వైభవంగా లక్ష్మీనరసింహస్వామి కల్యాణం
ABN , Publish Date - Nov 15 , 2024 | 12:40 AM
రుద్రంగి మండల కేంద్రంలోని ప్రహ్లాద పర్వతంపై వెలిసిన లక్ష్మీనరసింహ స్వామి వారి కల్యాణోత్సవం గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం నుంచే ఆలయ పరిసరాలు కోలాహలంగా మారాయి.
- పట్టు వస్త్రాలు సమర్పించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
రుద్రంగి, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): రుద్రంగి మండల కేంద్రంలోని ప్రహ్లాద పర్వతంపై వెలిసిన లక్ష్మీనరసింహ స్వామి వారి కల్యాణోత్సవం గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం నుంచే ఆలయ పరిసరాలు కోలాహలంగా మారాయి. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్-వనజ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించగా ఆలయ కమిటీ చైర్మన్ కొమురె మంజుల, శంకర్ దంపతులు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ప్రధానార్చకులు శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో ఉత్సవమూర్తుల విగ్రహాలను ఉంచి స్వామివారి కల్యాణం ఘనంగా నిర్వహించారు. రుద్రంగి గ్రామంతో పాటు చుట్టు పక్కల గ్రామాల నుంచి భక్తులు, మహిళలు పెద్దఎత్తున తరలివచ్చి స్వామివారి కల్యాణోత్సవాన్ని తిలకించారు. భక్తులు స్వామివారికి కట్న కానుకలు, ఓడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం, మాజీ జడ్పీటీసీ గట్ల మీనయ్య, మాజీ సర్పంచ్ తర్రే ప్రభలత మనోహర్, ఎర్రం గంగ నర్సయ్య, గడ్డం శ్రీనివాస్‌రెడ్డి, చెలకల తిరుపతి, సామ మోహన్‌రెడ్డి, కేసిరెడ్డి నర్సారెడ్డి, గ్రామస్థులు పాల్గొన్నారు. కాగా ప్రహ్లాద పర్వతంపై వెలసిన లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి ఆలయ చరిత్రలోనే తొలిసారిగా ప్రభుత్వ లాంఛనాలతో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు.