గ్రేటర్ దిశగా కరీంనగర్ అడుగులు
ABN , Publish Date - Nov 14 , 2024 | 12:28 AM
కరీంనగర్ నలుదిశలా వేగంగా విస్తరిస్తూ గ్రేటర్ దిశగా అడుగులు వేస్తోందని శాతవాహన అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సుడా) చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి అన్నారు.
కరీంనగర్ టౌన్, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్ నలుదిశలా వేగంగా విస్తరిస్తూ గ్రేటర్ దిశగా అడుగులు వేస్తోందని శాతవాహన అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సుడా) చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి అన్నారు. 2041 వరకు పెరిగే జనాభాకు అవసరాలకు అనుగుణంగా కొత్తగా రూపొందిస్తున్న మాస్టర్‌ప్లాన్‌పై స్టేక్ హోల్డర్స్ సమావేశాన్ని సుడా కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు సుడా పరిధిలో కరీంనగర్ కార్పొరేషన్, కొత్తపల్లి మున్సిపాలిటీలు మాత్రమే ఉన్నాయన్నారు. కొత్తగా హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి మున్సిపాలిటీలు, 147 గ్రామాలు వస్తాయని తెలిపారు. దీనిపై త్వరలోనే సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా న్యూఢిల్లీకి చెందిన డీడీఎఫ్ కన్సల్టెన్సీ రూపొందించిన 2041 మాస్టర్ ప్లాన్‌పై ప్రజెంటేషన్ ఇచ్చారు. కలెక్టర్ పమేలా సత్పతి, రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రియల్ జోన్ల విభజన, నేషనల్ హైవే, జాతీయ రహదారి తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, నగరపాలక సంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పాయి, సీపీవో కోటేశ్వర్‌రావు, డీటీసీపీవో ఆంజనేయులు పాల్గొన్నారు.