గత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అన్యాయం
ABN , Publish Date - Nov 12 , 2024 | 12:57 AM
గత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అన్యాయం చేసిన బీఆర్‌ఎస్ నేతలకు మాట్లాడే అర్హత లేదని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కార్తీక సోమవారం సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్నారు.
వేములవాడలో మంత్రి పొన్నం ప్రభాకర్
వేములవాడ కల్చరల్, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): గత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అన్యాయం చేసిన బీఆర్‌ఎస్ నేతలకు మాట్లాడే అర్హత లేదని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కార్తీక సోమవారం సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కేటీఆర్ కాంగ్రెస్ బీసీలకు ఏం చేసిందని ప్రశ్నించారని, అసలు బీసీల గురించి మాట్లాడే అర్హత ఉందా? అని కేటీఆర్‌ను ప్రశ్నించారు. కేటీఆర్ బీసీల గురించి మాట్లాడాలంటే ఆ పార్టీ అధ్యక్ష పదవి, కార్యనిర్వాహక పదవి, ప్రతిపక్ష పదవులను బీసీ, ఎస్సీలకు ఇవ్వాలన్నారు. ఒక్కటి ఇచ్చినా మాట్లాడే అర్హత ఉంటుందన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించారని, కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని ఆరోపించారు. ఆ వివరాల కోసం విచారణ చేయిస్తామని, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో జరుగుతున్న ఈ కుల సర్వే దేశ వ్యాప్తంగా జరగాలని డిమాండ్ వస్తోందన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీ సర్వేను అక్కడక్కడ అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు ప్రతీ తెలంగాణ పౌరుడు సహకరించాలన్నారు. సర్వే ఇబ్బంది పెట్టేందుకు, బలహీన వర్గాలకు మాత్రమే పరిమితమైంది కాదని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ది ప్రణాళిక దిక్సూచి అవసరాల కోసం తీసుకుంటున్న సమాచారమని స్పష్టం చేశారు. ఎన్యూమరేటర్లకు సవచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయ పార్టీల రెచ్చగొట్టే వాఖ్యలకు ప్రభావితం కావద్దని కోరారు. అంతకుముందు రాజన్న ఆలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ఎస్పీ అఖిల్‌మహాజన్ పూలమొక్కతో స్వాగతం పలికారు. కాగా పోలీసులు ఏర్పాటు చేసిన గౌరవవందనాన్ని స్వీకరించారు. సోమవారం తెల్లవారు జామున రాజన్న ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి కోడెమొక్కు చెల్లించుకున్నారు. ఆలయ కల్యాణ మండపంలో అర్చకులు ఆశీర్వచనం, ఈవో వినోద్‌రెడ్డి రాజన్న ప్రసాదాన్ని అందజేశారు. ఆయన వెంట ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.