Share News

ప్రజల పక్షాన పోరాడుదాం..

ABN , Publish Date - Nov 30 , 2024 | 12:06 AM

కరీంనగర్‌ టౌన్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): ‘ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజల పక్షాన పోరాడుదాం.. ఆ పార్టీ మెడలు వంచుదాం’ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం కరీంనగర్‌లోని అల్గునూర్‌లో నిర్వహించిన దీక్షా దివస్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

ప్రజల పక్షాన పోరాడుదాం..
దీక్షాదివస్‌ సభలో మాట్లాడుతున్న బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, పాల్గొన్న నాయకులు

కరీంనగర్‌ టౌన్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): ‘ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజల పక్షాన పోరాడుదాం.. ఆ పార్టీ మెడలు వంచుదాం’ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం కరీంనగర్‌లోని అల్గునూర్‌లో నిర్వహించిన దీక్షా దివస్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాబోయో నాలుగు సంవత్సరాలపాటు ప్రజల పక్షానే ఉందామన్నారు. అసెంబ్లీలో, పార్లమెంట్‌లో.. ప్రతి వేదికలో తెలంగాణ పక్షాన మన గొంతు విప్పుతునే ఉందామని పిలుపునిచ్చారు. తెలంగాణలో ఉండే ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదన్నారు. ఈపాటి పరిపాలనకు విజయోత్సవాలు చేస్తారట అంటూ ఏద్దెవా చేశారు. కేసీఆర్‌ ఉద్యమ నాయకుడిగా ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చిండనే విషయం నేటి తరానికి తెలియజేయల్సిన అవసరం ఉందన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై రాష్ట్ర ప్రజలు మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరముందని కేటీఆర్‌ అన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ఒంటెద్దు పోకడలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రజలు పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

ఫ ఉద్యమ చరిత్రను భావితరాలకు తెలపాలి

- మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలార్‌

మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం.. అందులో కేసీఆర్‌ పాత్ర ఒక చరిత్ర అని, దాన్ని చెరిపే దమ్ముందా అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను, కేసీఆర్‌ చరిత్రను భావితరాలకు తెలుపాల్సిన అవసరముందని చెప్పారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ఎన్నో సంక్షేమ పథకాలను కరీంనగర్‌ నుంచే ప్రారంభించి సెంటిమెంట్‌ జిల్లాగా భావించారని అన్నారు. పదేళ్ళ కేసీఆర్‌ పాలనలో కరీంనగర్‌ను అద్భుతంగా అభివృద్ధి చేస్తే కాంగ్రెస్‌ ఏడాది పాలనలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు. అవసరమైన మరమ్మతులు చేసే పరిస్థితి లేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలపై కాంగ్రెస్‌ నాయకులు ఏమి సమాధానంచెబుతారని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని, విజయోత్సవాలు జరుపుకోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.

- శాసనమండలి వైస్‌ చైర్మన్‌, పార్టీ జిల్లా ఇన్‌చార్జి బ ండ ప్రకాశ్‌ మాట్లాడుతూ దీక్షా దివస్‌ అల్గునూర్‌లో జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. కేటీఆర్‌ నాయకత్వంలో మరో ఉద్యమానికి అల్గునూర్‌ వేదిక కానుందని చెప్పారు.

- మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ మాట్లాడుతూ అల్గునూర్‌చౌరస్తాకు కేటీఆర్‌ రాగానే ఆయన కళ్లలో నీళ్లు తిరిగాయన్నారు. ఆయన ఎప్పుడు కంట తడిపెట్టరని, కేసీఆర్‌ ఇక్కడ ఆమరణ దీక్ష చేపట్టేందుకు వెళ్తున్న సమయంలో అల్గునూర్‌లో అరెస్టు చేయడం, ఆ అరెస్టు ఉద్యమాన్ని కీలకం చేసి స్వరాష్ట్ర ఏర్పాటుకు నాంది అయిందని, అందుకే భావోద్వేగంతో కేటీఆర్‌ కళ్లలో నీళ్లు తిరిగాయని చెప్పారు మహాదీక్ష ఇక్కడి నుంచి ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు.

- మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ మాట్లాడుతూ నీళ్లు నిధులు, నియామకాలు మలిదశ ఉద్యమంలో కీలకపాత్ర పోషించాయని అన్నారు.

బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో మేయర్‌ యాదగిరి సునీల్‌రావు, జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌, బీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్లు ఏనుగు రవీందర్‌రెడ్డి, పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్‌, సిద్ధం వేణు, కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, మైఖేల్‌ శ్రీను పాల్గొన్నారు.

Updated Date - Nov 30 , 2024 | 12:06 AM