యాసంగిలో వరివైపే మొగ్గు
ABN , Publish Date - Dec 21 , 2024 | 01:43 AM
యాసంగి సాగుకు సర్వం సిద్ధమయింది. ఈ సీజన్‌లో జిల్లాలో 3,04,665 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. 2.65 లక్షల ఎకరాల్లో రైతులు వరిసాగు చేయనున్నారని భావించిన అధికారులు అందుకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేశారు.
- ఎదుగుతున్న నారుమళ్లు..
- అక్కడక్కడ ప్రారంభమైన నాట్లు..
- ఎరువులు అందుబాటులో ఉంచేందుకు వ్యవసాయ శాఖ ఏర్పాట్లు
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
యాసంగి సాగుకు సర్వం సిద్ధమయింది. ఈ సీజన్‌లో జిల్లాలో 3,04,665 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. 2.65 లక్షల ఎకరాల్లో రైతులు వరిసాగు చేయనున్నారని భావించిన అధికారులు అందుకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేశారు. యాసంగిలో దొడ్డు రకం వరిసాగుకే రైతులు మొగ్గు చూపుతున్నారు. 20 శాతం విస్తీర్ణంలో మాత్రమే సన్నరకాలు సాగయ్యే అవకాశాలున్నాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. 15 రోజుల్లో నాట్లు ముమ్మరమవుతాయి. ఏప్రిల్‌లో పంట నూర్పిడులు జరిగే అవకాశం ఉంది.ఈ సీజన్‌లో పండే ధాన్యం మరాడిస్తే విరిగిపోయి నూకలు ఎక్కువగా వస్తాయి. దీంతో దొడ్డు వరి రకాలనే రైతులు సాగు చేస్తారు. అవసరాల మేరకు జిల్లా వ్యవసాయాధికారి ఎరువుల కోసం డైరెక్టరేట్‌కు ఇండెంట్ పంపించారు. నెలవారి అవసరాలకు అనుగుణంగా ఎరువులను జిల్లాకు సరఫరా చేస్తారు. జిల్లాలో దొడ్డు రకామైన 1010 ఎక్కువగా సాగు చేస్తారు. కూనారం సన్నాలు కూడా ఎక్కువగా సాగయ్యే అవకాశం ఉంది.
ఫ రెండు లక్షల ఎకరాల్లో దొడ్డు రకాలు సాగయ్యే అవకాశం
యాసంగిలో దొడ్డురకం వరిసాగు సుమారు రెండు లక్షల ఎకరాల్లో జరుగుతుందని భావిస్తున్నారు. సన్నరకాలకు చీడపీడలు ఎక్కువగా ఉంటుంది. పంట కాలం ఎక్కువగా ఉండి వేసవిలో నీరు అందని పరిస్థితులు ఏర్పడుతాయి. దీంతో దొడ్డురకాలనే రైతులు ఎక్కువ సాగు చేస్తారు. పిలిప్పీన్స్‌లో మన వద్ద పండే ఎంటీయూ 1010 రకం దొడ్డు బియ్యానికి డిమాండ్ ఎక్కువగా ఉంది. పశ్చిమబెంగాల్, తమిళనాడు, కర్ణాటక, బీహార్ లాంటి రాష్ర్టాల ప్రజలు తెలంగాణలో పండే బియ్యంపై మక్కువ చూపుతున్నారు. పిలిప్పీన్స్ 10 లక్షల టన్నుల బియ్యం కొనుగోలుకు ఆసక్తి చూపించి మొదటి విడతలో లక్ష టన్నుల బియ్యం తీసుకోవడానికి సిద్ధపడింది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి డీఎస్ చౌహాన్‌తో సంప్రదింపులు జరుపింది. దీంతో ఇక్కడ పండే 1010 రకం వరికి డిమాండ్ ఉంటుందని రైతులు భావిస్తున్నారు. ఈ సీజన్‌లో ఆ పంటే సాగు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అన్ని నేలలకు అనుకూలంగా ఉండే పంట కావడం, ఎకరాకు 30 క్వింటాళ్ల దిగుబడికి తగ్గకుండా రావడంతో రైతులు ఈ వరిరకాన్ని ఎక్కువగా సాగు చేస్తున్నారు. దొడ్డు రకాలకు ప్రభుత్వం 2300 మద్దతు ధరతో గ్రామాల్లోనే కేంద్రాలు ఏర్పాటు చేసి కొంటుంది. రైస్ మిల్లర్లు కూడా 1010 రకం ధాన్యం కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు.
ఫ ఎరువులు, విత్తనాలకు కొరత లేదు...
జిల్లా వ్యవసాయాధికారి జె భాగ్యలక్ష్మి
జిల్లాలో యాసంగి సాగుకు అవసరమయ్యే ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. 3,04,665 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అంచనా వేస్తున్నాం జిల్లాలో 2.65 లక్షల ఎకరాల్లో వరిసాగు చేస్తారని అంచనా వేస్తున్నాం. ఇందులో 80 శాతం దొడ్డు రకాలు, 20 శాతం సన్న రకాలను సాగు చేస్తారు. ఎరువుల కొరత లేకుండా ప్రణాళికను సిద్ధం చేసి డైరెక్టరేట్‌కు పంపించాం. ఆయా నెలల్లో అవసరం మేరకు ఎరువులు జిల్లాలో అందుబాటులో ఉంటాయి. రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వడానికి మండల స్థాయిలో ఏవోలు, క్లస్టర్ స్థాయిలో ఏఈవోలు అందుబాటులో ఉంట్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు జిల్లాకు 50 క్లస్టర్స్ కేటాయించింది. ఒక్కో క్లస్టర్‌లో 50 హెక్టార్ల చొప్పున 6,250 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం జరగనుంది. ప్రస్తుతం కేంద్రం పంపించిన మార్గదర్శక సూత్రాల మేరకు క్లస్టర్ రీసోర్స్ పర్సన్లను (కృషి సఖి) గుర్తించే కార్యక్రమం చేపడతాము.