Share News

నగరంలో పెట్రోలింగ్‌ ముమ్మరం

ABN , Publish Date - Dec 27 , 2024 | 12:30 AM

నూతన సంవత్సర వేడుకలకు సన్నద్ధమవుతున్న వేళ ఎలాంటి అపశృతులు దొర్లకుండా పోలీసులు పకడ్బందీగా భద్రతా చర్యలు చేపడుతున్నారు.

నగరంలో పెట్రోలింగ్‌ ముమ్మరం

కరీంనగర్‌ క్రైం, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): నూతన సంవత్సర వేడుకలకు సన్నద్ధమవుతున్న వేళ ఎలాంటి అపశృతులు దొర్లకుండా పోలీసులు పకడ్బందీగా భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఇటీవల నగరంలో రోడ్లపై బర్త్‌డే వేడుకలను నిర్వహించడం పెరిగిపోయింది. ఈ వేడుకల్లో శృతి మించి నృత్యాలు చేయడం, మద్యం మత్తులో గొడవలు పడటం, మారణాయుధాలను ప్రదర్శించటం వంటివి చోటు చేసుకుంటుండంతో సీపీ అబిషేక్‌ మొహంతి చర్యలకు ఉపక్రమించారు. నగరంలోని ప్రధాన రహదారులు, ఆర్టీసీ బస్లాండ్‌ వద్ద, ముఖ్య కూడళ్లలో కొందరు యువకులు గుంపులు గుంపులుగా జమకూడడం, గంజాయి, మద్యం మత్తులో గొడవలకు దిగడం వంటివి జరుగుతున్నాయి. వీటన్నింటిని అరికట్టేందుకు రాత్రి 9 గంటల నుంచి తెల్లవరుజాము వరకు నగరమంతటా పెట్రోలింగ్‌ను ముమ్మరం చేశారు. ఇదివరకు ఒక సీఐ లేదా ఏసీపీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో పోలీసులు పెల్రోలింగ్‌ నిర్వహిస్తుండేవారు. 10 రోజులుగా నాలుగు అంచెల్లో నైట్‌ డ్యూటీ ఆఫీసర్‌, నైట్‌ రౌండ్‌ ఆఫీసర్‌, నైట్‌ పెట్రోలింగ్‌ ఆఫీసర్‌, నైట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌లో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి రోడ్లపై, కూడళ్లలో గుంపులుగా కనిపించినవారిని పట్టుకుని కేసులు నమోదు చేసి, కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. నలుగురు పోలీసు అధికారుల ఆధ్వర్యంలో నాలుగు పోలీసు బృందాలు నగరమంతటా రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు బ్రీత్‌ ఎనలైజర్‌ పరికరాలతో డ్రంకెన్‌ డ్రైవ్‌ పరీక్షలు, ఫింగర్‌ప్రింట్‌ డివైజ్‌తో పాత నేరస్థుల తనిఖీలు, వాహనాల తనిఖీలు, బస్టాండ్‌లో ఆకస్మికంగా తనిఖీలను నిర్వహిస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ధ్రువ పత్రాలు లేని, నంబర్‌ప్లేట్లు లేని వాహనాలను పట్టుకుని స్టేషన్లకు తరలించి వాహన యజమానులపై కేసులు నమోదు చేస్తున్నారు. నూతన సంవత్సరం వేడుకల్లో అర్ధరాత్రి నుంచి తెల్లవారు జాము వరకు యువకులు మద్యం సేవిస్తూ రోడ్లపై నృత్యాలు చేయటం, వాహనాలతో వేగంగా వెళ్లటం, ప్రమాదాల బారినపడడం తరచుగా జరుగుతుండేది. ఇటువంటి సంఘటనలు జరుగకుండా పోలీస్‌ కమిషనర్‌ ముందస్తు చర్యలు చేపట్టారు. అర్ధరాత్రి సమయాల్లో రోడ్లపై అవసరం లేకుండా సంచరిస్తున్న వ్యక్తులను పట్టుకుని స్టేషన్లకు తరలిస్తూ కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. రెండోసారి అదే వ్యక్తి కనబడితే కేసులు నమోదు చేస్తున్నారు.

Updated Date - Dec 27 , 2024 | 12:30 AM