ఆందోళన బాటలో..
ABN , Publish Date - Nov 20 , 2024 | 12:51 AM
ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాలు బంద్ బాటపట్టాయి. ఈనెల 20 నుంచి నిరవధిక బంద్ పాటించాలని నిర్ణయించుకున్నాయి. బకాయిల చెల్లింపు కోసం ప్రభుత్వాన్ని పలుమార్లు కోరినా ఉన్నతాధికారుల హామీలు అమలుకు నోచుకోకపోవడంతో కళాశాలలు మూసివేయడం మినహా మరో మార్గం లేదని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు నిర్ణయించుకున్నాయి.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాలు బంద్ బాటపట్టాయి. ఈనెల 20 నుంచి నిరవధిక బంద్ పాటించాలని నిర్ణయించుకున్నాయి. బకాయిల చెల్లింపు కోసం ప్రభుత్వాన్ని పలుమార్లు కోరినా ఉన్నతాధికారుల హామీలు అమలుకు నోచుకోకపోవడంతో కళాశాలలు మూసివేయడం మినహా మరో మార్గం లేదని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు నిర్ణయించుకున్నాయి. మంగళవారం శాతవాహన యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ను కలిసి యాజమాన్యాల సంఘం బంద్ నోటీసును ఇచ్చాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో 35 ప్రైవేట్ పీజీ కళాశాలలు, 66 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 45 నుంచి 50వేల మంది విద్యార్థులు డిగ్రీని, ఐదు వేల మంది విద్యార్థులు పీజీ కోర్సుల్లో విద్యనభ్యసిస్తున్నారు. ప్రభుత్వం ఈ విద్యార్థులకు ఇచ్చే ఫీజు రీఎంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. 2021-22 విద్యాసంవత్సరం నుంచి ఇప్పటి వరకు సుమారు 250 కోట్ల రూపాయలు ప్రభుత్వం ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలకు చెల్లించాల్సి ఉన్నది. కళాశాలల యాజమాన్యాలు టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి వేతనాలు చెల్లించలేని పరిస్థితికి చేరుకున్నాయి. కళాశాలల భవనాల అద్దెను కూడా చెల్లించలేకపోతున్నాయి.
ఫ ఇబ్బందుల్లో సిబ్బంది
కళాశాలల్లో సుమారు 5,500 మంది టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. నాలుగైదు నెలలుగా వేతనాలు అందక పోవడంతో వేతన జీవులు కూడా ఇల్లు అద్దె చెల్లించలేక, ఇతర అవసరాలు తీర్చుకునే మార్గం లేక తమ పిల్లల స్కూల్ ఫీజులు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేతనాల కోసం యాజమాన్యాలపై ఒత్తిడి తెస్తే ఉద్యోగం ఉంటుందో, ఊడుతుందో తెలియని పరిస్థితిలో వారు ఆవేదనకు గురవుతున్నారు. బకాయిల చెల్లింపునకు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ గత అక్టోబరులోనే ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చాయి. అప్పుడు ప్రభుత్వం పక్షాన విద్యాశాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలతో చర్చించి వారంరోజుల్లోగా బకాయిలు విడుదల చేయిస్తామని హామీ ఇచ్చారు. నెలరోజులు గడిచినా బకాయిలు విడుదల చేయకపోవడంతో మళ్లీ ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు 20 నుంచి కళాశాలలను నిరవధికంగా మూసివేయాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు సంఘం నాయకులు శాతవాహన యూనివర్సిటీ వైస్ చాన్సలర్‌కు లేఖను అందించారు.
ఫ పరీక్షలూ నిర్వహించలేని పరిస్థితి
కళాశాలలు నిర్వహిస్తున్న భవనాల అద్దెను చెల్లించలేక పోవడంతో తమపై తీవ్ర ఒత్తిడి పెరిగిందని యజమాన్యాలు అంటున్నాయి. జీతాలు ఇవ్వని కారణంగా సిబ్బంది తమకు సహకరించడం లేదని, ఆర్థిక సమస్యలతో తాము కళాశాలలను నడపలేని స్థితికి చేరుకున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. సెమిస్టర్ పరీక్షలను కూడా నిర్వహించలేమని యాజమాన్యాలు తేల్చిచెప్పాయి. రెండేళ్ల ఫీజు రీ యింబర్స్‌మెంట్ రాకపోవడంతో విద్యా సంవత్సరం ప్రారంభంలోనే కొన్ని కళాశాలలు మూతపడ్డాయి. మరికొన్ని కళాశాలలదీ అదే పరిస్థితి.
ఫ ప్రభుత్వం స్పందించాలంటున్న విద్యార్థులు, తల్లిదండ్రులు
పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో కళాశాలలు నిరవధిక బంద్ పాటిస్తే తమ భవిష్యత్ ఏమిటనీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు సకాలంలో ఇస్తే తమకు ఈ పరిస్థితి వచ్చేది కాదని, ఇప్పటికైనా ప్రభుత్వం తమ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని బకాయిలు విడుదల చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే డిగ్రీ, పీజీ సీట్లు కూడా పూర్తిగా నిండడం లేదని, భవిష్యత్‌పై ఆశలతో కళాశాలలు నడుపుతున్నామని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఇవ్వకుంటే ప్రత్యామ్నాయం చూసుకోవలసిందేనంటూ కళాశాలల నిర్వహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఫ బకాయిలు చెల్లిస్తేనే కళాశాలలను తెరుస్తాం
- వెంకటేశ్వర్‌రావు, ఎస్‌యూ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు
ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లిస్తేనే కళాశాలలను తెరుస్తాం. బకాయిల కారణంగా కళాశాలలను నడపలేని తప్పనిసరి పరిస్థితి వచ్చింది. విధిలేకనే నిరవధిక బంద్ నిర్ణయం తీసుకున్నాము. విద్యార్థులను ఇబ్బంది పెట్టాలనే ఆలోచన లేదు. కళాశాలల నిర్వహణ కోసం తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక పోతున్నాం. విద్యార్థులను ఫీజులు అడిగే పరిస్థితి లేదు. సిబ్బందికి వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. కళాశాలలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. అద్దె చెల్లించకపోవడంతో భవనాలకు యజమానులు తాళం వేస్తామని బెదిరిస్తున్నారు. పరిస్థితి చేయి దాటడంతోనే బంద్ పాటిస్తున్నాం. వెంటనే ఫీజు రీ యింబర్స్‌మెంట్‌బకాయిలు విడుదల చేయాలి.
ఫ బకాయిల విడుదలలో నిర్లక్ష్యం సరికాదు ...
- మణికంఠరెడ్డి, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయక పోవడంతో కళాశాలల యాజమాన్యాలు బంద్ పాటించి పరీక్షలు బహిష్కరిస్తామనే స్థితి వచ్చింది. ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే ఈ పరిస్థితులు వచ్చాయి. విద్యార్థుల చదువులతో, జీవితాలతో చెలగాటమాడడమే. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి అధికారంలోకి రాగానే ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేస్తామని చెప్పారు. ఇచ్చిన మాటను నెరవేర్చుకోవడానికి వెంటనే ఫీజు, స్కాలర్‌షిప్ బకాయిలను విడుదల చేయాలి.