రైతులకు పెద్ద పీట..
ABN , Publish Date - Dec 07 , 2024 | 12:43 AM
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులకు పెద్దపీట వేస్తున్నది. రెండు లక్షల రుణ మాఫీ, రైతుబంధు, సన్న రకం వరి ధాన్యానికి బోనస్ ఇస్తున్నది. మహాలక్ష్మి, గృహజ్యోతి, రాజీవ్ ఆరోగ్యశ్రీ వంటి పథకాల ద్వారా కూడా ప్రజలకు లబ్ధి చేకూరుతున్నది.
- 60,619 మందికి రూ.455.5 కోట్ల రుణమాఫీ
- సన్నాలకు బోనస్ రూ.44 కోట్లు
- గృహజ్యోతితో రూ.53.7 కోట్లు
- మహాలక్ష్మి ఉచిత ప్రయాణంతో రూ. 57.93 కోట్లు
- ఏడాదిలో ప్రజలకు సుమారు రూ. 690 కోట్ల లబ్ధి
- కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులకు పెద్దపీట వేస్తున్నది. రెండు లక్షల రుణ మాఫీ, రైతుబంధు, సన్న రకం వరి ధాన్యానికి బోనస్ ఇస్తున్నది. మహాలక్ష్మి, గృహజ్యోతి, రాజీవ్ ఆరోగ్యశ్రీ వంటి పథకాల ద్వారా కూడా ప్రజలకు లబ్ధి చేకూరుతున్నది. గడిచిన ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలతో పాటు మరికొన్ని పథకాలను అమలుచేస్తామని హామీ ఇచ్చారు. ఆరు గ్యారంటీల్లో మహాలక్ష్మి, గృహలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్ల పథకం, చేయూత, రైతు భరోసా, యువ వికాసం వంటి పథకాలను అమలుచేస్తామన్నారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం, స్వయం సహాయక మహిళా సంఘాల మహిళలకు నెలకు రూ. 2500లు ఇవ్వడం, వంట గ్యాస్ రూ. 500కే ఇస్తామన్నారు. రైతు భరోసా పథకం ద్వారా రైతులు, కౌలు రైతులకు 15 వేలు, రైతు కూలీలకు రూ.12వేల రూపాయలు వరి ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా స్థలం ఉంటే 5 లక్షలు, ఎస్సీ, ఎస్టీలకు 6 లక్షలు ఇవ్వనున్నారు. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలంతో పాటు ఇల్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. గృహజ్యోతి పథకం కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు. చేయూత పథకం కింద దివ్యాంగులకు నెలకు రూ.6వేలు, ఇతరులకు రూ.4వేల పింఛన్ ఇస్తామని, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందిస్తామని ప్రకటించారు. యువ వికాసం కింద విద్యార్థులకు 5 లక్షల వరకు రుణాలు ఇస్తామని పేర్కొన్నారు. డిసెంబర్ 28 నుంచి జనవరి 8వ తేదీ వరకు నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో యువ వికాసం మినహా మిగతా 5 గ్యారంటీ పథకాలకు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి కంప్యూటర్లలో డేటా నమోదు చేశారు. ప్రజలు ఇచ్చిన దరఖాస్తుల్లో పేర్కొన్న అంశాలను బట్టి పలు గ్యారంటీ పథకాలను అమలు చేస్తున్నారు.
ఫ 9 నుంచి మహాలక్ష్మి, చేయూత అమలు..
గత ఏడాది డిసెంబరు 9వ తేదీ నుంచి మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభించింది. జిల్లాలోగల గోదావరిఖని డిపో బస్సుల్లో పథకం ప్రారంభం నుంచి నవంబర్ నెలాఖరు వరకు కోటి 49 లక్షల 57 వేల 200 టిక్కెట్లను అందించారు. తద్వారా మహిళలు 55 కోట్ల 32 లక్షల 45 వేల 21 రూపాయల వరకు లబ్ధి పొందారు. మంథని డిపోలో 54 లక్షల 28 వేల 919 టిక్కెట్ల ద్వారా మహిళలకు 2 కోట్ల 61 లక్షల 49 వేల 663 రూపాయలు, మొత్తం 2 కోట్ల 3 లక్షల 86 వేల 119 టిక్కెట్ల ద్వారా 57 కోట్ల 93 లక్షల 94 వేల 684 రూపాయల వరకు లబ్ధి చేకూరింది. అలాగే సబ్సిడీ గ్యాస్ పథకాన్ని ప్రభుత్వం ఫిబ్రవరి నెలాఖరు నుంచి అమల్లోకి తీసుకవచ్చారు. ఈ పథకం ద్వారా 1,15,849 గ్యాస్ కనెక్షన్లు గల వినియోగదారులకు 3,42,796 సిలిండర్లను అందించి కోటి 16 వేల 99 రూపాయల సబ్సిడీని రైతుల ఖాతాల్లో జమ చేశారు.
ఫ గృహజ్యోతి ద్వారా రూ. 53.7 కోట్ల లబ్ధి..
ఫిబ్రవరి నెలాఖరు నుంచి సబ్సిడీ గ్యాస్‌తో పాటు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ గృహలక్ష్మి పథకాన్ని అమల్లోకి తీసుకవచ్చారు. జిల్లాలో 2,14,00 గృహ సంబంధ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 1,29,000 కనెక్షన్లకు గృహజ్యోతి పథకం వర్తిస్తున్నది. పథకం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు 53 కోట్ల 70లక్షల సబ్సిడీని ప్రభుత్వం ఉచిత విద్యుత్ రూపేణా ప్రజలకు అందించింది.
రైతు రుణమాఫీ రూ. 455.5 కోట్లు..
రైతులు పొందిన పంట రుణాలను 2 లక్షల వరకు ఏకకాలంలో మాఫీ చేస్తామని ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు రెండో వారం నుంచి రుణమాఫీని అమలు ప్రారంభించారు. ఇప్పటివరకు నాలుగు విడతల్లో కలిపి 60,619 మంది రైతులకు 455 కోట్ల 50 లక్షల రూపాయలు మాఫీచేశారు. రైతు భరోసా పథకం కింద వానాకాలంలో సన్నాలు పండించే వారికి క్వింటాలుకు 500 బోనస్ ఇస్తామని చేసిన ప్రకటన మేరకు ఇప్పటివరకు 88,773 మెట్రిక్ టన్నుల ధాన్యానికి 12073 మంది రైతులకు సుమారు 46 కోట్ల రూపాయల బోనస్ సొమ్మును పౌరసరఫరాల శాఖ రైతుల ఖాతాల్లో జమ చేసింది. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నందున మరింత సబ్సిడీ సొమ్ము రైతులకు ఇవ్వనున్నారు. పాత రైతుబంధు పథకం ద్వారా యాసంగి పంటకు 1,21,555 మంది రైతులకు 72 కోట్ల రూపాయల వరకు జమ చేశారు. ఇంకా రైతుభరోసాను పూర్తిగా అమల్లోకి తీసుకరాలేదు. ఈ యాసంగి సీజన్ నుంచి రైతుభరోసా సంక్రాంతి పండుగ నుంచి అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తీసుకవచ్చిన పథకాల ద్వారా జిల్లా ప్రజలు 690 కోట్ల రూపాయల వరకు లబ్ధి పొందారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా జిల్లాలోని 3 నియోజకవర్గాలకు 3,500 చొప్పున ఇళ్లు మంజూరు చేశారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు గ్రామసభలను నిర్వహించనున్నారు. ఇంకా మిగతా పథకాలను అమల్లోకి తీసుకరావాల్సి ఉన్నది.