పత్తిపాక రిజర్వాయర్‌కు మోక్షం..
ABN , Publish Date - Nov 24 , 2024 | 01:09 AM
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిని జిల్లాకు అందించేందుకు ఎప్పటినుంచో ప్రతిపాదనలో ఉన్న పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణానికి మోక్షం లభించనున్నది. ఆదివారం జిల్లాకు చెందిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పత్తిపాక సందర్శించనున్నారు.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిని జిల్లాకు అందించేందుకు ఎప్పటినుంచో ప్రతిపాదనలో ఉన్న పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణానికి మోక్షం లభించనున్నది. ఆదివారం జిల్లాకు చెందిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు చింతకుంట విజయరమణారావు, రాజ్‌ఠాకూర్ మక్కాన్ సింగ్, నీటి పారుదల శాఖాధికారులతో కలిసి ధర్మారం మండలం పత్తిపాక సందర్శించనున్నారు. ప్రతిపాదిత నిర్మాణ ప్రాజెక్టు స్థలాన్ని పరిశీలించనున్నారు. ఈనెల 20న, వేములవాడలో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి, రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జీ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పలువురు మంత్రులు హాజరైన విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లాలో పెండింగులో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పనులతో పాటు పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం చేపడతామని కూడా ప్రకటించారు. వారం, పది రోజుల్లో ఉమ్మడి జిల్లాలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించి సాగునీటి ప్రాజెక్టుల గురించి చర్చిస్తామన్నారు. ఈ సందర్భంగా పత్తిపాక రిజర్వాయర్ గురించి కూడా చర్చించే అవకాశాలున్నాయి. ఆ సమావేశానికంటే ముందే ప్రతిపాదిత పత్తిపాక రిజర్వాయర్ స్థలాన్ని పరిశీలించనున్నారు. ఎంత సామర్థ్యంతో రిజర్వాయర్‌ను నిర్మించాలి, ఎన్ని ఎకరాల భూములు ముంపునకు గురికానున్నాయి, ఇందులో ప్రభుత్వ భూములు ఎన్ని, పట్టా భూములు ఎన్ని, తదితర అంశాలపై చర్చించనున్నారు. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి నీటి పారుదల శాఖాధికారులు ప్రాథమికంగా ప్రతిపాదనలు రూపొందించారు. 7.78 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌ను నిర్మిస్తే, 1,700 ఎకరాల భూములు ముంపునకు గురికానున్నాయని ఒక అంచనాకు వచ్చారు. ఇందులో 400 ఎకరాల అటవీశాఖ భూములు కాగా, 1300 ఎకరాల పట్టా భూమిని సేకరించాల్సి ఉంటుంది. ఈ రిజర్వాయర్ నిర్మాణం పూర్తయితే జిల్లా రైతుల చిరకాల వాంఛ నెరవేరనున్నది.
ఫ ప్రతిపాదనలకే పరిమితం..
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని లక్షా 80 వేల ఎకరాల భూములకు సాగునీరు అందుతున్నది. ఎస్సారెస్సీ నీటిని వారబంధి పద్ధతిన పంటలకు విడుదల చేస్తూ ఉంటారు. కాల్వ చివరి భూములైన ఓదెల, కాల్వశ్రీరాంపూర్, ముత్తారం, రామగిరి, మంథని, రామగుండం మండలాల్లోని చివరి ఆయకట్టు భూములకు సక్రమంగా నీరందక పంటలు ఎండిపోతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన కాలేశ్వరం ప్రాజెక్టు నీటిని జిల్లాలోని ఎస్సారెస్పీ ఆయకట్టు భూములకు అందించి స్థిరీకరణ చేసేందుకు ధర్మారం మండలం పత్తిపాక వద్ద ఒక రిజర్వాయర్‌ను నిర్మించాలని ప్రతిపాదించారు. ఐదు టీఎంసీలు లేదా పది టీఎంసీల సామర్థ్యంతో చేపట్టాలని భావించారు. మొదట 1.56 టీఎంసీల సామర్థ్యంతో ఒక ప్రతిపాదన, ఏడు టీఎంసీల సామర్థ్యంతో మరొక ప్రతిపాదనను నీటిపారుదల శాఖ అధికారులు రూపొందించారు. కానీ ప్రభుత్వం పత్తిపాక రిజర్వాయర్ను చేపట్టేందుకు ముందుకు రాలేదు. దీనికి ప్రత్యామ్నాయంగా వరద కాలువ నుంచి ఎస్సారెస్పీ కాలువకు మధ్య మూడు కిలోమీటర్ల వరకు కాలువను నిర్మించారు. అయితే దీని ద్వారా రైతులకు శాశ్వత పరిష్కారం లభించడం లేదు. గాయత్రి పంప్‌హౌస్ నుంచి వరద కాలువ ద్వారా మిడ్ మానేరుకు నీటిని తరలించినప్పుడు మాత్రమే లింకు కాలువ ద్వారా సాగునీరు అందనున్నది. అయితే ఇది తాత్కాలికమే. శాశ్వత పరిష్కారం రైతులకు లభించాలంటే పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం తప్పనిసరి చేపట్టాల్సిందే.
ఫ ప్రభుత్వం సానుకూలం..
ఆరు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాను గెలిస్తే పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం చేపట్టి రైతుల చిరకాల వాంఛను నెరవేరుస్తానని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సైతం పత్తిపాక నిర్మాణం చేపట్టాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఈ మేరకు 3 మాసాల క్రితం మంత్రి శ్రీధరాబాబుతో కలిసి ఎమ్మెల్యేలు విజయరమణారావు, రాజాకూర్ మక్కాన్‌సింగ్ కలిసి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తదితరులకు విన్నవించారు. పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణంపై ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసింది. దీనిపై సంబంధిత నీటి పారుదల శాఖాధికారులతో ఎమ్మెల్యే విజయరమణారావు చర్చించారు. ధీకొండ వద్ద గల పైప్ లైన్ నుంచి రిజర్వాయర్‌లోకి నీటిని సరఫరా చేసుకుని, అక్కడి నుంచి ఎస్సారెస్సీ డి- 83, 86 కాలువలకు గ్రావిటీ ద్వారా నీటిని సరఫరా చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ రిజర్వాయర్ నిర్మాణం పూర్తయితే, ఒక్క జిల్లాలోగల లక్షా 80 వేల ఎకరాల ఆయకట్టుతో పాటు జగిత్యాల జిల్లా వెల్గటూర్, కరీంనగర్ జిల్లా కరీంనగర్, చొప్పదండి నియోజకవర్గాల్లోని మరో 50 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరగనున్నది. త్వరితగతిన రిజర్వాయర్ డీపీఆర్ రూపొందించి నిధులు మంజూరు చేయాలని ఈ ప్రాంత రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.