Share News

గర్రెపల్లి సింగిల్‌ విండోలో అక్రమాలు

ABN , Publish Date - Nov 09 , 2024 | 01:12 AM

సుల్తానాబాద్‌ మండలం గర్రెపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవన నిర్మాణానికి అవసరమైన స్థలం కొనుగోలులో మాయాజాలం చోటుచేసుకున్నది. కొనుగోలు చేసిన భూ యజమాని పేరిట 44 లక్షల రూపాయలు డ్రా చేసిన పాలకవర్గం, ఆ యాజమానికి 37 లక్షలు మాత్రమే అందజేసి 7 లక్షల రూపాయలు కాజేసినట్లుగా ప్రచారం జరుగుతున్నది. ఈ వ్యవహారం ఆ నోట ఈ నోట బయటకు పొక్కడంతో పలువురు పాలకవర్గ సభ్యులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసేందుకు సన్నద్ధం అవుతున్నట్లు సమాచారం.

  గర్రెపల్లి సింగిల్‌ విండోలో అక్రమాలు
గర్రెపల్లి సింగిల్‌ విండో పాలకవర్గం కొనుగోలు చేసిన స్థలం

- భూమి కొనుగోలులో మాయాజాలం

- రూ.39 లక్షలకు కొనుగోలు చేసి రూ.44 లక్షలకు పత్రాలు

- విచారణ జరిపించాలంటూ సంఘ సభ్యుల డిమాండ్‌

పెద్దపల్లి/ సుల్తానాబాద్‌, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి) : సుల్తానాబాద్‌ మండలం గర్రెపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవన నిర్మాణానికి అవసరమైన స్థలం కొనుగోలులో మాయాజాలం చోటుచేసుకున్నది. కొనుగోలు చేసిన భూ యజమాని పేరిట 44 లక్షల రూపాయలు డ్రా చేసిన పాలకవర్గం, ఆ యాజమానికి 37 లక్షలు మాత్రమే అందజేసి 7 లక్షల రూపాయలు కాజేసినట్లుగా ప్రచారం జరుగుతున్నది. ఈ వ్యవహారం ఆ నోట ఈ నోట బయటకు పొక్కడంతో పలువురు పాలకవర్గ సభ్యులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసేందుకు సన్నద్ధం అవుతున్నట్లు సమాచారం. వ్యవసాయ రంగంలో రైతులకు చేదోడు వాదోడుగా ఉండాల్సింది పోయి వారి సొమ్ముకే ఎసరు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. గర్రెపల్లిలోని సహకార సంఘం సొంత స్థలంలో 20 ఏళ్ల క్రితమే విశాలమైన గదులతో పక్కా భవనం నిర్మించారు. వాస్తవానికి ఇక్కడ మరో భవనం అవసరం లేదు. కానీ సంఘం సేవలు విస్తరింపజేయాలనే ఆలోచనతో ప్రస్తుత పాలకవర్గ సభ్యులు నూతన భవన నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఈ భవనాన్ని పక్క గ్రామంలో నిర్మించాలని భావించినప్పటికీ గ్రామస్తులు అడ్డు చెప్పడంతో నిర్ణయం మార్చుకున్నారు. గర్రెపల్లిలోనే ఆరు మాసాల క్రితం రాజీవ్‌ రహదారి పక్కన స్థలాన్వేషణ చేశారు. అదే గ్రామానికి చెందిన సందెవేని శ్రీనివాస్‌కు చెందిన సర్వే నంబరు 67/ఆ లోని మూడున్నర గుంటల భూమిని కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఆ భూమికి మొదట 39 లక్షల రూపాయలు ఖరారు చేసుకున్నారు. కానీ 44 లక్షల రూపాయలకు కొనుగోలు చేసినట్లు రికార్డులు సృష్టించి కో-ఆపరేటివ్‌ అధికారులను నమ్మించారు. ఈ మొత్తాన్ని చెక్కుల రూపంలో భూయజమానికి చెల్లించారు. అందులో నుంచి నెల రోజుల క్రితం అగ్రిమెంట్‌ ప్రకారం కాకుండా రికార్డుల్లో అదనంగా సృష్టించిన ఐదు లక్షల రూపాయలతో పాటు యజమాని నుంచి మరో రెండు లక్షలు కలుపుకొని మొత్తం 7లక్షల రూపాయలు పాలకవర్గం కాజేసినట్లు సమాచారం. తమకు ఖర్చులు ఉంటాయని ముందే భూయజమానికి చెప్పి ఒప్పందానికి మించి ఐదు లక్షల రూపాయలు అదనంగా రికార్డుల్లో రాయించారని తెలిసింది. కానీ ఆ భూమికి అంత విలువ లేదని ఇప్పటికే ఎక్కువ ధర చెల్లించామని అందులో 39 లక్షలకు బదులు 37 లక్షలు తీసుకొని మిగతా రెండు లక్షల రూపాయలు తిరిగి ఇవ్వాలని భూయజమానిపై ఒత్తిడి పెంచి తీసుకున్నట్లు సమాచారం.

ఫ ఖర్చులు ఉంటాయని చెప్పి..

సదరు స్థలాన్ని 39 లక్షల రూపాయలకు బేరం కుదుర్చుకున్న పాలకవర్గం 44 లక్షల రూపాయలకు కొనుగోలు చేసినట్లు పత్రాలు సృష్టించారు. ఎవరడిగినా 44 లక్షలకు విక్రయించినట్లు చెప్పాలని భూయజమానికి హుకుం జారీ చేశారని తెలిసింది. అదనంగా రాసుకున్న 5 లక్షల రూపాయలు ఖర్చుల కోసమేనని సెలవిచ్చారు. కొన్ని రోజులు కాలయాపన చేసిన అనంతరం పలు దఫాలుగా అతడికి చెక్కుల రూపంలో 44 లక్షల రూపాయలు ముట్టజెప్పారు. వారు తిరిగి 5 లక్షలకు బదులు 7 లక్షలు రూపాయలు తీసుకున్నారని భూయజమాని సందేవేని శ్రీనివాస్‌ తెలిపారు. ఒప్పందం ప్రకారం తనకు రావాల్సిన 39 లక్షల రూపాయల్లో మరో 2 లక్షలు బెదిరించి తీసుకున్నట్లు భూయజమాని ఆరోపిస్తున్నాడు. ఇలా సొసైటీకి 5 లక్షలు రూపాయలు నష్టం కలిగించడంతో పాటు పాలకవర్గ సభ్యులు భూయజమానిని బెదిరించి మరో 2 లక్షల రూపాయలు కాజేశారు. అదనంగా తీసుకున్న డబ్బులు పాలకవర్గం చెందిన కొందరితో పాటు సహకార శాఖ అధికారులకు కూడా కొంత సొమ్ము ముట్ట చెప్పినట్లు సమాచారం. సంఘం పరపతి కాపాడాల్సిన వారే పరువు తీయడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంఘ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఫ నాకు రూ.37 లక్షల ఇచ్చారు..

- సందేవేని శ్రీనివాస్‌, భూయజమాని

గర్రెపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనానికి మూడున్నర గుంటల భూమిని విక్రయించాను. ఈ భూమికి రూ.39లక్షలు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. బయట ఖర్చులు ఉంటాయని రూ.44లక్షలకు కొనుగోలు చేసినట్లుగా ఒప్పంద పత్రం రాయించుకున్నారు. నా పేరిట 44 లక్షల రూపాయల చెక్కులను అందజేసినప్పటికీ, అందులో నుంచి రూ.5 లక్షలకు బదులు, భూమి ధర ఎక్కువైందని అదనంగా రూ.2 లక్షలు కలుపుకొని మొత్తం రూ.7 లక్షలు డ్రా చేయించి తీసుకున్నారు. దీనిపై అధికారులు విచారణ జరిపించి నాకు రావలసిన రెండు లక్షల రూపాయలు ఇప్పించాలని కోరుతున్నాను.

ఫ సంఘం నిధులను దుర్వినియోగం చేయలేదు..

- జూపల్లి సందీప్‌రావు, గర్రెపల్లి సహకార సంఘం చైర్మన్‌

సంఘం నూతన భవన నిర్మాణానికి సంబంధించిన భూమి కొనుగోలులో ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు. పాలకవర్గం అందరి నిర్ణయంతో 44 లక్షలకు భూమిని కొనుగోలు చేశాం. ఆ డబ్బులను చెక్కుల రూపేణా భూయజమానికి చెల్లించాం. ఎక్కడ కూడా నిధులు దుర్వినియోగం కాలేదు. 9 లక్షల రుపాయల నష్టాల్లో ఉన్న సంఽఘాన్ని అభివృద్ధి బాటలో పయనింపజేసేందుకు కృషి చేస్తున్నాం. సంఘం నిధుల దుర్వినియోగంపై వస్తున్న ఆరోపణలు అవాస్తవం. ఈ విషయంపై ఏ విచారణకైనా మేము సిద్ధమే.

Updated Date - Nov 09 , 2024 | 01:13 AM