Share News

అంగన్‌వాడీలకు మహర్దశ

ABN , Publish Date - Nov 18 , 2024 | 01:04 AM

అంగన్‌వాడీ కేంద్రాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్తరూపు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటాయి. కార్పొరేట్‌ కిడ్స్‌ స్కూల్స్‌ తరహాల్లో అంగన్‌వాడీ కేంద్రాలను మార్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ప్రస్తుత అంగన్‌వాడీ కేంద్రాలను అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి.

అంగన్‌వాడీలకు మహర్దశ

- పూర్వ ప్రాథమిక పాఠశాలలుగా మార్పు

- కార్పొరేట్‌ తరహాలో ఏర్పాట్లు

- జిల్లాలో 36 కేంద్రాల ఎంపిక

- చిన్నారులకు మౌలిక వసతుల కల్పన

గణేశ్‌నగర్‌, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ కేంద్రాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్తరూపు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటాయి. కార్పొరేట్‌ కిడ్స్‌ స్కూల్స్‌ తరహాల్లో అంగన్‌వాడీ కేంద్రాలను మార్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ప్రస్తుత అంగన్‌వాడీ కేంద్రాలను అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. గ్రామీణ స్థాయిలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇప్పటికే పౌష్టికాహార ప్రాధాన్యం, పిల్లలు, గర్భిణులు, బాలింతలకు సేవలందిస్తూ పిల్లలకు ప్రీ స్కూల్‌ విద్యను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా వికలాంగుల, వయో వృద్ధులు, మహిళా, శిశు సంక్షేమ శాఖ ద్వారా నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలన్నింటినీ కార్పొరేట్‌ కిడ్స్‌ స్కూల్‌ స్థాయిలో అత్యాధునిక హంగులు కల్పించడానికి చర్యలు చేపట్టింది.

ఫ ఆధునీకరణ ప్రారంభం

అంగన్‌వాడీ కేంద్రాలను ఆధునీకరించేందుకు జిల్లాలో మొదటి దశలో 342 కేంద్రాలను ఎంపిక చేశారు. వాటిని ఆధునీకరించి మెరుగైన వసతులు కల్పించడానికి పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో పనులు చేపట్టారు. తొలుత సొంత భవనాలు ఉన్న కేంద్రాలను అధునాతనంగా తీర్చిదిద్దుతున్నారు. అద్దె భవనాల్లో నడుస్తున్న వాటికి మాత్రం నూతన భవన నిర్మాణ సమయంలోనే తీర్చిదిద్దాలని నిర్ణయించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో 3 నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లలు చదువుతున్నారు. వీటిని కార్పొరేట్‌ కిడ్స్‌ పాఠశాలల మాదిరిగా తీర్చిదిద్దడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఫ అన్ని హంగులతో....

భవనాలకు రంగులు వేయించడం, తరగతి గదిలో చిన్నారులను ఆకట్టుకునేలా బొమ్మల పెయింటింగ్‌ మరుగుదొడ్ల నిర్మాణం, సురక్షిత తాగునీటి సౌకర్యం కల్పించేందుకు రెడీ అయ్యారు. కొత్తగా ఫర్నీచర్‌ను సమకూర్చనున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలను కిడ్స్‌ పాఠశాలలుగా మార్చడానికి ఒక్కో కేంద్రానికి 30 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. పనుల నిర్వహణ తీరును కలెక్టర్‌తోపాటు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో 33 కేంద్రాల్లో ఆధునిక హంగుల పనులు చేపట్టిన అధికారులు త్వరలో పూర్తి చేసి ప్రారంభించేందుకు సమాయత్తమయ్యారు.

ఫ జిల్లాలో మొత్తం 777 అంగన్‌వాడీ కేంద్రాలు

జిల్లాలో మొత్తం 777 అంగన్‌వాడీ కేంద్రాలుండగా వాటిలో 44.006 మంది పిల్లలున్నారు. కేంద్రాల్లో 291 కేంద్రాలకు మాత్రమే శాశ్వత భవనాలున్నాయి. మిగతావి అద్దె భవనాల్లో, ప్రైవేట్‌ భవనాల్లో కొనసాగుతున్నాయి. మొదటి దశలో 36 అంగన్‌వాడీ కేంద్రాలకు 30 వేల రూపాయల నిధులు వెచ్చించి పనులు నిర్వహిస్తున్నారు. తొలి దశలో సొంత భవనాలు ఉన్న వాటిని ఎంపిక చేసి తరువాత అద్దె భవనాల్లో కొనసాగుతున్న వాటికి అన్ని హంగులతో కొత్త భవనాలు నిర్మిస్తారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో జాతీయ పాఠ్య ప్రణాళిక ప్రకారం సెలబస్‌ మార్చారు. ఈ సంవత్సరం నుంని కేంద్రాల్లో జాతీయ పాఠ్య ప్రణాళిక ప్రకారం బోధిస్తారు.

ఫ పిల్లలను ఆకర్షణీయమైన దుస్తులు

అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులను ఆకర్షించేందుకు పలు రకాల డిజైన్లలో ఏకరూప దుస్తులను ప్రభుత్వం ఎంపిక చేసింది. బాలికలకు ఫ్రాక్‌, బాలురకు నిక్కర్‌, షర్టు ఇవ్వనున్నారు. మొదటి దశలో 13,048 మంది పిల్లలకు రెండు జతల యూనిఫామ్స్‌ కుట్టించారు.

Updated Date - Nov 18 , 2024 | 01:04 AM