Share News

నత్తనడకన ‘ఎల్‌ఆర్‌ఎస్‌’

ABN , Publish Date - Oct 23 , 2024 | 01:10 AM

అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్‌) దరఖాస్తుల క్లియరెన్సు నత్తనడకన సాగుతోంది. ల్యాండ్‌ రెగ్యులరైజేషన్‌ స్కీంపై ప్రత్యేక దృష్టి పెట్టి మూడు మాసాల్లో పెండింగ్‌ దరఖాస్తులన్నిటినీ క్లియర్‌ చేయాలంటూ రాష్ట్ర పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి ఎం.దానకిషోర్‌ జూలై 31న ఆదేశాలు జారీ చేశారు.

నత్తనడకన ‘ఎల్‌ఆర్‌ఎస్‌’

22కెఎన్‌ఆర్‌-22

---------------

- అధికారుల మధ్య సమన్వయ లోపం

- మూడు నెలల్లో వేయి దరఖాస్తుల పరిష్కారం

- పెండింగ్‌లో 68,556 దరఖాస్తులు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్‌) దరఖాస్తుల క్లియరెన్సు నత్తనడకన సాగుతోంది. ల్యాండ్‌ రెగ్యులరైజేషన్‌ స్కీంపై ప్రత్యేక దృష్టి పెట్టి మూడు మాసాల్లో పెండింగ్‌ దరఖాస్తులన్నిటినీ క్లియర్‌ చేయాలంటూ రాష్ట్ర పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి ఎం.దానకిషోర్‌ జూలై 31న ఆదేశాలు జారీ చేశారు. అలాగే అందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా విడుదల చేశారు. దీనితో గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో పెండింగ్‌లో ఉన్న ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల క్లియరెన్సులో కదలిక మొదలైంది.

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను మున్సిపల్‌, గ్రామపంచాయతీ టౌన్‌ప్లానింగ్‌, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు పరిశీలన చేసి ప్రభుత్వ, చెరువుకుంటల పరిధిలోకి ఆయా స్థలాలు రావంటూ క్లియరెన్సు ఇచ్చిన తర్వాతనే ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా ఫీజులను తీసుకొని క్లియరెన్సు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లాలో ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం 68,556 మంది చేసుకున్న దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని క్లస్టర్లుగా విభజించుకొని అక్టోబర్‌ నెలాఖరువరకు వాటిని పరిశీలించి ఎల్‌ఆర్‌ఎస్‌కు అర్హత కల వాటిని క్రమబద్ధీకరించాలని పేర్కొన్నారు. మిగిలిన వాటిని ఎందుకు తిరస్కరించారనే విషయాన్ని తెలుపుతూ దరఖాస్తుదారులకు సమాచారమివ్వాలని, పెండింగ్‌ దరఖాస్తులన్నిటినీ క్లియర్‌ చేయాలని ఆదేశించారు. అయితే ఆగస్టు, సెప్టెంబర్‌, అక్టోబర్‌ మూడోవారం వరకు కేవలం వేయి దరఖాస్తులు మాత్రమే పరిష్కారానికి నోచుకోగా మున్సిపల్‌ టౌన్‌ప్లానింగ్‌లో 1500, రెవెన్యూశాఖలో 2,000, నీటిపారుదలశాఖలో 6,390 దరఖాస్తులు ప్రాసెస్‌లో ఉన్నట్లు సమాచారం. 2020లో అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌కు నామమాత్రంగా వేయి రూపాయలు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించడంతో కరీంనగర్‌ నగరపాలక సంస్థకు 26,850 మంది, హుజురాబాద్‌ మున్సిపాలిటీలో 3,981 మంది, జమ్మికుంటలో 5,904 మంది, చొప్పదండిలో 1,472 మంది, కొత్తపల్లి మున్సిపాలిటీలో 2,660 మంది ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

అలాగే శాతవాహన అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథార్టీ (సుడా)లో 21,162 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఎల్‌ఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌పై కొందరు కోర్టును ఆశ్రయించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎల్‌ఆర్‌ఎస్‌ నిలిచిపోయింది. మున్సిపాలిటీల్లో లే అవుట్‌ చేయని స్థలాల్ల్లో ఇళ్లు నిర్మించుకునే వారు కోర్టు తీర్పునకు లోబడి ఉంటామంటూ అఫిడవిట్‌ దాఖలు చేయడంతోపాటు 14శాతం ఫీజు చెల్లించిన వారికి ప్రభుత్వం ఇళ్లకు అనుమతి ఇస్తూ కొంత వెసులుబాటు కల్పించింది. హౌజింగ్‌ లోన్‌ తీసుకునే వారు విధిగా ఇంటి నిర్మాణానికి సంబంధించిన అనుమతి పత్రాన్ని సమర్పించాల్సి ఉండడంతో అలాంటి వారు 14శాతం ఎల్‌ఆర్‌ఎస్‌ చార్జీలు చెల్లించి అనుమతి తీసుకుంటున్నారు. ఇక 14శాతం పన్నులు చెల్లించలేని వారికి ఫీజు మొత్తాలను చెల్లించి దరఖాస్తులను క్లియర్‌ చేసుకోవాలని సూచించినప్పటికీ చాలా మంది దరఖాస్తుదారులు ముందుకు రావడం లేదు. ఈనేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను క్లియర్‌ చేయడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం రావడంతో పాటు దరఖాస్తుదారులకు మేలు జరుగుతుందని ఆలోచించి గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మాదిరిగానే 14శాతం ఫెనాల్టీ వసూలు చేస్తూ ఎల్‌ఆర్‌ఎస్‌ పెండింగ్‌ దరఖాస్తులన్నిటినీ మూడు మాసాల్లో క్లియర్‌ చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది.

డిసెంబర్‌లోగా ఆర్జీలన్నీ క్లియర్‌ అయ్యేనా?

అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ తాము అధికారంలోకి వస్తే ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను ఫెనాల్టీ లేకుండా క్లియర్‌ చేస్తామని ప్రకటించినందున మళ్లీ గతంలో మాదిరిగా ఫెనాల్టీ వేయడం సరికాదని, ఉచితంగా ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులన్నిటికీ క్లియర్‌ చేయాలని ప్రతిపక్షపార్టీలు డిమాండ్‌ చేశాయి. అయితే ప్రభుత్వం ఫీజు మాఫీ విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదుకానీ జిల్లా కలెక్టరేట్లు, స్థానిక సంస్థల కార్యాలయాల్లో సహాయ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలని సూచించింది. ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను ముందుగా సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ పరిశీలించి నిబంధనల ఆధారంగా వాటిని వడపోస్తుంది. ఆయా ఆస్తులు నిషేధిత జాబితాలో ఉంటే గుర్తించి దరఖాస్తుదారులకు సమాచారం పంపుతుంది. అలాగే దరఖాస్తుదారులు పూర్తిస్థాయి పత్రాలు ఇవ్వకుంటే వాటిని సమర్పించాలనే సమాచారాన్ని ఇస్తుంది. అనంతరం దరఖాస్తులను రెవెన్యూ, నీటిపారుదల, టౌన్‌ప్లానింగ్‌, పంచాయతీ అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తుంది. రెండో దశలో నిర్ధారిత ఫీజు చెల్లించాల్సిందిగా నోటీసు జారీ చేస్తారు. అలాగే అనర్హత కలిగిన దరఖాస్తులను తిరస్కరిస్తారు. మూడో దశలో దరఖాస్తుదారులు ఫీజు చెల్లించి అవసరమైన పత్రాలను సమర్పిస్తే మున్సిపల్‌ టౌన్‌ప్లానింగ్‌ విభాగం అధికారులు ఇళ్ల నిర్మాణాలకు అనుమతి ఇస్తారు. అలాగే స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు ఆధ్వర్యంలోని అధికారులు వాటిని పరిశీలించి లే అవుట్‌ పర్మిషన్లను జారీ చేస్తారు. అయితే వివిధశాఖల అధికారుల మధ్య సమన్వయలోపం, దరఖాస్తుదారుల నుంచి స్పందన లేకపోవడంతో ఎల్‌ఆర్‌ఎస్‌ ముందుకు సాగడం లేదు. కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ జిల్లా పరిధిలోని మున్సిపల్‌, రెవెన్యూ, ఇరిగేషన్‌ శాఖల అధికారులతో ఎల్‌ఆర్‌ఎస్‌పై సమీక్ష నిర్వహించి డిసెంబర్‌లోగా దరఖాస్తులన్నీ క్లియర్‌ చేయాలని ఆదేశించారు. దీనితో అధికారులు మళ్లీ ఎల్‌ఆర్‌ఎస్‌పై దృష్టిసారిస్తున్నారు. రెండున్నర నెలల్లో ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులెన్ని పరిష్కరిస్తారో చూడాలి.

Updated Date - Oct 23 , 2024 | 01:11 AM