ఆసక్తి చూపని పట్టభద్రులు
ABN , Publish Date - Nov 08 , 2024 | 01:08 AM
ఓటు హక్కు కోసం పేర్లు నమోదు చేసుకోవడంలో, ఆ హక్కును వినియోగించుకోవడంలో చదువుకున్న వారికంటే గ్రామీణ ప్రాంత సాధారణ పౌరులే మిన్న అని మరోసారి రుజువైంది.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
ఓటు హక్కు కోసం పేర్లు నమోదు చేసుకోవడంలో, ఆ హక్కును వినియోగించుకోవడంలో చదువుకున్న వారికంటే గ్రామీణ ప్రాంత సాధారణ పౌరులే మిన్న అని మరోసారి రుజువైంది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చే మార్చినెలలో జరుగనున్నాయి. ఓటర్ల నమోదు కోసం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబరు 30 నుంచి నవంబర్ 6వ రకు ఈనాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలోని పట్టభద్రులను ఓటు హక్కు కోసం దరఖాస్తులు చేసుకోవాలని ఎన్నికల కమిషన్ కోరింది. ఈ పరిధిలో 10 లక్షలకుపైగా పట్టభద్రులు ఉంటారని అంచనా వేశారు. రాజకీయంగా అత్యధిక చైతన్యం ఉన్న ఈ జిల్లాల్లో పట్టభద్రులు పెద్ద ఎత్తున ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకుంటారని, ఈసారి ఈ స్థానానికి హోరాహోరీ పోటీ ఉంటుందని అందరూ భావించారు.
అవగాహన కల్పించినా..
ఎన్నికల కమిషన్ ఓటు హక్కు నమోదు కోసం షెడ్యూల్ విడుదల చేయక ముందు రెండు నెలల నుంచే పోటీ చేయాలని భావిస్తున్న వారు నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా పర్యటించి సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి పట్టభద్రులను కలిశారు. స్వయంగా ఆశావహులే ఓటర్ల నమోదు పత్రాలతో ఊరూరా దరఖాస్తుల సేకరణ స్వయంగా చేపట్టారు. మిస్‌కాల్ ఇస్తే చాలు.. మీ ఇంటికే మా సిబ్బంది వచ్చి దరఖాస్తు ఫారంతోపాటు అవసరమైన డాక్యుమెంట్లను సేకరించి ఓటరుగా నమోదు చేపిస్తారని సోషల్ మీడియాలో, హోర్డింగ్‌లతో విస్తృతంగా ప్రచారం చేశారు. మండల స్థాయిలో కొంత మంది సిబ్బందిని ఏర్పాటు చేసి దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ ద్వారా పంపించే ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ఈసారి పట్టభద్రులు లక్షల్లో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకుంటారని ఆశించారు. అది వట్టిదేనని తేలిపోయింది.
కొనసాగుతున్న పరిశీలన
గడువు ముగిసే వరకు 3,58,419 మంది పట్టభద్రుల దరఖాస్తులు మాత్రమే ఓటు హక్కు నమోదు కోసం అధికారులకు అందాయి. నియోజకవర్గ పరిధిలోని 15 కొత్త జిల్లాలోని 271 మండలాల నుంచి 3,58,419 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 3,55,496 దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా, 2,923 దరఖాస్తులను ఆఫ్‌లైన్‌లో నేరుగా సేకరించారు. ఇప్పటి వరకు దరఖాస్తుల పరిశీలన చేసిన వరకు 1,50,092 ఆన్‌లైన్ దరఖాస్తులను, 689 ఆఫ్‌లైన్ దరఖాస్తులను ఓటు హక్కు పొందేందుకు అర్హతకలిగిన వారుగా గుర్తించి ఆమోదించారు. 14,922 దరఖాస్తులను తిరస్కరించారు. ఇంకా 1,92,716 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. ప్రస్తుతం 53.77 శాతం దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ మేరకు పరిశీలనలో మరో 15 వేల వరకు దరఖాస్తులు తిరస్కరణకు గురైనా మూడు లక్షల 30వేల వరకు ఓటు హక్కు పొందే అవకాశమున్నది. అధికారులకు అందిన ఈ దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించిన తర్వాత ఈనెల 23న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. ఈ జాబితాపై అభ్యంతరాలు ఉంటే తెలియజేసేందుకు నవంబరు 23 నుంచి డిసెంబరు 9వరకు అవకాశం కల్పిస్తారు. డిసెంబరు 30న ఈ పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల తుది జాబితాను ఎన్నికల కమిషన్ ప్రకటిస్తుంది. ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరించే సమయంలో కూడా ఓటర్ల నమోదుకు అవకాశం కల్పిస్తారు.
ఓటరు ఐడీ లేకపోవడం.. నిరాసక్తత కారణమే:
ఆధార్‌కార్డుతోపాటు ఓటరు ఐడీ కార్డు ఉంటేనే పట్టభద్రుల ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి వీలు ఉంది. ఎన్నికల కమిషన్ విధించిన ఈ నిబంధన ఓటర్ల నమోదుకు ప్రతిబంధకంగా మారింది. సాధారణ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి 14 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపిస్తే సరిపోయేది. పట్టభద్రుల ఓటర్ల నమోదు కోసం మాత్రం ఆధార్‌తోపాటు ఓటర్ గుర్తింపు కార్డు తప్పనిసరి చేశారు. ఆధార్‌కార్డు అందరి వద్ద ఉన్నా ఓటరు ఐడీ కార్డు తీసుకోకపోవడంతో కొంత మంది ఓటరుగా నమోదు చేసుకోలేక పోయినట్లు చెబుతున్నారు. అన్నింటికి మించి ఓటు వేయడానికి, ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి విద్యావంతుల్లో రోజురోజుకు పెరుగుతున్న నిరాసక్తత కూడా మరో కారణంగా పేర్కొంటున్నారు.
గడువు పెంచాలని డిమాండ్
పట్టభద్రుల ఎమ్మెల్సీ, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటరు నమోదు గడువును పెంచాలని పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులతోపాటు పట్టభద్రులు, టీచర్లు కోరుతున్నారు. ఓటరు నమోదుకు 36 రోజుల గడువు మాత్రమే ఇచ్చారని, మరికొంత సమయం ఇవ్వాలని ఎన్నికల కమిషన్‌ను విజ్ఞప్తి చేశారు. ప్రతిసారి ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు ఓటరు నమోదు చేయాలనే నిబంధనలను తొలగించి సాధారణ ఎన్నికల మాదిరిగా ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులకు అవకాశంకల్పిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.