సొంతింటిపై ఆశలు
ABN , Publish Date - Nov 07 , 2024 | 01:02 AM
గూడు లేని పేదల సొంతింటి కల నెరవేర్చడానికి ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి విధి విఽధానాలు రావడంతో దరఖాస్తుదారుల్లో మళ్లీ ఆశలు మొదలయ్యాయి. గత నెలలో ఇందిరమ్మ ఇళ్లు, ఇతర సంక్షేమ పథకాల కోసం పూర్తి చేసిన ఇందిరమ్మ కమిటీలకు త్వరలో ఆమోదం లభించనుంది.
- ఇందిరమ్మ ఇళ్ల మార్గదర్శకాలు విడుదల
- 15వ తేదీ నుంచి గ్రామ సభలు
- 15వ తేది లోపు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల గుర్తింపు
- త్వరలో ఇందిరమ్మ కమిటీలకు ఆమోదం
- నియోజకవర్గానికి 3500 ఇళ్ల లక్ష్యం
- జిల్లాలో 1.10 లక్షల దరఖాస్తులు
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
గూడు లేని పేదల సొంతింటి కల నెరవేర్చడానికి ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి విధి విఽధానాలు రావడంతో దరఖాస్తుదారుల్లో మళ్లీ ఆశలు మొదలయ్యాయి. గత నెలలో ఇందిరమ్మ ఇళ్లు, ఇతర సంక్షేమ పథకాల కోసం పూర్తి చేసిన ఇందిరమ్మ కమిటీలకు త్వరలో ఆమోదం లభించనుంది. జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ, రెండు మున్సిపాలిటీలతోపాటు 255 గ్రామ పంచాయతీల్లో 1610మందితో ఇందిరమ్మ కమిటీల్లో సభ్యులను నియమించారు.
జిల్లాలో దరఖాస్తులు
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఇంటి పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో ఆరు గ్యారంటీలకు చేసుకున్న దరఖాస్తులు 1,92,617 వచ్చాయి. అందులో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారు 1,10,198 మంది ఉన్నారు. ఇందులో 338 మంది ఇంటి స్థలాల కోసం అమరవీరుల కుటుంబాలకు సంబంధించి 2130 మంది తెలంగాణ ఉద్యమ కారులు దరఖాస్తు చేసుకున్నారు. సొంత స్థలం ఉన్న బలహీనవర్గాలు ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం ప్రకటించిన రూ.5 లక్షల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ఇందిరమ్మ ఇళ్ల విధివిధానాలకు సంబంధించి షెడ్యూల్ ప్రకటించారు. గ్రామాల్లో ఈనెల 15 నుంచి 20వ తేదీ వరకు గ్రామసభలు నిర్వహించనున్నారు. అర్హులైన వారిని గుర్తించి జాబితా రూపొందించనున్నారు. లబ్ధిదారుల్లో స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునే స్థోమత లేనివారికి రూ.5 లక్షల మొదటి ప్రాధాన్యంగా అందిస్తారు. స్థలం లేని వారికి 75 గజాలతోపాటు ఇంటి నిర్మాణానికి సహాయం చేయనున్నారు. ఈ క్రమంలో మొదటి విడతగా సిరిసిల్ల, వేములవాడ రెండు నియోజకవర్గాలకు సంబంధించి 3500 ఇళ్ల చొప్పున 7 వేలు మంజూరుకానున్నాయి. మరోవైపు త్వరలో ఆమోదం లభించనున్న ఇందిరమ్మ కమిటీల్లో స్థానిక ఎమ్మెల్యే చైర్మన్‌గా వ్యవహరించనున్నారు.
మార్గదర్శకాలు ఇలా..
ప్రభుత్వం పకడ్బంధీగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని భావిస్తోంది. ఇందు కోసం మహిళల పేర్లతో వచ్చిన దరఖాస్తులను పరిగణలోకి తీసుకుంటారు. దరఖాస్తు దారుల్లో ప్రభుత్వ ఉద్యోగి ఉంటే అనర్హులుగా ప్రకటిస్తారు. లబ్ధిదారుల ఎంపికలో దివ్యాంగులకు 5 శాతం, ఎస్సీలకు 20, ఎస్టీలకు పది, బీసీ, మైనార్టీలకు 50, జనరల్ కేటగిరీ కింద 15 శాతం ఇళ్లను కేటాయిస్తారు. నాలుగు దశల్లో డబ్బులను విడుదల చేస్తారు. రూ.5 లక్షల్లో పునాది స్థాయిలో లక్ష, రెండో దశలో రూ.1.25లక్షలు, మూడో దశలో స్లాబ్‌కు రూ.1.75 లక్షలు, ఫినిషింగ్ ఇతర దశలో రూ.లక్ష అందిస్తారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపికను ప్రభుత్వం తహసీల్దార్లకు అప్పగించనుంది. లబ్ధిదారుల ఎంపికలో రేషన్ కార్డు తప్పనిసరి కాదని మంత్రి స్పష్టం చేశారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్ల వాళ్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఎంపిక ప్రక్రియ తహసీల్దార్లకు అప్పగించడంతో రాజకీయ నేతల జోక్యం తగ్గుతుందని భావిస్తున్నారు.
డబుల్ ఇళ్లపై కనిపించని స్పష్టత...
గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిరుపయోగంగా మారాయి. ప్రస్తుత ప్రభుత్వం వాటిని లబ్ధిదారులకు కేటాయిస్తుందని ఎదురు చూస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు విధి విధానాలు ప్రకటించినా డబుల్ బెడ్‌రూం ఇళ్లపై స్పష్టత ఇవ్వలేదు. జిల్లాలోని 12 మండలాలు, సిరిసిల్ల, వేములవాడ రెండు మున్సిపాలిటీలకు సంబంధించి 6886 డబుల్ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేశారు. ఇందుకోసం రూ.374.41 కోట్ల నిధులు వ్యయంగా నిర్ణయించారు. ఇందులో 5437 ఇళ్లకు మాత్రమే టెండర్ ప్రక్రియ పూర్తి చేశారు. 4248 ఇళ్ల నిర్మాణాలు చేపట్టి 3546 పూర్తి చేశారు. ఇందులో 3448 లబ్ధిదారులకు అందించారు. రూ.188.49 కోట్లు ఖర్చు చేశారు. 702 నిర్మాణ దశలోనే ఆగిపోయాయి. కొన్ని పూర్తయిన మౌలిక సదుపాయాలు లేక పంపిణీకి నోచుకోవడం లేదు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోనూ ఇండ్ల నిర్మాణాలు పూర్తయిన అనేక వివాదాల మధ్య అందించడం లేదు. పూర్తయిన ఇండ్లు కేటాయింపులకు నోచుకోక శిథిలావస్థకు చేరుకోవడమే కాకుండా అసాంఽఘీక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి.
జిల్లాలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాల్లో సిరిసిల్ల మండలంలో 2052 లక్ష్యాన్ని పూర్తి చేశారు. ముస్తాబాద్‌లో 702 ఇళ్లకు 429, తంగళ్లపల్లి 549 ఇళ్లకు 110, ఎల్లారెడ్డిపేట 490 ఇళ్లకు 320, గంభీరావుపేట 476 ఇళ్లకు 371, వీర్నపల్లిలో 160 ఇళ్లు మంజూరవగా 50 నిర్మాణం ప్రారంభించారు. ఒక్కటి కూడా పూర్తి కాలేదు. ఇల్లంతకుంటలో 340 ఇళ్లకు 184 పూర్తి చేశారు. వేములవాడ రూరల్ మండలంలో 1080 ఇళ్లకు 80 పూర్తవగా వేములవాడ అర్బన్‌లో 800 ఇళ్లకు ఇప్పటి వరకు ఒక్కటీ పూర్తి కాలేదు. కోనరావుపేట మండలంలో 92, చందుర్తి 45, రుద్రంగి 35, బోయినపల్లిలో 65 ఇళ్లు మంజూరైనా ఇప్పటి వరకు నిర్మాణాలు ప్రారంభం కాలేదు. ముస్తాబాద్‌లో 175 ఇళ్లు, తంగళ్లపల్లి 178, ఎల్లారెడ్డిపేట 106, గంభీరావుపేట 43, వీర్నపల్లి 87, ఇల్లంతకుంట 156, వేములవాడ రూరల్ 1000, వేములవాడ అర్బన్ 656, కోనరావుపేట 92, చందుర్తి 45, రుద్రంగి 35, బోయినపల్లిలో 65 ఇండ్లు టెండర్లు మాత్రమే పూర్తి చేశారు. ప్రధానంగా వేములవా నియోజకవర్గంలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం పూర్తిగా నిరాశ మిగిల్చింది. గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతోనే సగం కూడా పూర్తి కాలేదనే విమర్శలు ఉన్నాయి.