Share News

కరువు లేకున్నా కష్టం

ABN , Publish Date - Dec 27 , 2024 | 01:02 AM

జిల్లాలో ఈ ఏడాది కరువు లేకున్నా అన్నదాతల కష్టాలు పూర్తిగా తొలగలేదు.

కరువు లేకున్నా కష్టం

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

జిల్లాలో ఈ ఏడాది కరువు లేకున్నా అన్నదాతల కష్టాలు పూర్తిగా తొలగలేదు. వానాకాలం సీజన్‌లో సాగు ఎత్తు పల్లాలుగా సాగింది. ప్రభు త్వం అందిస్తామన్న రైతు భరోసా.. ఫసల్‌బీమా నిరాశ పర్చగా రూ.2 లక్షల రుణమాఫీ కొంత ఊరట ఇచ్చింది. రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదని రైతులు ఆవేదనతో ఉన్నారు. వానాకాలం సీజన్‌లో మొదట్లో వర్షాలు ముఖం చాటేశాయి. ఆ తర్వాత అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలతో పంటను దక్కించుకోవడానికి రైతులు తంటాలు పడ్డారు. ప్రభుత్వం సన్నరకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ ప్రకటించినా నామ మాత్రంగానే సాగు చేశారు. కష్ట, నష్టాల మధ్య కొనుగోళ్ల ఇబ్బందులు, ప్రకృతి వైపరీత్యాలను అధిగమిస్తూ సాగు గడిచింది. వానాకాలం ధాన్యం కొనుగోళ్లు ముగిసిపోగా మళ్లీ యాసంగికి సిద్ధమవుతున్నారు. ఈ యేడు జిల్లాలో సాగునీటికి ఇబ్బందులు లేవు. 2024 సంవత్సరం సాగులో మిశ్రమ ఫలితాలపై ‘ఆంధ్రజ్యోతి’ కాలచక్ర కథనం...

వానాకాలం ఇబ్బందులు

ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో రైతులు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. జిల్లాలో బోరు బావులపైనే ఆధారపడి పంటలు సాగు చేస్తారు. సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని భావించి 2.42 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు వేశారు. ఇందులో ప్రధానంగా వరి 1.80 లక్షల ఎకరాల్లో సాగు చేయగా, పత్తి 49,332, పెసర 56.26, కందులు 939, ఇతర పంటలు 122 ఎకరాల్లో వేశారు. రైతులను మొదట్లో వర్షాలు ఇబ్బంది పెట్టాయి. దాదాపు నెల రోజులపాటు వర్షాలు లేకపోవడంతో నాట్లు ఆలస్యమయ్యాయి. విత్తనం వేసుకున్న పత్తి రైతులు ఇబ్బందులు పడ్డారు. మొలకదశలోనే విత్తనాలు మాడిపోతాయని భావించారు. ఆ తర్వాత అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురిసినా రైతులు పంట నష్టాన్ని చవిచూశారు. ప్రకృతి బీభత్సంతో అతలాకుతలమయ్యారు. వరి, పత్తి, పంటలు కొట్టుకుపోయాయి. భారీ వృక్షాలు నేలకూలాయి. వర్షాలతో జిల్లాలో భూగర్భ జలాలు పెరిగాయి.

సమృద్ధిగా సాగునీరు

జిల్లాలో వర్షాకాలం సీజన్‌లో సమృద్ధిగా వర్షాలు కురవడంతో ప్రస్తుత యాసంగి సాగుకు ఇబ్బంది లేదని అన్నదాతలు భావిస్తున్నారు. యాసంగి సీజన్‌లో 1.77 లక్షల ఎకరాల్లో వివిధ పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. వరి 1.74 లక్షల ఎకరాల్లో వేస్తున్నారు. జిల్లాలో రాజరాజేశ్వర మిడ్‌మానేరు ప్రాజెక్ట్‌, అన్నపూర్ణ ప్రాజెక్ట్‌, ఎగువ మానేరు, నిమ్మపల్లి ప్రాజెక్ట్‌లతోపాటు చెరువులు జల కళను సంతరించుకున్నాయి. వరికి నీటి వసతి ప్రధానం కావడంతో చెరువులు, కుంటలతోపాటు బోరు బావుల్లోనూ భూగర్భ జలాలు సమృద్ధిగా ఉన్నాయి. జిల్లాలో 832.0 మిల్లీమీటర్ల సాధారణ వర్షాపాతానికి 1009.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రుద్రంగిలో 961.5 మిల్లీమీటర్లు, చందుర్తి 1279.4, వేములవాడ రూరల్‌ 894.2, బోయినపల్లి 955.8, వేములవాడ 1022.7, సిరిసిల్ల 981.6, కోనరావుపేట 922.9, వీర్నపల్లి 1199.2, ఎల్లారెడ్డిపేట 1017.7, గంభీరావుపేట 872.8, ముస్తాబాద్‌ 1021.2, తంగళ్లపల్లి 1024.2, ఇల్లంతకుంటలో 967.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మిడ్‌ మానేరు ప్రాజెక్ట్‌లో 27.55 టీఎంసీల సామర్థ్యానికి 26.19 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ప్రకృతి బీభత్సం

తుఫాను ప్రభావంతో జిల్లాలో రెండు సార్లు ప్రకృతి బీభత్సాన్ని సృష్టించింది. పంటలు నేలమట్టమయ్యాయి. అక్కడక్కడా చెరువులు తెగి పంటలు నీట మునిగాయి. వర్షాలకు పంటలు దెబ్బతినడంతో దిగుబడిపై ప్రభావం చూపింది. జిల్లాలో భారీ వృక్షాలు నేలమట్టమయ్యాయి. అనేక ఇళ్లు కూలిపోయాయి. విద్యుత్‌ స్తంభాలు కూలిపోవడంతో సరఫరాలో అంతరా యం ఏర్పడింది. జోరువానతో మిడ్‌మానేరుకు వరద పెరిగింది. దీంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. అనేక చోట్ల వాగులు పొంగి పొర్లాయి. కల్వర్టులు, రోడ్లు కొట్టుకుపోయాయి, రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.

వానాకాలం రూ.490 కోట్ల ధాన్యం కొనుగోలు

జిల్లాలో వానాకాలం సీజన్‌లో పండించిన ధాన్యం విక్రయించేందుకు రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. సకాలంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినా విక్రయాలు మొదలవకపోవడతో దళారులను ఆశ్రయిం చారు. ముందుగానే రైతులు ధాన్యాన్ని అమ్ముకోవడంతో పౌరసరఫరాల లక్ష్యం కూడా నెరవేరలేదు. ఎట్టకేలకు పౌరసరఫరాల శాఖ ద్వారా రూ 490.13 కోట్ల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఖరీఫ్‌కు సంబంధించి జిల్లాలో 248 కొనుగోలు కేంద్రాల ద్వారా 2,11,264 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ధాన్యానికి సంబంధించి రైతుల ఖాతాల్లో రూ.484.64 కోట్లు జమ చేశారు. వానాకాలం సీజన్‌లో 4.37 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. 3 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పౌరసరఫరాల శాఖ కొనుగోళ్లు లక్ష్యంగా పెట్టుకుంది. రైతులు నేరుగా మిల్లర్లకు విక్రయించడం, దళారులను ఆశ్రయించడం వంటి పరిణామాలతో పౌరసరఫరాల శాఖ తన లక్ష్యాన్ని 2.20 లక్షల మెట్రిక్‌ టన్నులకు తగ్గించుకుంది. తగ్గించు కున్నా లక్ష్యానికి చేరువైంది. వానాకాలం సీజన్‌ ధాన్యం సేకరణలో మిల్లర్లు మెలిక పెట్టడం, ధాన్యం దింపుకోకుండా నిరసనలకు దిగడంతో కొనుగోళ్లపై ప్రభావం చూపింది.

సన్నాల సాగు నామమాత్రమే

వానాకాలం సీజన్‌లో సన్నరకం వరి సాగుకు ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ ప్రకటించినా జిల్లాలో రైతులు నామమాత్రంగానే సాగు చేశారు. జిల్లాలో 1.80 లక్షల ఎకరాల్లో సాగు జరిగినా సన్నరకం 16300 ఎకరాల్లో మాత్రమే వేశారు. సన్నరకం ధాన్యాన్ని కూడా రైతులు దళారులకు అమ్ముకున్నారు.

అందని రైతు భరోసా

గత ప్రభుత్వం అందించిన రైతు బంధు తరహాలోనే వ్యవసాయ పెట్టుబడికి రైతు భరోసా ద్వారా ఎకరానికి రూ.7500 అందిస్తామని ప్రకటించారు. రెండు పంటలకు సంబంధించి రూ.15 వేలు రైతులకు అందాల్సి ఉంది. వానాకాలం సీజన్‌లో అందకపోవడంతో నిరాశ చెందారు. గత ప్రభుత్వం వానాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించి 12 సార్లు 1,29,407 మంది రైతులకు రూ.260.20 కోట్లు చెల్లించింది. రైతు భరోసా కింద ఆర్థిక సహాయం అందకపోవడంతో రైతులు నిరాశకు గురయ్యారు. దీనికి తోడుగా పంటలకు సంబంధించి నష్టం జరిగితే ఆదుకునే దిశగా ఫసల్‌ బీమాను అందిస్తామని ప్రకటించినా ఆచరణలోకి రాలేదు, రైతులకు పంట బీమాను మాత్రం అందించారు. దాదాపు 70 వేల మందికి పైగా రైతులు బీమా పథకంలో చేరారు.

రుణమాఫీతో ఊరట

ప్రభుత్వం ప్రకటించినట్లుగానే రూ.2 లక్షల రుణమాఫీ జిల్లా రైతులకు ఊరటనిచ్చింది. రుణమాఫీ కాలేదనే దానిపై విపక్షాలు ఆందోళనలు చేపట్టడంతో రైతు చుట్టూ రాజకీయం తిరిగింది. బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తమయ్యాయి. జిల్లాలో మూడు విడతల్లో 43,770 మంది రైతులకు రూ.346.15 కోట్ల రుణమాఫీ పూర్తి చేశారు. రుణమాఫీ ప్రక్రియలో సాంకేతిక కారణాలు, బ్యాంక్‌ ఖాతాల్లో తేడాలు వంటి అంశాలతో కొంత మంది రైతులకు రుణమాఫీ అందలేదు. ఈ క్రమంలోనే మళ్లీ నాలుగో విడతలో 3357 మంది రైతులకు రూ.28.72 కోట్లు విడుదల చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 47,127 మంది రైతులకు రూ.374.87 కోట్లు రుణమాఫీ జరిగింది. ఇందులో మొదటి విడతలో 23,785 మంది రైతులకు రూ.135.35 కోట్లు, రెండో విడతలో 12,202 మంది రైతులకు రూ. 117.76 కోట్లు, మూడో విడతలో 7783 మంది రైతులకు రూ.93.04 కోట్లు రుణమాఫీ చేశారు. రూ.2 లక్షలకు పైగా రుణాలు తీసుకున్న వారికి రుణ మాఫీ వర్తింపజేయాలని వస్తున్న డిమాండ్‌ ముందుకొచ్చింది.

కూలీల కొరత

రైతులు కూలీల కొరతతో సతమతమవుతున్నారు. ఈ క్రమంలోనే వానాకాలం, యాసంగి సీజన్లలో ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కూలీలతో ఊరట లభించింది. ఈ సంవత్సరం కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి వెతుక్కుంటూ వరినాట్లకు కూలీలు వలస వస్తున్నారు. జిల్లాలోని గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్‌, వీర్నపల్లి, ఇల్లంతకుంట, బోయినపల్లి, వేములవాడ ప్రాంతాల్లో వలస కూలీలు వరినాట్లు వేస్తున్నారు. ఇక్కడి మధ్యవర్తులు కొందరు బీహార్‌, పశ్చిమ బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, జార్ఖండ్‌ రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకొచ్చారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలకు ఎకరానికి రూ.5500 నుంచి 6500 వరకు చెల్లిస్తున్నారు. స్థానికంగా ఉండే కూలీలకు కూడా డిమాండ్‌ ఏర్పడింది. గతంలో రూ. 300 నుంచి రూ.400 వరకు ఉండే కూలి ప్రస్తుతం రూ. 500 నుంచి రూ.600 వరకు చెల్లిస్తున్నారు. పురుషులకు రూ.700 నుంచి రూ.800 వరకు ఇస్తున్నారు.

Updated Date - Dec 27 , 2024 | 01:02 AM