యాసంగికి రైతు భరోసా
ABN , Publish Date - Nov 30 , 2024 | 12:35 AM
జిల్లాలో వానాకాలం సాగు ముగిసింది. ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్నాయి. యాసంగి సాగుకు రైతులు సన్నద్ధం అవుతున్నారు. గత ప్రభుత్వం రైతు బంధు పేరిట పెట్టుబడి సాయం అందించింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పేరిట పెట్టుబడి సాయం అందజేస్తామని ప్రకటించింది. రైతు భరోసాపై స్పష్టత లేకపోవడంతోఏడాది గడిచినా అమల్లోకి రాలేదు.
- అన్నదాతల్లో ఆశలు
- ఎకరానికి రూ.7500 పంపిణీకి కసరత్తు
- అసెంబ్లీ సమావేశాల్లోగా స్పష్టత
- గతంలో 12 సార్లు పెట్టుబడి సాయం
- జిల్లాలో రైతుల అభిప్రాయాల సేకరణ
- 1.77 లక్షల ఎకరాల్లో యాసంగి సాగు అంచనా
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
జిల్లాలో వానాకాలం సాగు ముగిసింది. ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్నాయి. యాసంగి సాగుకు రైతులు సన్నద్ధం అవుతున్నారు. గత ప్రభుత్వం రైతు బంధు పేరిట పెట్టుబడి సాయం అందించింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పేరిట పెట్టుబడి సాయం అందజేస్తామని ప్రకటించింది. రైతు భరోసాపై స్పష్టత లేకపోవడంతోఏడాది గడిచినా అమల్లోకి రాలేదు. దీంతో ఈసారి యాసంగి నుంచి రైతు భరోసా కింద రెండు పంటలకు రూ.15 వేలు అందించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎకరానికి రూ.5 వేలు ఇవ్వగా రైతు భరోసాలో కాంగ్రెస్ ప్రభుత్వం యాసంగికి ఎకరానికి రూ .7500 అందించనున్నారు. ఇందుకు సంబంధించి జిల్లాలో జూలైలో 24 వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాల ద్వారా రైతుల నుంచి రైతు భరోసాపై అభిప్రాయాలు, సూచనలు, సలహాలను సేకరించారు. రైతు భరోసా ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి? సాగు చేసే భూములకు ఇవ్వాలా? అనే అంశాలపై ఆరా తీశారు. దీనికి అనుగుణంగానే సంక్రాంతి నుంచి రైతు భరోసాను అందించే విధంగా విధి విధానాలను ఖరారు చేయాలని నిర్ణయించారు. డిసెంబరు 2వ వారంలో నిర్వహించే శాసనసభ సమావేశాల్లో రైతు భరోసాపై స్పష్టత రానుంది. కౌలు రైతులకు సంబంధించి కూడా రూ.12 వేల చొప్పున సాయం అందించనున్నట్లు ప్రకటించారు. వీటిపై కూడా విధి విధానాలు వస్తాయని భావిస్తున్నారు.
గతంలో 12 సార్లు పెట్టుబడి సాయం
గత ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం కింద 2018 నుంచి రైతు బంధు పథకాన్ని అమలు చేసింది. మొదట ఎకరానికి రూ.4 వేల చొప్పున అందజేశారు. ఆ తరువాత రూ.5 వేలకు పెంచి రెండు పంటలకు రూ.10 వేల సాయం అందించారు. గతేడాది వరకు వానాకాలం, యాసంగి సీజన్‌లలో 1,29,407 మంది రైతులకు రూ.260.20 కోట్లు చెల్లించారు.
కౌలు రైతులకు ఊరట లభించేనా?
గత ప్రభుత్వం కౌలు రైతులను పట్టించుకోలేదనే విమర్శలు వచ్చాయి. కౌలు రైతులు వడ్డీలకు అప్పులు తెచ్చి కౌలుకు భూములు తీసుకొని వ్యవసాయం చేసి పకృతి వైపరీత్యాలతో నష్టపోయిన సంఘటనలు ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 260 గ్రామ పంచాయతీల పరిధిలో 80 వేల మంది కౌలు రైతులు ఉన్నారు. ఏటా కౌలు ధరలు కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో నీటి వసతి ఉన్న భూమి ఎకరానికి రూ.18 వేల నుంచి రూ.20 వేల వరకు కౌలు ధర పలుకుతోంది. ఈ పరిస్థితుల్లో రైతు భరోసాలో కౌలు రైతులకు కూడా ఊరట లభిస్తుందనే ఆశగా ఉన్నారు.
యాసంగిలో 1.77 లక్షల ఎకరాల్లో సాగు అంచనా...
రాజన్న సిరిసిల్ల జిల్లాలో యాసంగి సీజన్ నుంచి రైతు భరోసా అందించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుండడంతో రైతుల్లో ఆశలు మొదలయ్యాయి. జిల్లాలో యాసంగికి సంబంధించి 1.77 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనాలు వేసింది. ఇందులో వరి 1,74,311 ఎకరాలు, మొక్కజొన్న 1431 ఎకరాలు, నువ్వులు 362 ఎకరాలు, పొద్దు తిరుగుడు 810 ఎకరాలు, శెనగలు 178 ఎకరాలు, ఇతర పంటలు 317 ఎకరాలు సాగు చేస్తారని అంచనాలు వేశారు. యాసంగి సాగుకు 42,733 మెట్రిక్ టన్నులు ఎరువులు అవసరం అవుతాయని, అందులో యూరియా 21,811 మెట్రిక్ టన్నులు, డీఏపీ 3359 మెట్రిక్ టన్నులు, ఎంపీకేఎస్ 11,516 మెట్రిక్ టన్నులు, ఎంవోపీ 4607 మెట్రిక్ టన్నులు, ఎస్‌ఎస్‌పీ 1440మెట్రిక్ టన్నులు అవసరం అవుతాయని అంచనాలు వేశారు. సాగుకు వరి విత్తనాలు 18,500 క్వింటాళ్లు, మొక్కజొన్నకు 115 క్వింటాళ్లు, నువ్వులు 6 క్వింటాళ్లు, శెనగలు 18 క్వింటాళ్లు, ఇతర పంటలకు పది క్వింటాళ్ల విత్తనాలు అవసరం అవుతాయని అంచనాలు వేసి అందుకు అనుగుణంగా వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేసింది.