Share News

డిజిటల్‌ సర్వే లేనట్లేనా?

ABN , Publish Date - Oct 23 , 2024 | 01:07 AM

దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగానికి సంబంధించి పక్కా ప్రణాళికలను రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వం డిజిటల్‌ అగ్రీ మిషన్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే డిజిటల్‌ క్రాప్‌ సర్వే (డీసీఎస్‌)ను ప్రారంభించింది.

డిజిటల్‌ సర్వే లేనట్లేనా?

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగానికి సంబంధించి పక్కా ప్రణాళికలను రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వం డిజిటల్‌ అగ్రీ మిషన్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే డిజిటల్‌ క్రాప్‌ సర్వే (డీసీఎస్‌)ను ప్రారంభించింది. అయితే ప్రస్తుతం ఉన్న పనిభారానికి తోడు డిజిటల్‌ సర్వే చేయలేమని జిల్లాలోని ఏఈవోలు చెప్పడంతో ఇంకా మొదలు కాలేదు. దేశంలో ఆంధ్రప్రదేశ్‌ మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, ఒడిస్సా రాష్ట్రాల్లో గతేడాది నుంచి సర్వే కొనసాగుతోంది. తెలంగాణలో ఈ సం వత్సరం వానాకాలం సీజన్‌ నుంచి అమల్లోకి తెచ్చినా సిబ్బంది కొరత ఇతర కారణాలతో సర్వే మొదలు కాలేదు.

సర్వేతో అదనపు భారం

తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చే దిశగా ప్రణాళికలు రూపొందించడానికి వ్యవసాయ విస్తరణ అధికారులను (ఏఈవో) నియమించారు. ఒక్కొక్కరికి 5 వేల ఎకరాలకు పైగా వ్యవసాయ భూమిని కేటాయిస్తూ క్లస్టర్‌లుగా బాధ్యతలు అప్పగించారు. క్లస్టర్‌ పరిధిలో ఆ గ్రామాల్లోని రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి సలహాలు, సూచనలు ఇవ్వాలి. దీంతోపాటు రైతుబీమా, పంటల సాగు, రుణమాఫీ వంటి పథకాల వివరాలు సేకరించేవారు. ఇదే క్రమంలో క్రాప్‌ బుకింగ్‌ సర్వే కూడా చేసేవారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ సీజన్‌ నుంచి డిజిటల్‌ క్రాప్‌ సర్వే చేయాలని నిర్ణయించింది. ఏఈవోలు మాత్రం ఇది తమకు అదనపు భారమని పేర్కొంటూ సర్వే చేయలేమని చెబుతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుతో పాటు ఉన్నత అధికారులకు వినతిపత్రాలు అందించారు. ఒక్కో గ్రామంలో ఉన్న సర్వే నంబర్లలోని డివిజన్‌లవారీగా రైతుల పంటల సాగు వివరాలు, ఫొటోను వ్యవసాయ శాఖ రూపొందించిన యాప్‌లో నమోదు చేయాలి. వేల ఎకరాల్లో సర్వే నంబర్లతో నమోదు చేయడం ఇబ్బందికరమని పేర్కొంటున్నారు. దీనికి తోడుగా ఏఈవోల్లో మహిళలు కూడా ఎక్కువగానే ఉన్నారు. క్షేత్రస్థాయిలో పొలాల వద్దకు వెళ్లి సర్వే చేసే క్రమంలో విషసర్పాలతోపాటు జన సంచారం లేని ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని భయాందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో వారు సర్వేకు దూరంగా ఉండడంతో ఈసారి డిజిటల్‌ సర్వే లేనట్లుగా భావిస్తున్నారు.

జిల్లాలో సాగు లెక్క ఇలా

జిల్లాలో క్రాప్‌ బుకింగ్‌ ద్వారా ఇప్పటికే సాగు లెక్కలు పూర్తి చేశారు. మరోవైపు వరికోతలు, పత్తి ఏరడం మొదలైంది. కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభించారు. వ్యవసాయ శాఖ ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించిన సర్వే ప్రకారం 2.32 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. ప్రధానంగా వరి 1.80 లక్షల ఎకరాల్లో, పత్తి 49,332, పెసర 56.26, కందులు 939, ఇతర పంటలు 122 ఎకరాల్లో సాగు చేశారు. దీనికి సంబంధించి క్రాప్‌ బుకింగ్‌ చేసినా డిజిటల్‌ సర్వేకు మాత్రం ఏఈవోలు దూరంగా ఉన్నారు. గ్రామాల్లో క్షేత్రస్థాయికి వెళ్లి ఒక్కొక్కరే పనిచేయడం సాధ్యంకాదని, అదనపు సిబ్బందిని ఇవ్వాలని కోరుతున్నారు.

Updated Date - Oct 23 , 2024 | 01:07 AM