబర్ల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసి ఫిబ్రవరిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ అదే క్రమంలో మున్సిపల్‌ ఎన్నికలు కూడా నిర్వహించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

కాంగ్రెస్‌లో జోష్‌

పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో ఆ పార్టీలోని నాయకుల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలపై జోష్‌ పెరిగింది. గత పాలకవర్గాల్లోని సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు బీఆర్‌ఎస్‌కు చెందిన వారే కొనసాగారు. కొన్ని చోట్ల కాంగ్రెస్‌ నుంచి గెలుపొందిన తరువాత గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం రాజకీయ పరిణామాలు మారడంతో మళ్లీ బీఆర్‌ఎస్‌కు వెళ్లిన వారు సొంత గూటికి చేరుకుంటున్నారు. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ స్థానాలపై ఆశలు పెంచుకొని పార్టీ పెద్దల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం మొదలు పెట్టారు. ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకున్నవారు ఈ సారి తమకు పదవీ యోగం ఉంటుందనే ఆశగా ఉన్నారు.

రిజర్వేషన్లపై టెన్షన్‌

జిల్లాలో 2019లో 255 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఈ సారి జిల్లాలో ఐదు గ్రామ పంచాయతీలు కొత్తగా ఏర్పడ్డాయి. ఇల్లంతకుంటలో తాళ్లపల్లి, బోటీవానిపల్లె, గంభీరావుపేటలో హీరాలాల్‌ తండా, ఎల్లారెడ్డిపేటలో జై సేవాలాల్‌ తండా, రాచర్ల బహూర్‌పల్లి పంచాయతీలు కలుపుకొని 260 సర్పంచ్‌ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ సారి పాత రిజర్వేషన్లు ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తారా, కొత్తగా రిజర్వేషన్లు మారుస్తారా అనే దానిపై ఆశావహుల్లో టెన్షన్‌ మొదలైంది. బీసీ కమిషన్‌ను నియమించి అభిప్రాయాలు సేకరిస్తున్న క్రమంలో రిజర్వేషన్లు మారుస్తారనే చర్చ కొనసాగుతోంది. రిజర్వేషన్లు ఎలా ఉన్నా రంగంలో ఉండడానికి కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీకి చెందిన ప్రతినిధులు సిద్ధమవుతున్నారు.

అధికారుల సమాయత్తం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు సమాయత్తం అయ్యారు. ఎన్నికల నిర్వహణకు అవసరమయ్యే బ్యాలెట్‌ బాక్స్‌లు, ఇతర ఏర్పాట్లపై కసరత్తు ప్రారంభించారు. జిల్లాలోని 260 గ్రామ పంచాయతీలు, 2268 వార్డు మెంబర్ల ఎన్నికలకు సంబంధించి గతంలో మాదిరిగానే మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో మొదటి విడతలో రుద్రంగి, చందుర్తి, వేములవాడ, వేములవాడ రూరల్‌, బోయినపల్లి మండలాల్లో 80 సర్పంచులు 722 వార్డు సభ్యులకు రెండో విడతలో వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్‌ మండలాల్లోని 87 సర్పంచులు, 762 వార్డు సభ్యులు, మూడో విడతలో తంగళ్లపల్లి, ఇల్లంతకుంట, కోనరావుపేట మండలాల్లోని 93 సర్పంచులు, 784 వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధం చేస్తున్నారు.

ఓటరు జాబితా సిద్ధం

జిల్లాలో ఓటరు జాబితాను సిద్ధం చేశారు. జిల్లాతో 3,46,259 మంది పల్లె ఓటర్లు ఉండగా పురుషులు 1,67,686 మంది, మహిళలు 1,78,553 మంది ఉన్నారు. తుది ఓటరు జాబితా కూడా రానుంది.

Updated Date - Nov 24 , 2024 | 01:12 AM