Share News

పెద్దపల్లి జిల్లాకు నాలుగు పోలీస్‌స్టేషన్ల మంజూరు

ABN , Publish Date - Dec 03 , 2024 | 01:02 AM

ఎప్పటి నుంచో ప్రతిపాదనల్లో ఉన్న ఎలిగేడు, పెద్దపల్లి రూరల్‌, పెద్దపల్లి ట్రాఫిక్‌, పెద్దపల్లి మహిళా పోలీస్‌ స్టేషన్లను మంజూరు చేస్తూ సోమవారం రాష్ట్ర హోంశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరి రవి గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.

పెద్దపల్లి జిల్లాకు నాలుగు పోలీస్‌స్టేషన్ల మంజూరు

- 23 ఏళ్ల తర్వాత ఎలిగేడులో స్టేషన్‌

- పెద్దపల్లి రూరల్‌, ట్రాఫిక్‌, మహిళా పోలీస్‌ స్టేషన్ల ఏర్పాటు

- ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర హోంశాఖ

పెద్దపల్లిటౌన్‌, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఎప్పటి నుంచో ప్రతిపాదనల్లో ఉన్న ఎలిగేడు, పెద్దపల్లి రూరల్‌, పెద్దపల్లి ట్రాఫిక్‌, పెద్దపల్లి మహిళా పోలీస్‌ స్టేషన్లను మంజూరు చేస్తూ సోమవారం రాష్ట్ర హోంశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరి రవి గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జిల్లాలో పోలీస్‌ స్టేషన్ల సంఖ్య 22కు పెరగనున్నది. పెద్దపల్లి జిల్లా కేంద్రం అయిన తర్వాత ఇక్కడ పెద్దపల్లి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌తో పాటు, ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌, మహిళా పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయాలని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రం అయినప్పటికీ పెద్దపల్లి పోలీస్‌స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌గా ఇప్పటికీ ఎస్సై వ్యవహరిస్తున్నారు. కొత్తగా పెద్దపల్లి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు చేయడంతో పెద్దపల్లికి మరొక సీఐ పోస్ట్‌ పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే బసంత్‌నగర్‌ పోలీస్టేషన్‌ పరిధిలో కొనసాగుతున్న రాఘావాపూర్‌, రంగాపూర్‌, సబ్బితం కుర్మపల్లి, రాగినేడు, బ్రాహ్మణపల్లి, అప్పన్నపేట, బొంపెల్లి తదితర గ్రామాలు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోకి రానున్నాయి. వీటితో పాటు మండల పరిధిలో ఉన్న గ్రామాలు ఇదే స్టేషన్‌ పరిధిలో ఉండనున్నాయి. పెద్దపల్లి టౌన్‌ పోలీస్‌ స్టేషనుకు స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌గా మరొక సీఐ పోస్టును కేటాయించి, పెద్దపల్లి రూరల్‌, జూలపల్లి, ధర్మా రం, బసంత్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్లకు కలిపి రూరల్‌ సీఐని కేటా యించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు పెద్దపల్లిలో రామగుండం ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ నుంచి ఒక సీఐ, ఒక ఎస్సై తోపాటు ఏఎస్‌ఐ, హెడ్‌ కానిస్టేబుల్‌, పలువురు కానిస్టేబుల్‌తో పెద్దపల్లిలో తాత్కాలికంగా ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ను నిర్వహిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ మంజూరు చేయడంతో పాటు సీఐ పోస్టును కూడా మంజూరు చేశారు. జిల్లాలోని మహిళా కేసులన్నీ నూతనంగా ఏర్పడే మహిళా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోకి వస్తాయి.

2001 జూన్‌లో జూలపల్లి మండలం నుంచి ఎలిగేడు మండలాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ఎంపీడీవో కార్యాలయంతో పాటు, తహసీల్దార్‌, వ్యవసాయ శాఖ, తదితర శాఖల కార్యాలయాలను ఏర్పాటు చేసినప్పటికీ, పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయలేదు. జూలపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోనే ఎలిగేడు మండలం కొనసాగుతున్నది. ఇక్కడ పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు చేయాలని ప్రజాప్రతినిధులు పలుసార్లు ఆయా ప్రభుత్వాలకు నివేదించినప్పటికీ మంజూరు కాలేదు.

- నెరవేరనున్న కల..

2016 అక్టోబరులో పెద్దపల్లి జిల్లా ఏర్పాటు కాగా, పాలకుర్తి, అంతర్గాం, రామగిరి మండలాలను ఏర్పాటు చేశారు. ఆ సమయంలో రామగిరి, అంతర్గాం మండలాలకు కొత్త పోలీస్‌ స్టేషన్లను మంజూరు చేశారు. అలాగే పాలకుర్తి మండల పరిధిలో అప్పటికే బసంత్‌ నగర్‌ పోలీస్‌స్టేషన్‌ ఉండడంతో దాన్ని ఆ మండల పరిధి కింద కొనసాగిస్తున్నారు. ఇదే సమయంలో ఎలిగేడు మండలానికి పోలీస్‌స్టేషన్‌ మంజూరు అవుతుందని అంతా ఆశించారు. కానీ గత ప్రభుత్వం మంజూరు చేయలేదు. ఎమ్మెల్యే విజయరమణారావు చేసిన ప్రతిపాదన మేరకు ఎట్టకేలకు 23 ఏళ్ల తర్వాత ఎలిగేడు మండలానికి పోలీస్‌స్టేషన్‌ మంజూరు అయ్యింది. దీంతో తమ కల సాకారం అయిందని మండల వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Dec 03 , 2024 | 01:02 AM