వడగళ్ల వర్షం.. తడిసిన ధాన్యం
ABN , Publish Date - May 08 , 2024 | 01:15 AM
ఎండలతో జిల్లా ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. 44 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలతో ఇంట్లో నుంచి బయటకు రావడానికే ఇబ్బందులు పడ్డారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి వాతావరణం చల్లబడి ఉరుములు, మెరుపులతో వడగళ్ల వర్షం కురిసింది.
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
ఎండలతో జిల్లా ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. 44 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలతో ఇంట్లో నుంచి బయటకు రావడానికే ఇబ్బందులు పడ్డారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి వాతావరణం చల్లబడి ఉరుములు, మెరుపులతో వడగళ్ల వర్షం కురిసింది. 44 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నుంచి 23.7 డిగ్రీలకు పడిపోయింది. వాతావరణం చల్లబడడంతో ఉపశమనం కలిగినా కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడ్డారు. సిరిసిల్లలో 12.5 మిల్లీమీటర్లు, వేములవాడ 6.3 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. సిరిసిల్లతోపాటు జిల్లాలోని మండలాల్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. భారీ గాలులకు పలు చోట ఇళ్ల పైకప్పులు దెబ్బతిన్నాయి. వేములవాడ మండలం నాంపల్లిలో రేగుల శేఖర్‌కు చెందిన ఇంటి పైకప్పు పూర్తిగా కొట్టుకుపోయింది. కోనరావుపేట మండలం మరిమడ్లలో తిరుపతి అనే రైతుకు చెందిన పాడిగేదే పిడుగుపాటుకు మృతిచెందింది. వీర్నపల్లిలో భారీ వడగళ్లు పడ్డాయి. భారీ ఈదురుగాలులకు చెట్లకొమ్మలు విరిగిపడ్డాయి.
సిరిసిల్ల రూరల్ /ఎల్లారెడ్డిపేట, మే 7:ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంతో గ్రామాల్లో మంగళవారం కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. తూకం వేసిన ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. ఽకొనుగోళ్లల్లో నిర్వాహకుల జాప్యంతో ధాన్యం అకాల వర్షానికి తడిసి పోయిందని ఆందోళనకు దిగారు. నిర్వాహకులను నిలదీశారు. తూకం వేసిన ధాన్యం తరలించడంలో నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫ సిరిసిల్ల అర్బన్ పరిధిలోని గ్రామాల్లో మంగళవారం సాయంత్రం కురిసిన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడడంతో ధాన్యం తడిసిపోయింది. రెండో బైపాస్‌రోడ్డుతోపాటు పెద్దూర్‌లోని మైసమ్మ చెరువు శిఖంలో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో నిల్వ చేసిన ధాన్యం తడిసింది. పెద్దూర్ సింగిల్ విండో చైర్మన్ కిషన్‌యాదవ్, వైస్ చైర్మన్ నారాయణగౌడ్‌తో డైరెక్టర్‌లు పరిశీలించారు.
ఇల్లంతకుంట : మండలంలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం మంగళవారం కురిసింది. రహీంఖాన్‌పేట, వల్లంపట్ల గ్రామాల మధ్య రోడ్డుపై చెట్ల కొమ్మలు విరిగిపడడం, ఇల్లంతకుంటలో విద్యుత్ వైర్లపై చెట్టు కొమ్మ విరగడంతో విద్యుత్ సరఫరాకు కొంత సేపు అంతరాయం ఏర్పడింది.
వీర్నపల్లి: వీర్నపల్లి మండలంలోని పలు ప్రాంతాలలో మంగళవారం ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది. వీర్నపల్లి, బాబాయి చెరువు తండా, భూక్యతండా, రంగంపేటతో పాటు ఆయా గ్రామాలలో, తండాలలో వడగళ్ల వాన కురిసింది. ఈదురుగాలులతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈదురు గాలులకు మామిడి కాయలు నేలరాలాయి.
ముస్తాబాద్: ముస్తాబాద్ మండలంలో మంగళవారం సాయంత్రం కురిసిన వర్షంతో కల్లాల, కొనుగోలు సెంటర్ల వద్ద ధాన్యం తడిసిపోయింది. మోయినికుంటలో అన్వర్‌కు చెందిన ఇంటి పైకప్పు మొత్తం ఫ్యాన్‌లతో పాటు ఎగిరిపోయి మరో ఇంటి ఎదురుగా పడింది. చెట్లు విరిగి నెలమట్టమయ్యాయి.
ఫ వేములవాడలో భారీ వర్షం
వేములవాడ :వేములవాడలో మంగళవారం మధ్యాహ్నం ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. రాజరాజేశ్వరస్వామి దేవస్థానం పరిసరాలలో భక్తులకు నీడ కోసం వేసిన చలువ పందిళ్లు కూలి పోయాయి. బుధవారం ప్రధాని మోదీ ఎన్నికల ప్రచార సభ కోసం పట్టణ శివారులోని బాలానగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభాస్థలి వద్ద ఈదురు గాలులు, వర్షంతో టెంట్లు, విద్యుత్ లైట్లు నేలకొరిగాయి. కుర్చీలు చెల్లా చెదురుగా పడిపోయాయి. సభా ప్రాంగణంలో వర్షపు నీరు చేరింది. ఆలయ పార్కింగ్ స్థలంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ల చుట్టూ వరద నీరు చేరుకుంది.
వేములవాడ రూరల్ : మండలంలోని పలు గ్రామాలలో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. బొల్లారంలో కొనుగోలు కేంద్రంలో వరిధాన్యం తడిసింది. చెట్లు, విద్యుత్ స్థంబాలు నేలకొరిగాయి.
బోయినపల్లి: బోయినపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. కోతకురాని వరి నెలకొరిగింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా రైతులు ఇబ్బందులు పడ్డారు.
కోనరావుపేట: కోనరావుపేట మండలంలో మంగళవారం భారీ వర్షం కురిసింది. ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతులు ఇబ్బంది పడ్డారు. మట్టిమల్ల గ్రామానికి చెందిన దాదె జలపతికి చెందిన పాడి గేదె పొలం వద్ద చెట్టుకు కట్టేసి ఉండగా పిడుగు పడి మృతి చెందింది. మండలంలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది. మంగళపల్లిలో హనుమాన్ టెంపుల్ ఏరియాలో నీరు నిలిచి నడవాలేని పరిస్థితి ఏర్పడింది.
చందుర్తి: చందుర్తి మండల కేంద్రంతో పాటు కట్టలింగంపేట, మల్యాల తదితర గ్రామాల్లో మంగళవారం అకాల వర్షంతో రైతులు అవస్థలు పడ్డారు. మండలంలోని రామారావుపల్లిలో వడగండ్ల వర్షం కురవడంతో ధాన్యం తడిసింది. కొనుగోలు చేసిన ధాన్యం తరలించేందుకు లారీల కొరతతో తూకం వేయడంలో తీవ్రజాప్యం జరుగుతోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.