Share News

అమరుల స్ఫూర్తితో ప్రజలకు మరింత సేవచేయాలి

ABN , Publish Date - Oct 22 , 2024 | 12:13 AM

శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణత్యాగం చేసి అమరుల స్ఫూర్తితో ప్రజలకు మరింత సేవ చేయాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ అన్నారు. సోమవారం రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌లో పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమర జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు.

అమరుల స్ఫూర్తితో ప్రజలకు మరింత సేవచేయాలి
జ్యోతి వెలిగిస్తున్న సీపీ శ్రీనివాస్‌, మంచిర్యాల కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

- పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేము

- సీపీ శ్రీనివాస్‌

కోల్‌సిటీ, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణత్యాగం చేసి అమరుల స్ఫూర్తితో ప్రజలకు మరింత సేవ చేయాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ అన్నారు. సోమవారం రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌లో పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమర జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీ శ్రీనివాస్‌ మాట్లాడుతూ పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేమని, వ్యవస్థ సాఫీగా సాగడంలో పోలీసులది కీలకపాత్ర అన్నారు. మావోయిస్టులతో, అసాంఘిక శక్తులతో జరిగిన పోరులో అమరులైన పోలీసుల త్యాగాలు మరువలేనివని పేర్కొన్నారు. ప్రాణం కంటే ప్రజలు, దేశ రక్షణ, విధి నిర్వహణ గొప్పదని చాటిన అమరుల త్యాగాలు చిరస్మరణీయమన్నారు. వారి త్యాగాలను స్మరించుకునేం దుకే సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ మాట్లాడుతూ సరిహద్దు రక్షణలో జవాన్లు పనిచేస్తే సమాజ రక్షణలో పోలీసులు పని చేస్తున్నారన్నారు. నిత్యం పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా అమరుల కుటుంబాలతో సీపీ, అధికారులు మాట్లాడారు. తమ సమస్యలను వారు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.

- అమరులకు ఘనంగా నివాళులు...

విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు రామగుండం కమిషరేట్‌లో ఘనంగా నివాళులర్పించారు. రామగుండం సీపీ శ్రీనివాస్‌, మంచిర్యాల కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, డీసీపీ చేతన అమరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛం అందించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎఫ్‌సీఎల్‌ సీజీఎం ఉదయరాజ హన్స్‌, డీజీఎం(హెచ్‌ఆర్‌) సోమనాథ్‌, సింగరేణి పర్సనల్‌ మేనేజర్‌ కిరణ్‌ బాబు, సెక్యూరిటీ ఆఫీసర్‌ వీరారెడ్డి, ఎస్‌బీ ఏసీపీ రాఘవేంద్రరావు, గోదావరిఖని ఏసీపీ రమేష్‌, పెద్దపల్లి ఏసీపీ జీ కృష్ణ, మంచిర్యాల ఏసీపీ ఆర్‌ ప్రకాష్‌, జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు, రామగుండం ట్రాఫిక్‌ ఏసీపీ నర్సింహులు, టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ మల్లారెడ్డి, ఏఆర్‌ ఏసీపీ ప్రతాప్‌, సుందర్‌రావు, ఏఓ అశోక్‌కుమార్‌, పోలీస్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు బోర్లకుంట పోచలింగం, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Oct 22 , 2024 | 12:13 AM