Share News

ఎట్టకేలకు ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం

ABN , Publish Date - Nov 13 , 2024 | 01:14 AM

ఎట్టకేలకు వరి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమై ఊపందుకుంటున్నాయి. వరి కోతలు మొదలై 40 రోజులు గడువడంతో ధాన్యం ఎప్పుడు కొనుగోలు చేస్తారో తెలియని పరిస్థితుల్లో చాలా మంది రైతులు ధాన్యాన్ని మద్దతు ధర రాకున్నా ప్రైవేట్‌ వ్యాపారులకు అమ్ముకున్నారు.

ఎట్టకేలకు ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

ఎట్టకేలకు వరి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమై ఊపందుకుంటున్నాయి. వరి కోతలు మొదలై 40 రోజులు గడువడంతో ధాన్యం ఎప్పుడు కొనుగోలు చేస్తారో తెలియని పరిస్థితుల్లో చాలా మంది రైతులు ధాన్యాన్ని మద్దతు ధర రాకున్నా ప్రైవేట్‌ వ్యాపారులకు అమ్ముకున్నారు. నవంబరు చివరి వరకు సుమారు 3.25 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని జిల్లా యంత్రాంగం అంచనా వేసింది. కొనుగోళ్ళు ఆలస్యంగా ప్రారంభం కావడంతో ఇప్పటి వరకు 44 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు. కొనుగోలు కేంద్రాల్లో, గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లు, కల్లాల్లో ఇంకా ఽపెద్ద ఎత్తున ధాన్యం కుప్పలు ఉన్నాయి. ఇప్పటికే సుమారు లక్ష టన్నుల వరకు రైతులు ప్రైవేట్‌ వ్యాపారులకు అమ్ముకొని లక్షలాది రూపాయలు నష్టపోయారని అంచనా వేస్తున్నారు.

ఫ 40 శాతానికిపైగా సన్నరకాల సాగు

జిల్లాలో వానాకాలం సీజన్‌లో 2.75,448 ఎకరాలలో వరిసాగు చేశారు. వీటిలో 1,56,948 ఎకరాలు దొడ్డు రకాలు కాగా, 1,18,500 ఎకరాల్లో సన్న రకాలను వేశారు. ప్రభుత్వం సన్నరకాల సాగును ప్రోత్సహించాలని నిర్ణయించి క్వింటాల్‌కు 500 రూపాయల బోనస్‌ ప్రకటించడంతో ఈ సీజన్‌లో 40శాతానికిపైగా సన్నరకాలను సాగు చేశారు. దొడ్డు రకాలకు చెందిన ధాన్యం దిగుబడి ఎకరాకు 2.092 టన్నులు, సన్నరకాలు 2.047 టన్నులు వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఈ మేరకు 3,28,335 మెట్రిక్‌ టన్నుల దొడ్డు ధాన్యం, 2,42,570 మెట్రిక్‌ టన్నుల సన్న రకం ధాన్యం దిగుబడిగా వచ్చే అవకాశం ఉంది. దొడ్డు రకం ధాన్యం మొత్తం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయిస్తారు. సన్నరకాల్లో 55,374 మెట్రిక్‌ టన్నులు రైతులు విత్తన అవసరాల కోసం, 75,471 టన్నులు స్థానిక అవసరాల కోసం ఉంచుకొని 1,11,725 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తారని అధికారులు అంచనా వేశారు. జిల్లాలో రైతులు సన్న, దొడ్డు రకం కలిపి 4,14,282 మెట్రిక్‌ టన్నుల ధాన్యం విక్రయించే అవకాశముంది. అధికారులు జిల్లాలో 340 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. వీటిలో 291 కేంద్రాలు కొనుగోళ్లను ప్రారంభించాయి. ఏ-గ్రేడ్‌ ధాన్యానికి క్వింటాల్‌కు 2,320, కామన్‌ రకానికి 2,300 రూపాయలు మద్దతు ధరగా ప్రభుత్వం ప్రకటించింది. ఏ-గ్రేడ్‌ ధాన్యంగా కొనుగోలు చేసే సన్నరకం వరి ధాన్యానికి 2320 రూపాయలతోపాటు 500 రూపాయల బోనస్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని నిర్ణయించింది.

ఫ కొనుగోళ్లలో జాప్యంతో ప్రైవేట్‌ వ్యాపారులకు అమ్మకం

కస్టమ్‌ మిల్లింగ్‌ ధర పెంచడం, ధాన్యం కేటాయించడానికి మిల్లర్లు బ్యాంకు గ్యారంటీ, సెక్యూరిటీ డిపాజిట్‌ చెల్లించడం అంశాలపై ప్రభుత్వానికి మిల్లర్లకు మధ్య అవగాహన కుదరని కారణంగా 40 రోజుల క్రితమే వరి కోతలు ప్రారంభమై ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తున్నా వాటిని కొనే వారే లేకుండా పోయారు. వర్షం భయం, ఎప్పుడు ధాన్యం కొనుగోలు చేస్తారో స్పష్టత రాకపోవడంతో 1,800 నుంచి 1,950 రూపాయల వరకు క్వింటాల్‌ ధాన్యాన్ని రైతులు ప్రైవేట్‌గా అమ్ముకున్నారు. అక్టోబరులో దిగుబడిలో 23 శాతం ధాన్యం 91,894 మెట్రిక్‌ టన్నులు, నవంబర్‌లో 58 శాతం 2,34,029 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకువస్తారని అధికారులు అంచనా వేశారు.

ఫ డబ్బుల చెల్లింపులో ఆలస్యం

రెండు, మూడు రోజుల క్రితమే కొనుగోళ్లు ప్రారంభం కావడంతో కొనుగోలు కేంద్రాల్లో ఈనెల 12వ తేదీ వరకు 43,934 మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యాన్ని మాత్రమే కొన్నారు. 6,529 మంది రైతులకు చెందిన ఈ ధాన్యం విలువ 101.93 కోట్ల రూపాయలు. కొనుగోలు చేసిన ధాన్యంలో ఇప్పటి వరకు కేవలం 210 మంది రైతులకు చెందిన 1,414 మెట్రిక్‌ టన్నుల ధాన్యానికి సంబంధించిన 3.28 కోట్లు మాత్రమే సివిల్‌ సప్లయిస్‌ శాఖ చెల్లించింది. 43,934 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొ నుగోలు చేసినా 12,583 మెట్రిక్‌ టన్నుల ధాన్యానికి సంబంధించిన వివరాలను మాత్రమే ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయగలిగారు. వీటిలోనూ 2,675 మెట్రిక్‌ టన్నుల ధాన్యానికి ట్రక్‌ చిట్‌ జనరేట్‌ చేశారు. 1,548 మెట్రిక్‌ టన్నుల ధాన్యం మాత్రమే తమ మిల్లులకు చేరినట్లు ఇప్పటి వరకు మిల్లర్లు కన్‌ఫర్మ్‌ చేశారు. దీనిలోనుంచే 1,414 మెట్రిక్‌ టన్నుల ధాన్యానికి సివిల్‌ సప్లయిస్‌ శాఖ 3.28 కోట్లు చెల్లించింది. రైతుల వద్ద ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన 98.65 కోట్ల రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉన్నది. రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే డబ్బు చెల్లిస్తామని పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పదేపదే చెబుతున్నా ఆచరణలో అది నెరవేరడం లేదు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి, 24 గంటల్లో తమ ఖాతాల్లో డబ్బు జమచేసేలా చూడాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Nov 13 , 2024 | 01:14 AM