వైభవంగా కార్తీక పౌర్ణమి
ABN , Publish Date - Nov 16 , 2024 | 12:08 AM
జిల్లాలో శుక్రవారం కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. భక్తులు ఉదయం నదీ స్నానాలు ఆచరించారు.
కరీంనగర్ కల్చరల్, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో శుక్రవారం కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. భక్తులు ఉదయం నదీ స్నానాలు ఆచరించారు. అనంతరం సత్యనారాయణ స్వామి వ్రతాలు, దీపదానాలు చేశారు. పలు ఆలయ ప్రాంగణాలు భక్తులతో కిటకిటలాడాయి. తులసి కోటల వద్ద, ఆలయాల్లో దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. జ్వాలా తోరణం, ఆకాశదీపాది పూజల్లో పాల్గొన్నారు. ఆలయాల్లో, ఇళ్ళలో సందడి నెలకొంది. ఈ సందర్భంగా ఆలయాల్లో అధికారులు, నిర్వాహకులు, సిబ్బంది భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
కన్నుల పండువగా జ్వాలా తోరణం
కరీంనగర్ రూరల్, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం కరీంనగర్ మండలం నగునూర్ గ్రామంలోని దుర్గా భవానీ దేవాయలంలో కార్తీక మాసం పూజల్లో విశిష్టమైన జ్వాలా తోరణోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఆలయ ధర్మాఽధికారి, వేద పండితులు పురాణం మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో నిర్వహించగా ఆలయ మాడ వీధుల్లో కోలాటాలు, భజనలతో అమ్మవారిని పల్లకిలో ఊరేగించి జ్వాలా తోరణ ప్రవేశం చేయించారు. ఉదయం అమ్మవారికి అభిషేకం, విశేష పూజలు చేసి విశేష హరతులు ఇచ్చారు. సాయంత్రం జ్వాలాతోరణోత్సవం అనంతరం సహస్ర దీపారాధన, అమ్మవారికి అభిషస్త్రకం, విశేష పూజలు చేసి విశేష హరతులు, ప్రత్యేక పూజలు, ఉయ్యాల సేవలను నిర్వహించారు. ఈ పూజల్లో ఆలయ ఫౌండర్ చైర్మన్ వంగల లక్ష్మణ్, కమిటీ బాధ్యులు వేముల వాడ ద్రోణాచార్య, నీరుమల్ల తిరుపతి, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు
కరీంనగర్ కల్చరల్, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): నగరంలోని పలు ఆలయాల్లో సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అశోక్‌నగర్ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఉచితంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పారువెల్ల ఫణిశర్మ వైదిక నిర్వహణలో జరిగిన వ్రతాల్లో 130 మంది దంపతులు పాల్గొన్నారు. వెయ్యి మందికి అన్నప్రసాద వితరణ జరిగింది. వ్రతాల్లో ఆలయ అధ్యక్ష కార్యదర్శులు చిట్టుమల్ల శ్రీనివాస్, కాచం రాజేశ్వర్, కోశాధికారి బొల్లం లింగమూర్తి, సంకటహర చతుర్థి కన్వీనర్ రాచమల్ల భద్రయ్య పాల్గొన్నారు. బొమ్మకల్ రోడ్ యజ్ఞవరాహక్షేత్రంలోని రమాసత్యనారాయణస్వామికి జరిగిన అభిషేక పూజలు, సామూహిక వ్రతాల్లో సర్వవైదికసంస్థానంట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ శ్రీభాష్యం వరప్రసాదశర్మ, సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. రాంనగర్ రమాసత్యనారాయణస్వామి ఆలయంలో వ్రతాలు, అన్నదానం జరిగాయి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి హరిశంకర్, ఆలయ కమిటీ గౌరవాధ్యక్షుడు మల్లికార్జున రాజేందర్, చైర్మన్ చల్ల హరికృష్ణ పాల్గొన్నారు.