జనారణ్యంలోకి అటవీజంతువులు
ABN , Publish Date - Nov 21 , 2024 | 01:38 AM
గ్రామీణ ప్రాంతాల్లో రైతులు పంట పొలాలకు వెళ్లాలంటే ఎక్కడ అటవి జంతువులు దాడి చేస్తాయోనని వణికిపోతున్నారు. మరో వైపున వ్యవసాయ పంటపొలాల వద్ద పశువులపై, చేతికి అందివచ్చిన పంటలపై అటవీ జంతువులు దాడి చేసి హతమార్చటం, గాయపరచటం, నష్టపరచటంతో రైౖతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.
- ఎలుగుబంటి, చిరుత, హైనాల సంచారం
- పంటలను నాశనం చేస్తున్న కోతులు, అడవిపందులు
- రైతులు, పశువులకు ప్రాణసంకటం
కరీంనగర్ క్రైం, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో రైతులు పంట పొలాలకు వెళ్లాలంటే ఎక్కడ అటవి జంతువులు దాడి చేస్తాయోనని వణికిపోతున్నారు. మరో వైపున వ్యవసాయ పంటపొలాల వద్ద పశువులపై, చేతికి అందివచ్చిన పంటలపై అటవీ జంతువులు దాడి చేసి హతమార్చటం, గాయపరచటం, నష్టపరచటంతో రైౖతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. జిల్లా వ్యాప్తంగా ఇటీవల చోటుచేసుకున్న వరుస సంఘటనలతో జనాలు బెంబేలెత్తుతున్నారు. రెండు రోజుల కిందట సైదాపూర్ మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన బాసవేన కుమార్‌కు చెందిన ఆవుపై హైనా దాడి చేయటంతో మెడ, ముందుకాలు భాగంలో తీవ్రగాయాలయ్యాయి. అలాగే చిగురుమామిడి మండలం సుందరగిరిలో హైనా దాడిలో వెంకటస్వామికి చెందిన లేగదూడ మృతి చెందింది. వారం రోజుల కిందట గన్నేరువరం మండలం చాకనివానిపల్లిలో ఒక ఎలుగబంటి సంచరించగా గ్రామస్థులు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఖాసీంపేట, గన్నేరువరం, బేగంపేట తదితర ప్రాంతాల్లో కొన్ని రోజులుగా రాత్రి వేళల్లో ఒక ఎలుగబంటి తిరుగుతున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. జిల్లాలోని కొత్తపల్లి, మానకొండూర్, గన్నేరువరం, తిమ్మాపూర్, చొప్పదండి, సైదాపూర్, శంకరపట్నం మండల పరిధిలోని గుట్టల ప్రాంత పంటపొలాల్లో ఎలుగుబంట్లు, అడవి పందులు, కోతుల బెడద తీవ్రంగా ఉంది. సైదాపూర్, చిగురుమామిడి, మానకొండూర్ ప్రాంతాల్లో హైనాలు తరచుగా పశువులపై దాడి చేసి చంపటం, గాయపరచటంవంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అటవీ ప్రాంతాల్లో, గుట్టల్లో నివాసం ఏర్పరచుకుని జీవించే బల్లూకం(గుడ్డేలుగు), హైనా, అడవి పందులు, కోతులులు వాటి స్థావరాలను చెదరగొట్టడం మూలంగానే ఆగ్రహానికి గురైన సందర్భంలో జనావాసాల్లోకి ప్రవేశించి ప్రజల భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. అటవీ జంతువుల భారి నుంచి రైతులను, ప్రజలను కాపాడాల్సిన అటవీ శాఖ అధికారులు చేతులెత్తేయటంతో దిక్కుతోచని స్థితి నెలకొంది. గుట్టల సమీపంలోని వ్యవసాయ క్షేత్రాల్లో ఎలుగుబంట్లు వీరవిహారం చేస్తున్నాయి. ఈ ప్రాంతాల్లోని గ్రామాల్లో రైతులు ఎలుగుబంట్లు, అడవి పందులు, కోతుల భయంతో రాత్రివేళ, పగటి వేళ కూడా ఒంటరిగా వ్యవసాయబావుల వద్దకు వెళ్లడం మానుకున్నారు. జిల్లాలో వరుసగా జరుగుతున్న ఎలుగుబంటి దాడుల సంఘటనలతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా గుట్టల సమీపంలోని గ్రామాల ప్రజలు ఎలుగుబంటి గుర్తుకు వస్తే నిద్రలో కూడా ఉలిక్కిపడుతున్నారు. ఈ ప్రాంత ప్రజలు క్షణక్షణం ఉత్కంఠగా గడుపుతున్నారు.
ఫ పేలుళ్లతో జనావాసాలలోకి..
అటవీ, గుట్ట ప్రాంతాలలో ఏర్పరచుకున్న స్థావరాలలో గ్రానైట్, క్రషర్ క్వారీల కోసం నిత్యం పేలుళ్లు జరపడంతో అటవీ జంతువులు గ్రామాల్లోకి వస్తున్నాయి. పంట పొలాల్లో మొక్కజొన్న కంకులు, పల్లికాయ, అనపకాయ, పెసర, పత్తి కాయలను ఆహారంగా తీసుకుంటూ రైతులకు పంటనష్టం చేస్తున్నాయి. రైతులు, పశువులు, పంటలపై విరుచుకుపడి భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. అడవి పందులు, ఇతర అటవీజంతువులు జనావాసాల్లోకి రావడానికి ప్రధానకారణం క్వారీల్లో పేలుళ్లేనని అటవీశాఖ అధికారులు గతంలో జిల్లా కలెక్టర్‌కు ఒక నివేదికను కూడా సమర్పించారు. అయితే ఆ నివేదిక బుట్టదాఖలైందే తప్ప ఎలాంటి నియంత్రణ చర్యలు తీసుకోవడానికి ఉపయోగపడలేదు.
ఫ అటవీశాఖ రక్షణ చర్యలు శూన్యం
అటవీ ప్రాంతం నుంచి దారితప్పి గ్రామాలలో అలజడి సృష్టిస్తున్న అటవీ జంతువులను బంధించి తిరిగి అడవికి పంపించేందుకు స్థానిక అటవీశాఖ వద్ద ఎలాంటి రక్షణ పరికరాలు అందుబాటులో లేవు. కేవలం కొన్ని వలలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో భల్లూకాలు, చిరుతలు గ్రామాలపైపడి భయబ్రాంతులకు గురి చేస్తున్నా ఏమీ చేయలేని స్థితిలో అటవీశాఖ అధికారులు చేతులెత్తేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిలో హైదరాబాద్ నుంచి రెస్క్యూటీం రావడానికి చాలా సమయం పట్టడంతో జనావాసాలకు వచ్చిన అడవి జంతువులను సురక్షితంగా బంధించే ప్రక్రియకు సజావుగా జరగడం లేదని ప్రజలు పేర్కొంటున్నారు.
ఫ పంటనష్టానికి పరిహారం చెల్లిస్తాం
- కరీంనగర్ ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ షౌకత్‌హుస్సేన్
హైనాలు, ఎలుగుబంట్లు, అడవిపందులు, కోతుల బెడద నుంచి రైతులకు, పంటలకు, పశువులకు నష్టం వాటిల్లిన సందర్భంలో అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తే సర్వే జరిపి ప్రభుత్వం నుంచి తగిన పరిహారం అందిస్తాం. అటవీ జంతువులను ఎట్టిపరిస్థితుల్లో హతమార్చరాదు. అటవీ జంతువులను నిర్బంధించటం, హతమార్చటంపై కఠిన చర్యలుంటాయి. పశువులను రాత్రి సమయాల్లో పంటపొలాల వద్ద కాకుండా ఇంటి వద్దనే ఉంచాలి. అటవీ జంతువులు బెడద ఉన్న ప్రాంతాల్లోని రైతులు ఒంటరిగా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏవైనా అటవీ జంతువులు సంచరిస్తే వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించాలి