పరిపాలనపై దృష్టి సారించండి
ABN , Publish Date - Nov 13 , 2024 | 12:28 AM
పగ, ప్రతీకారాలు మాని పరిపాలనపై దృష్టి సారించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. మంగళవారం వేములవాడలో రాజ రాజేశ్వరస్వామిని దర్శింకున్న అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
వేములవాడ, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి) : పగ, ప్రతీకారాలు మాని పరిపాలనపై దృష్టి సారించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. మంగళవారం వేములవాడలో రాజ రాజేశ్వరస్వామిని దర్శింకున్న అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం కలుగజేయాలని వేములవాడ రాజరాజేశ్వరస్వామిని కోరుకున్నానని అన్నారు. రైతు రుణమాఫీ చేస్తామని వేములవాడ రాజన్న మీద ఒట్టు పెట్టి హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారన్నారు. తెలంగాణ ప్రజల ఇలవేల్పు పైన ఒట్టు పెట్టి మాట తప్పిన ఘనత ఒక రేవంత్ రెడ్డికే దక్కిందన్నారు. ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని, తప్పనిసరి పరిస్థితులలో ధాన్యాన్ని ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారని అన్నారు. పాలన చేతగాని పరిపాలకులు బోనస్ ఇస్తామని నమ్మించారని, కనీసం సన్నాలకైనా బోనస్ ఇచ్చే పరిస్థితి లేదని అన్నారు. ఇక్కడి రైతులకు ఒక రూపాయి బోనస్ ఇవ్వకుండానే మహారాష్ట్ర వెళ్లి తాము బోనస్ ఇస్తున్నామని తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారన్నారు. దేవుళ్లపై ఒట్టు పెట్టి రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఆగస్టు 15 నాటికి కూడా రుణమాఫీ చేయలేదని, దేవుళ్లపై ఒట్టు పెట్టిన వారిలో రేవంత్ రెడ్డి మొదటి వాడని, కనీసం రైతులకైనా న్యాయం జరగాలని వేములాడ రాజన్నను వేడుకున్నానని హరీష్ రావు అన్నారు. 2 లక్షల రూపాయలకుపైగా రుణం ఉన్న రైతులు మిగతా సొమ్ము కట్టాలని నిబంధన ఎందుకు పెట్టారని పశ్నించారు. అనేక నిబంధనలు, కుంటి సాకుల మధ్య రుణమాఫీ పాక్షికంగా మాత్రమే చేశారని, బేషరతుగా రెండు లక్షల రూపాయలపైన ఉన్నవారికి సైతం రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ రాజన్న దగ్గరికి వచ్చి తప్పయ్యిందని వేడుకోవాల న్నారు. కేసీఆర్ గురించి మాట్లాడే నైతిక అర్హత రేవంత్ రెడ్డికి లేదని, గత 11 నెలల్లో తెలంగాణ ఏం కోల్పోయిందో చర్చించడానికి తాను సిద్ధమని అన్నారు. అనేక రంగాల్లో తెలంగాణలో అభివృద్ధి కుంటు పడిపోయిందని, రోజూ ఎక్కడో ఒక చోట విద్యార్థులు ధర్నాలు చేస్తున్నారని అన్నారు. రైతు బంధు, కేసీఆర్ కిట్టు, బతుకమ్మ చీరలు అందడం లేదని, చివ రకు పోలీసుల కుటుంబాలు సైతం రోడ్లపైకి వచ్చాయన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో నేతన్నల ఆత్మహత్యలు పెరిగాయని, పాలమురు ప్రాజెక్టు ఆగిపోయిందని, దళిత బంధు, బీసీ బంధు కోల్పోయారని, ఉద్యోగులు రిటర్మెంట్ బోనస్ కోల్పోయారని, జర్నలిస్ట్‌లు హక్కులు కోల్పోయారని అన్నారు. అన్నింటిలో నంబర్ 1గా ఉన్న తెలంగాణ 11 నెలల కాలంలో అన్నింటినీ కోల్పోయిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి కైనా పగాప్రతీకారాలు మర్చిపోయి సీనియర్ల సలహాలు తీసుకొని పరిపాలనపై దృష్టి పెట్టా లని సూచించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ వంద ఏళ్ల ముందుకు తీసుకెళ్తే రేవంత్ రెడ్డి నాలుగు రాళ్లు వేసుకొని వెళ్తా అనుకుంటూ రాష్ట్రాన్ని వెనక్కి తీసుకుపోతున్నాడని విమ ర్శించారు. ఈ సమావేశంలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ ఎల్.రమణ, వేములవాడ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, జడ్పీ మాజీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ, మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్, బీఆర్‌ఎస్ నేతలు నారదాసు లక్ష్మణ్ రావు, ఏనుగు మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.
రాజన్నను దర్శించుకున్న హరీష్‌రావు
వేములవాడ కల్చరల్ : వేములవాడ రాజరాజేశ్వర స్వామిని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు మంగళవారం దర్శించుకున్నారు. బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్ చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారావు ఆలయ ఈవో వినోద్‌రెడ్డి, అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ అద్దాల మండపంలో అర్చకులు ఆశీర్వచనం, ఆలయ ఈవో వినోద్‌రెడ్డి రాజన్న ప్రసాదాన్ని అందజేశారు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఏనుగు మనోహర్‌రెడ్డి, మాజీ జడ్పీ చైర్ పర్సన్‌లు తుల ఉమ, న్యాలకొండ అరుణ బీఆర్‌ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.