గ్రంథాలయాలను వినియోగించుకోవాలి
ABN , Publish Date - Nov 21 , 2024 | 12:29 AM
విద్యార్థులు గ్రంథాలయాలను వినియోగించుకోవాలని, పుస్తక పఠనంతోనే విజ్ఞానవంతులవుతామని టీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జరిగిన 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
కరీంనగర్ కల్చరల్, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు గ్రంథాలయాలను వినియోగించుకోవాలని, పుస్తక పఠనంతోనే విజ్ఞానవంతులవుతామని టీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జరిగిన 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నేటి కాలంలో సెల్‌ఫోన్‌లు, టీవీలు, సినిమాలకే అతుక్కపోతున్నారని, అవి మంచివేనని కానీ జీవితంలో అంతర్భాగమే తప్ప పరమావధి కావని అన్నారు. తాము కూడా గ్రంథాలయాలను సందర్శించి చదువుకొని ఈ స్థానంలో ఉన్నామని అన్నారు. నూతనంగా ఎంపికైన సంస్థ అధ్యక్షుడు సత్తు మల్లేశంను అభినందనలు తెలుపుతున్నాని, సిబ్బంది ఇంత గొప్పగా ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞానాలయాలని, ఎవరూ దొంగిలించనిది విద్య అని అన్నారు. ఆ విద్య విద్యాలయాలతో పాటు గ్రంథాలయాల్లో లభిస్తుందని అన్నారు. గ్రంథాలయానికి, విద్యార్థులకు టీఎన్‌జీవో పక్షాన తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని అన్నారు. అనంతరం వారం రోజుల పాటు పాఠశాల, కళాశాల విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. గ్రంథాలయ కార్యదర్శి ఎ సరిత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పోటీల న్యాయనిర్ణేతలు, బాలభవన్ సూపరెండెంట్ కట్ట మంజులాదేవి, ఉపాధ్యాయులు కె శ్రీధర్, సూర్యశ్రీ, గాయకు రాలు కల్వకోట వీణ, సిబ్బంది జి సరిత, జె గౌతమి, కె మల్లయ్య, పద్మావతి, రాజమల్లు, పి నాగభూషణం, టీఎన్‌జీవో రాష్ట్ర, జిల్లా నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.