Share News

‘బూడిద’పై అదనపు బాదుడు

ABN , Publish Date - Oct 23 , 2024 | 12:48 AM

జిల్లాలోని కుందనపల్లిలోగల ఎన్టీపీసీ యాష్‌ పాండ్‌ నుంచి తరలుతున్న బూడిదపై అదనపు బాదుడు మొదలెట్టారు. యాష్‌ పాండ్‌ వద్ద రెవెన్యూ అధికారులు టోల్‌ గేట్‌ ఏర్పాటు చేసి ఒక్కో లారీ లోడ్‌కు 500 రూపాయలు వసూలు చేస్తున్నారు. మున్నెన్నడూ లేని విధంగా ఈనెల 1వ తేదీ నుంచి డబ్బులు వసూలు చేస్తుండడంతో లారీల యజమానులు అవాక్కవుతున్నారు.

‘బూడిద’పై అదనపు బాదుడు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

జిల్లాలోని కుందనపల్లిలోగల ఎన్టీపీసీ యాష్‌ పాండ్‌ నుంచి తరలుతున్న బూడిదపై అదనపు బాదుడు మొదలెట్టారు. యాష్‌ పాండ్‌ వద్ద రెవెన్యూ అధికారులు టోల్‌ గేట్‌ ఏర్పాటు చేసి ఒక్కో లారీ లోడ్‌కు 500 రూపాయలు వసూలు చేస్తున్నారు. మున్నెన్నడూ లేని విధంగా ఈనెల 1వ తేదీ నుంచి డబ్బులు వసూలు చేస్తుండడంతో లారీల యజమానులు అవాక్కవుతున్నారు. ఈ డబ్బులు ఏ ప్రాతిపదికన వసూలు చేస్తున్నారు? ఎందుకు వసూలు చేస్తున్నారు? ప్రభుత్వ నిబంధనలను అనుసరించి వసూలు చేస్తున్నారా? అంటే సంబంధిత అధికారుల నుంచి సరైన సమాధానాలు రావడం లేదు. ఈ వసూళ్ల వ్యవహారం విమర్శలకు దారి తీస్తున్నది. రామగుండంలో ఎన్టీపీసీలో చేపడుతున్న విద్యుత్‌ ఉత్పత్తి వల్ల వెలువడే బూడిద కోసం కుందనపల్లి వద్ద యాష్‌ పాండ్‌ నిర్మించిన విషయం తెలిసిందే. గతంలో ఇందులోని బూడిదను ఎవరైనా తరలించుకు పోతామంటే ఉచితంగానే ఇచ్చేవాళ్లు. 2021 నుంచి టెండర్లు విధించి బూడిదను విక్రయించారు. ప్రస్తుతం ఎక్కడైతే జాతీయ రహదారులను నిర్మిస్తారో, వాటి కోసం బూడిదను ఉచితంగా అందజేస్తున్నారు. సింగరేణికి ఉచితంగానే అందజేస్తున్నారు. ఇటుక బట్టీలు, ఇతరత్రా అవసరాలకు తీసుక వెళ్లే బూడిదకు టన్నుకు 300 రూపాయలతో పాటు 5 శాతం జీఎస్టీ చెల్లిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో జరుగుతున్న జాతీయ రహదారుల నిర్మాణానికి గత 10 మాసాల నుంచి బూడిద తరలుతున్నది. అకస్మాత్తుగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈనెల 1వ తేదీ నుంచి యాష్‌ పాండ్‌ నుంచి బూడిద లారీలు బయటకు వెళ్లే మొఘల్‌ ఫహాడ్‌ వద్ద ఒక డబ్బాను ఏర్పాటు చేసి జాతీయ రహదారుల కోసం, ప్రైవేట్‌ అవసరాల కోసం బూడిదను తీసుకవెళుతున్న లారీల యజమానుల నుంచి అంతర్గాం తహసీల్దార్‌ కార్యాలయంలో పని చేసే సిబ్బంది ట్రిప్పునకు 500 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. అలాగే ముందస్తుగా చెక్కులు కూడా తీసుకుంటున్నారు. రామగుండం ఎస్‌బీఐ శాఖలో ‘తహసీల్దార్‌ అంతర్గాం’ పేరిట గల ఖాతా నంబర్‌ 62492086441కు ఒక లారీ ట్రాన్స్‌పోర్ట్‌ సంస్థ 2 లక్షల రూపాయలు జమ చేయడం గమనార్హం. టోల్‌ గేట్‌ వద్ద నగదు రూపేణా గాకుండా అంతర్గాం తహసీల్దార్‌ పేరిట ఉండే ఖాతాకు ఫోన్‌ పే ద్వారా తీసుకుంటున్నారు. కానీ ఎలాంటి రిసిప్టులు ఇవ్వడం లేదు. ఎవరన్నా టోల్‌ వద్ద ఆగకుండా వెళ్లే వాహనాల నంబర్లను నమోదు చేసుకుని పెద్దపల్లి ఆర్‌టీవో కార్యాలయం అధికారులకు సమాచారం ఇస్తున్నారని తెలుస్తున్నది.

ఫ గోప్యత పాటిస్తున్న అధికారులు..

కుందనపల్లిలోగల ఎన్టీపీసీ యాష్‌ పాండ్‌ నుంచి జాతీయ రహదారుల కోసం రోజుకు 150 నుంచి 200కు పైగా లారీలు వెళుతున్నాయి. ప్రైవేట్‌ అవసరాలకు ప్రస్తుతం 20 లారీల లోపే వెళుతున్నాయి. ప్రస్తుతం రోజుకు అదనపు బాదుడు రోజుకు 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఆదాయం సమకూరుతున్నది. వచ్చే నెలలో ఇటుక బట్టీల్లో ఇటుకల తయారీ ప్రారంభం కానుండడంతో బట్టీలకు పెద్దఎత్తున బూడిదను తరలించనున్నారు. మొత్తం రోజుకు 400 నుంచి 500కు పైగా ట్రిప్పుల లారీల బూడిద తరలే అవకాశం ఉంది. దీంతో మరింత ఆదాయ పెరగనున్నది. 5 శాతం జీఎస్టీతో కలుపుకుని టన్నుకు9 315 రూపాయలు ఎన్టీపీసీకి చెల్లిస్తున్నామని, అదనంగా 500 రూపాయల బాదుడు తమపై తీరని భారం పడుతున్నదని ఇటుక బట్టీల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి సింగరేణిలో తీసే బొగ్గుపై ఆ సంస్థ ప్రభుత్వానికి సీనరేజీ పన్ను చెల్లిస్తున్నది. ఆ బొగ్గుతోనే ఎన్టీపీసీ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నది. తద్వారా వెలువడే బూడిదకు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రైవేట్‌ అవసరాల కోసం ఎన్టీపీసీ డబ్బులు వసూలు చేస్తున్నది. లారీల యజమానుల నుంచి రెవెన్యూ అధికారులు ట్రిప్పుకు 500 రూపాయలు ఏ నిబంధనల ప్రకారం వసూలు చేస్తున్నారనే విషయం ఎవరికి అంతుచిక్కడం లేదు. కుందనపల్లి, దాని చుట్టూ పక్కల గ్రామాల అభివృద్ధి కోసం అనధికారికంగా వసూలు చేస్తున్నారా, మరే అవసరం కోసం ఏ నిబంధనల ప్రకారం ఈ డబ్బులు వసూలు చేస్తున్నారనే విషయం విమర్శలకు దారి తీస్తున్నది. దీనిపై అధికారులు ఎందుకు గోప్యత ప్రదర్శిస్తున్నారో అర్థం కావడం లేదని పలువురు అంటున్నారు. ఈ విషయమై అంతర్గాం తహసీల్దార్‌ ఉయ్యాల రమేష్‌ను ‘ఆంధ్రజ్యోతి’ ఫోన్‌లో సంప్రదించగా కుందనపల్లి యాష్‌ పాండ్‌ వద్ద బూడిద లారీల నుంచి డబ్బులు వసూలు చేయడం అంతా కలెక్టర్‌ కార్యాలయం నుంచే జరుగుతున్నదని, తమకేమి సంబంధం లేదని, పైవాళ్లు చెబితేనే అధికారిక ఖాతాకు జమ చేస్తున్నారు కావచ్చు అని వివరణ ఇచ్చారు. ఒక్కో లారీ ట్రిప్పునకు 500 రూపాయలు ఎందుకు వసూలు చేస్తున్నారో జిల్లా అధికార యంత్రాంగం స్పష్టత ఇవ్వాలని లారీలు, ఇటరు బట్టీల యజమానులు కోరుతున్నారు.

Updated Date - Oct 23 , 2024 | 12:48 AM