Share News

సీఎం సభకు భారీ సన్నాహాలు

ABN , Publish Date - Nov 30 , 2024 | 12:38 AM

ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా వచ్చేనెల 4వ తేదీన పెద్దపల్లిలో నిర్వహించనున్న యువత విజయోత్సవ సీఎం సభకు సుమారు 50 వేల మందిని తరలించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సభను పెద్దపల్లి పట్టణం రంగంపల్లి శివారులో కలెక్టరేట్‌కు సమీపంలోగల ఖాళీ స్థలంలో సభ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.

సీఎం సభకు భారీ సన్నాహాలు
సీఎం సభాస్థలి వద్ద సీపీతో మాట్లాడుతున్న కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

- కలెక్టరేట్‌కు సమీపంలోనే సభ.. 50వేల మంది తరలింపు

- సభాస్థలికి పక్కనే తాత్కాలిక హెలిప్యాడ్‌ నిర్మాణం

- ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్న అధికార యంత్రాంగం

- జన సమీకరణకు కాంగ్రెస్‌ పార్టీ నేతల సమావేశాలు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా వచ్చేనెల 4వ తేదీన పెద్దపల్లిలో నిర్వహించనున్న యువత విజయోత్సవ సీఎం సభకు సుమారు 50 వేల మందిని తరలించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సభను పెద్దపల్లి పట్టణం రంగంపల్లి శివారులో కలెక్టరేట్‌కు సమీపంలోగల ఖాళీ స్థలంలో సభ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు వెంచర్లుగా చేసిన స్థలంతో పాటు రైతులకు చెందిన వ్యవసాయ భూముల్లో సభ నిర్వహించాలని నిర్ణయించారు. దాదాపు 40 ఎకరాలకు పైగా ఖాళీ స్థలం ఉండడం గమనార్హం. సభా ప్రాంగణానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చేందుకు రోడ్లను సిద్ధం చేస్తున్నారు. వాహనాల పార్కింగ్‌కు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు రోజుల నుంచి కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సంబంధిత శాఖాధికారులతో స్థల పరిశీలన చేశారు. రామగుండం పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాసులుతో కూడా సభాస్థలిని సందర్శించారు. పోలీస్‌ భద్రతా ఏర్పాట్లను ఎక్కడెక్కడ వాహనాలను పార్కింగ్‌ చేయాలి, హెలిప్యాడ్‌ ఎక్కడ నిర్మించాలి, సభాస్థలికి వచ్చే రోడ్ల నిర్మాణాలు, తదితర అంశాలను పరిశీలించి ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా పెద్దకల్వల పరిధిలో గతంలో కేసీఆర్‌ నిర్వహించిన స్థలంలోనే సభ నిర్వహించాలని భావించినప్పటికీ, ప్రధాన రహదారి నుంచి సభా ప్రాంగణానికి నడిచి వెళ్లేందుకు చాలా దూరం ఉందని భావించిన అధికారులు, ఎమ్మెల్యే విజయరమణారావులు రంగంపల్లి శివారులోగల స్థలం మెయిన్‌ రోడ్డుకు చాలా దగ్గరగా ఉందని భావించి అక్కడే సభను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సభలో 9వేల మంది గ్రూపు-4 ఉద్యోగులకు నియామక పత్రాలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అందజేయనున్నారు. యువకులతో పాటు మహిళలు, రైతులను కూడా ఈ సభకు తరలించనున్నారు. సభా ప్రాంగణంలో 50 వేల మందికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వపరంగా తరలించే జనమే గాకుండా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో మంథని, పెద్దపల్లి, రామగుండం, ధర్మపురి నియోజకవర్గాల నుంచి జనాలను తరలించేందుకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యేలు చింతకుంట విజయరమణారావు, రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌, ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌లు పార్టీ నాయకులతో సన్నాహాక సమావేశాలు నిర్వహిస్తున్నారు. సభ మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్యలో నిర్వహించే అవకాశాలున్నాయి. ఇంకా అధికారికంగా మినిట్‌ టు మినిట్‌ షెడ్యూల్‌ రాలేదు. సీఎం రాకతో పెద్దకల్వల నుంచి పెద్దపల్లి పట్టణంలోని శాంతినగర్‌ వరకు గల రోడ్లను శుభ్రం చేయడంతో పాటు రాజీవ్‌ రహదారికి మరమ్మతు పనులు కూడా చేస్తున్నారు. డివైడర్లకు రంగులు వేస్తున్నారు. డివైడర్ల మధ్యలో పెంచిన చెట్లకు కూడా రంగులు వేస్తున్నారు. సభా ఏర్పాట్లను రోడ్లు, భవనాల శాఖ, పంచాయతీరాజ్‌ శాఖ, మున్సిపల్‌ శాఖ, రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అలాగే పోలీస్‌ బందోబస్తును పెద్దఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సీఎం సభా ప్రాంగణానికి ఇరువైపులా సెక్యూరిటీ వింగ్‌లను పెడుతున్నారు. సభా ప్రాంగణంలో డి సర్కిల్‌ బయటనే వీఐపీలు, ప్రెస్‌, పబ్లిక్‌ కూర్చునేందుకు సిట్టింగ్‌ ఏర్పాట్లు చేయనున్నారు. వేదిక మీదకు ప్రజాప్రతినిధులు, అధికారులను ప్రొటోకాల్‌ ప్రకారం అనుమతించనున్నారు. సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి తొలిసారిగా జిల్లాకు వస్తున్న సందర్భంగా సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ నేతలు భారీగా జన సమీకరణ చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు.

Updated Date - Nov 30 , 2024 | 12:38 AM