మున్సిపాలిటీల్లో అంతర్గత మహిళా కమిటీలు
ABN , Publish Date - Nov 07 , 2024 | 01:00 AM
మున్సిపాలిటీల్లో మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు అంతర్గత కమిటీలు ఏర్పాటు చేయాలని మున్సిపల్ శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జగిత్యాల జిల్లాలో సంబంధిత కమిటీ ఏర్పాట్లపై అధికారులు దృష్టిసారించారు.
- పనిప్రదేశాల్లో వేధింపులు అరికట్టేందుకే..
- పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసి ఆరు నెలలు
- ఉన్నతాధికారులు దృష్టి సారిస్తేనే ప్రయోజనం
- జిల్లాలో అయిదు మున్సిపాలిటీలు
జగిత్యాల, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): మున్సిపాలిటీల్లో మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు అంతర్గత కమిటీలు ఏర్పాటు చేయాలని మున్సిపల్ శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జగిత్యాల జిల్లాలో సంబంధిత కమిటీ ఏర్పాట్లపై అధికారులు దృష్టిసారించారు. పనిప్రదేశాల్లో ప్రధానంగా మహిళా ఉద్యోగులపై వేధింపులు కొనసాగుతున్నట్లు ఆరోపణలు రావడంతో రాష్ట్ర మున్సిపల్ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. మహిళా ఉద్యోగినుల రక్షణపై ప్రత్యేక దృష్టి సారించింది. మున్సిపాలిటీల్లో అంతర్గత కమిటీలను ఏర్పాటు చేయాలని గత ఏప్రిల్‌లో మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. లోక్‌సభ ఎన్నికల ప్రక్రియలో అధికారులు నిమగ్నమైనందున కమిటీల ఏర్పాటుపై అంతగా దృష్టి సారించలేదు. ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇటీవల పలు మున్సిపాలిటీల్లో క మిటీలను ఏర్పాటు చేయడంపై కమిషనర్లు కసరత్తు చేస్తున్నారు.
ఫ కమిటీల్లో ఎవరు ఉంటారంటే...
మున్సిపాలిటీల్లోని మహిళా ఉద్యోగులకు రక్షణ కల్పించేందుకు 2013లో జారీచేసిన చట్టాన్ని పరిగణనలోకి తీసుకుని, కమిటీల ఏర్పాటుకు మున్సిపల్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీల్లో వివిధ హోదాల్లో మహిళా ఉద్యోగులు, కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. వారికి ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న అంతర్గత కమిటీలు రక్షణ కల్పించేందుకు కృషి చేయాల్సి ఉంది. వేధింపులను అరికట్టేందుకు ఏర్పాటు చేసే కమిటీలో సీనియర్ మహిళా ఉద్యోగిని ప్రిసైడింగ్ అధికారిగా నియమించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏదైనా మున్సిపాలిటీలో సీనియర్ మహిళా ఉద్యోగి లేకపోతే ఇతర ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఒక సీనియర్ మహిళా ఉద్యోగిని ఎంపిక చేసి బాధ్యతలు అప్పగించాల్సి ఉంటుంది. మరో ఇద్దరిని ఈ కమిటీలో సభ్యులుగా నియమించాల్సి ఉంటుంది. మహిళా చట్టాలపై అవగాహన, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే వారికి సభ్యులుగా అవకాశమివ్వాలన్న మార్గదర్శకాలున్నాయి. మహిళా సమస్యలపై పోరాటం చేసే ప్రభుత్వేతర మహిళ ఒకరికి కమిటీలో చోటు కల్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మహిళా ఉద్యోగులపై ఎవరైనా వేధింపులకు పాల్పడితే ఈ కమిటీ విచారణ చేసి చర్యలు తీసుకుంటుంది. అవరమైతే ఉన్నతాధికారులకు పూర్తి నివేదిక సమర్పించి వేధింపులకు కారకులైన వారిపై చర్యలు తీసుకునేలా తోడ్పాటు అందిస్తుంది. అంతర్గత కమిటీల ఏర్పాటుతో మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న మహిళలకు పూర్తి స్థాయిలో రక్షణ లభిస్తుందని ఆశిస్తున్నారు. అయితే పలు మున్సిపాలిటీల్లో అంతర్గత మహిళా కమిటీలు ఏర్పాటు కాకపోవడం, కసరత్తులు జరుగుతుండడం వంటి పరిస్థితులున్నాయి. మున్సిపాలిటీల్లో ఏర్పాటు కానున్న మహిళా కమిటీల వల్లనైనా పనిప్రదేశాల్లో లైగింక వేధింపులు తప్పుతాయన్న ఆశతో పలువురు మహిళా ఉద్యోగులు ఉన్నారు. ఈ దిశగా ఉన్నతాధికారులు దృష్టి సారిస్తేనే బాధిత మహిళలకు ప్రయోజనం చేకూరుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.