జిల్లాలో పొలిటికల్ జోష్
ABN , Publish Date - Dec 28 , 2024 | 01:45 AM
జిల్లాలో రాజకీయం రసవత్తరంగా సాగింది. విభిన్న పరిణామాలకు తెరతీసింది. గత ప్రభుత్వ హయాంలో హవా కొనసాగించిన పలువురు నేతలు ఆయా పార్టీలకు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరారు. ప్రతిపక్షంలోకి వెళ్లిన బీఆర్‌ఎస్‌తోపాటు ఇతర పార్టీలు ఉనికిని చాటుకునే దిశగా పోరాట బాటను పట్టాయి.
జిల్లాలో పొలిటికల్ జోష్
- పార్లమెంట్ ఎన్నికలతో సందడి
- కాషాయం వైపు నిలిచిన ఓటర్లు
- కేసీఆర్ పర్యటించినా స్పీడ్ అందుకోని కారు
- నైరాశ్యంతో పదవులు వీడిన ‘స్థానిక’ ప్రజాప్రతినిధులు
- కాంగ్రెస్‌లో చేరికల పరంపర
- కొనసాగిన వామపక్షాల పోరుబాట
- ‘రాజన్న’ను దర్శించుకున్న ప్రధాని, సీఎం
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
జిల్లాలో రాజకీయం రసవత్తరంగా సాగింది. విభిన్న పరిణామాలకు తెరతీసింది. గత ప్రభుత్వ హయాంలో హవా కొనసాగించిన పలువురు నేతలు ఆయా పార్టీలకు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరారు. ప్రతిపక్షంలోకి వెళ్లిన బీఆర్‌ఎస్‌తోపాటు ఇతర పార్టీలు ఉనికిని చాటుకునే దిశగా పోరాట బాటను పట్టాయి. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌కు నిరాశను కలిగించాయి. స్థానిక సంస్థల ప్రతినిధులు నైరాశ్యంతో ఇంటి దారి పట్టారు. మరోవైపు రాజకీయాల్లో కొత్త రంగులు పులుముకుంటూ కక్ష సాధింపులు, మొదలయ్యాయనే విమర్శలు చోటు చేసు కున్నాయి. ప్రజా సమస్యలపై వామఫక్షాల పోరాటం చేశాయి. ఏడాదంతా పొలిటికల్ జోష్ కొనసాగింది. 2024 సంవత్సరం కాలచక్రంలో ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.
కొనసాగిన లోక్‌సభ ఎన్నికల సందడి
జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ సెగ్మెంట్లలో లోక్‌సభ ఎన్నికల సందడి కొనసాగింది. అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్ పట్టు సాధించాలని శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తన ఉనికిని నిలుపుకోలేక పోయింది. బీజేపీ మరోసారి లోక్‌సభ ఎన్నికల్లో బలంగా ముందుకెళ్లింది. గతంలో కంటే ఓటింగ్ శాతాన్ని పెంచుకుంది. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ గెలుపుకోసం ప్రధాని మోదీ స్వయంగా ఎన్నికల ప్రచారానికి వచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు గెలుపునకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, బీఆర్‌ఎస్ అభ్యర్థి వినోద్‌కుమార్ కోసం బీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు ప్రచారం నిర్వహించారు. రెండు పార్టీల ప్రచారం కొనసాగినా మరోసారి బండి సంజయ్ గెలుపులో సిరిసిల్ల, వేములవాడ సెగ్మెంట్‌లు ప్రధానంగా నిలిచాయి. రెండు సెగ్మెంట్లలో 2019 లోక్‌సభ ఎన్నికల్లో 2023 శాసనసభ ఎన్నికల కంటే బీజేపీ ఓటు బ్యాంక్‌ను పెంచుకుంది. బండి సంజయ్‌కి సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో 154273 ఓట్లు రాగా, బీఆర్‌ఎస్ అభ్యర్థి వినోద్‌కుమార్‌కు 1,03,953 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావుకు 69,632 ఓట్లు లభించాయి. సిరిసిల్ల సెగ్మెంట్‌లో బీజేపీకి 72,559 ఓట్లు, బీఆర్‌ఎస్‌కు 65,811 ఓట్లు, కాంగ్రెస్‌కు 33,610 ఓట్లు, వేములవాడ సెగ్మెంట్‌లో బీజేపీకి 81,714 ఓట్లు, బీఆర్‌ఎస్‌కు 38,142 ఓట్లు, కాంగ్రెస్‌కు 36,022 ఓట్లు లభించాయి. లోక్‌సభ ఎన్నికలతో బీఆర్‌ఎస్ మరింత డీలా పడగా బీజేపీ జోష్ పెరిగింది.
స్థానిక ఎన్నికలకు ఎదురుచూపులు
స్థానిక సంస్థల పాలకవర్గాల గడువు ముగిసినా సకాలంలో ఎన్నికల నిర్వహణ జరగలేదు. ప్రత్యేక అధికారుల పాలన ముందుకొచ్చింది. జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు, 12 జడ్పీటీసీలు, 123 మంది ఎంపీటీసీలతోపాటు జడ్పీ చైర్మన్, మండల పరిషత్ చైర్మన్‌లు, సర్పంచులు నైరాశ్యంతోనే పదవులను వీడారు. పదవి వీడిన సర్పంచులు గత ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లుల కోసం ఆందోళనలు కొనసాగిస్తున్నారు. మరోవైపు స్థానిక సంస్థల కోసం మాజీ ప్రజాప్రతినిధులు, ఆశావహులు సిద్ధమవుతున్నారు. ఇదే క్రమంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు మొదలు పెట్టింది. ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల సందడి కూడా మొదలైంది. దీనికి తోడుగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన హడావుడి కొనసాగుతోంది. ఓటరు నమోదు వంటి కార్యక్రమాలు చేపట్టారు.
వలసల జోరు
అధికారం మారడంతో బీఆర్‌ఎస్‌కు షాకిస్తూ ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు మొదలయ్యాయి. బీఆర్‌ఎస్‌కు కొంత మంది దూరంగా ఉండగా సిరిసిల్ల, వేములవాడ రెండు నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్‌లో చేరడం మొదలు పెట్టారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కీలక పదవులు అనుభవించిన వారితోపాటు సర్పంచులు, ఎంపీపీలు, ఇతర పదవుల్లో ఉన్నావారు కాంగ్రెస్‌లో చేరారు. వేములవాడ నియోజకవర్గంలో జిల్లా అధ్యక్షుడు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గంలో ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో చేరికల పరంపర కొనసాగుతూనే ఉంది. బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేరికల పైనా ప్రత్యేక దృష్టిని సారించారు. కాంగ్రెస్‌లో ఖుషీ ఖుషీగా కొనసాగగా, కారులో లుకలుకలు కనిపించాయి. నామినేటేడ్ పోస్టులు ఆశించి పార్టీలు మారిన వారు పదవుల కోసం ఎదురు చూసే పరిస్థితి అధికార పార్టీ నేతల్లో కనిపిస్తోంది. మార్కెట్ కమిటీ నామినేటెడ్ పోస్టులతోపాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా నాగుల సత్యనారాయణ నియామకాలు జరిగాయి. వేములవాడ దేవస్థానంతోపాటు ఇతర పదవుల కోసం నాయకులు ఎదురు చూస్తున్నారు.
వామపక్షాలు, బీఆర్‌ఎస్ పోరుబాట
జిల్లాలో సీపీఎం, సీపీఐ, ఇతర వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు యఽథావిధిగా పోరుబాటను కొనసాగించాయి. ఇదేక్రమంలో అధికారం కోల్పోయి ప్రధాన ప్రతిపక్షంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు సైతం ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. పవర్‌లూం నేత కార్మికులు, గ్రామ పంచాయతీ, మున్సిపల్, మధ్యాహ్నా భోజన నిర్వాహకులు, ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంల సమస్యలతోపాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు ఆందోళనలు కొనసాగించాయి. క ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ విఫలమైందని, రైతు సమస్యలను పట్టించుకోవడం లేదని బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. ఇదే క్రమంలో బీఆర్‌ఎస్‌కు చెందిన నాయకులపై కేసులు నమోదవడంతో కక్ష సాధింపులు మొదలయ్యాయనే విమర్శలు అధికార పార్టీపై వచ్చాయి.
బీఆర్‌ఎస్‌కు అర్బన్ బ్యాంక్ ఊరట
సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఊరట లభించింది. బ్యాంక్ పాలకవర్గ పగ్గాలు చేపట్టాలని కాంగ్రెస్, బీజేపీ పావులు కదిపినా బీఆర్‌ఎస్‌కు చెందిన రాపెల్లి లక్ష్మీనారాయణ అధ్యక్షుడిగా, అడ్డగట్ట మురళి వైస్ చైర్మన్‌గా గెలుపొందారు. దీంతో ఆ పార్టీకి కాస్తా ఊరటగా దక్కింది.
రాజన్నను దర్శించుకున్న తొలి ప్రధాని మోదీ
వేములవాడ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్న తొలి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ నిలిచారు. గతంలో కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, స్వామివారిని దర్శించుకున్నా ప్రధాన మంత్రి హోదాలో పార్లమెంట్ ఎన్నికల సమయంలో బహిరంగ సభలో ప్రసంగించడానికి వచ్చి రాజన్నను దర్శించుకున్నారు. కోడెమొక్కు చెల్లించుకున్నారు.
సీఎం హోదాలో వేములవాడకు రేవంత్‌రెడ్డి
టీపీసీసీ అధ్యక్షుడిగా గతేడాది వేములవాడ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్న రేవంత్‌రెడ్డి ఈ సంవత్సరం ముఖ్యమంత్రి హోదాలో స్వామివారిని దర్శించుకున్నారు. కోడెమొక్కు చెల్లించుకోవడంతోపాటు ప్రత్యేక పూజలు చేశారు. వేములవాడలో ప్రజా విజయోత్సవాల సభలో ప్రసంగించారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ముఖ్యమంత్రితో మంత్రులు పొంగులేని శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహా, తుమ్మల నాగేశ్వర్‌రావు, కొండా సురేఖ రాజన్నను దర్శించుకున్నారు. మరోవైపు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జిల్లాలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు.